త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rameshwaram | రాముడి ఆరాధ్య దైవానికి కల్యాణం!

Rameshwaram | ఒక వైపు సముద్రపు కెరటాల సవ్వడులు.. మరోవైపు మంగళవాయిద్యాల మధురనాదాలు.. రామనామం జపించిన చోట శివనామస్మరణ మార్మోగుతోంది. రాముడు ప్రతిష్ఠించి పూజించిన రామనాథస్వామి కొలువైన పుణ్యక్షేత్రం.. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్నది రామేశ్వర క్షేత్రం.

P

Devotional | Published On Aug 12, 2026, 1.00 pm IST

Rameshwaram | రాముడి ఆరాధ్య దైవానికి కల్యాణం!
Advertisement
  • ఈ నెల 16న రామనాథస్వామి-పర్వత వర్ధిని అమ్మవారి తిరుకల్యాణ వేడుక
  • 17 రోజుల ఆడి ఉత్సవాల్లో కీలక ఘట్టం..
  • రామాయణంతో ముడిపడిన రామేశ్వర క్షేత్రం
  • ఆలయ చరిత్ర, విశేషాలు ఇవే..

Rameshwaram | ఒక వైపు సముద్రపు కెరటాల సవ్వడులు.. మరోవైపు మంగళవాయిద్యాల మధురనాదాలు.. రామనామం జపించిన చోట శివనామస్మరణ మార్మోగుతోంది. రాముడు ప్రతిష్ఠించి పూజించిన రామనాథస్వామి కొలువైన పుణ్యక్షేత్రం.. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్నది రామేశ్వర క్షేత్రం. అద్భుతమైన శిల్పకళకు అద్దం పట్టే సుదీర్ఘ ప్రాకారాలు, పవిత్ర 22 తీర్థాలతో అలరారే ఈ క్షేత్రం స్వామివారి తిరుకల్యాణ వేడుకలకు ముస్తాబైంది. ఇప్పటికే ఆడి ఉత్సవాలు మొదలు కాగా.. కీలక ఘట్టమైన రామనాథస్వామి–ప‌ర్వతవర్ధిని అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం ఈ నెల 16న కన్నులపండువగా జరగనుంది. స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రామేశ్వరం తరలిరానున్నారు.

17 రోజుల పండుగ..

ఆగస్టు 5న ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం రోజూ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు, వాహన సేవలు నిర్వహిస్తున్నారు. వెండి, బంగారు పల్లకులు, కామధేను, సింహం, ఏనుగు, రిషభ వాహనాలపై ఉత్సవమూర్తులు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆగస్టు 12న ఆడి అమావాస్య సందర్భంగా ప్రత్యేక తీర్థ కార్యక్రమాలు, ఆగస్టు 13న రథోత్సవం, 14న ఆడి పూరం, 15న తపసు కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇక 16న స్వామి–అమ్మవార్ల దివ్య కల్యాణం నిర్వహించనున్నారు. కల్యాణానికి ముందు రోజు హనుమంతుడి సన్నిధిలో నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించడం ఈ ఉత్సవ క్రమంలో ప్రత్యేకత. మరుసటి రోజు స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణం ఘనంగా జరుగుతుంది. ఆ తర్వాతి రోజుల్లో తిరుఊంజల్‌, పసుపునీరాట్టు, పట్టణ ప్రవేశం తదితర ఉత్సవాలు కొనసాగుతాయి.

రాముడు పూజించిన శివుడు

రామేశ్వరం పేరు వినగానే రామాయణ ఘట్టాలు గుర్తుకొస్తాయి. లంకలో రావణుడిపై విజయం సాధించిన అనంతరం శ్రీరాముడు తిరిగి ఈ ప్రాంతానికి వచ్చాడని స్థలపురాణం చెబుతోంది. రావణుడు బ్రాహ్మణుడు కావడంతో అతడిని సంహరించిన పాపానికి పరిహారం కోసం శ్రీరాముడు శివుడిని ఆరాధించాడని విశ్వాసం. శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలని రాముడు సంకల్పించగా.. హనుమంతుడు కైలాసం నుంచి లింగాన్ని తీసుకురావడానికి వెళ్లాడని కథనం. హనుమంతుడు ఆలస్యం చేయడంతో సీతాదేవి ఇసుకతో లింగాన్ని రూపొందించి పూజకు సిద్ధం చేసిందని స్థలపురాణం. అదే రామలింగంగా కొలువైందని భక్తుల విశ్వాసం. హనుమంతుడు తీసుకొచ్చిన లింగాన్ని విశ్వలింగంగా పిలుస్తారు. రాముడు హనుమంతుడు తెచ్చిన లింగానికే ముందుగా పూజ చేయాలని ఆదేశించాడని, ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందని ఆలయ విశేషాలు చెబుతున్నాయి. ఇలా విష్ణువు అవతారమైన రాముడు శివుడిని ఆరాధించిన క్షేత్రంగా రామేశ్వరం నిలిచింది. అందుకే శైవ, వైష్ణవ సంప్రదాయాల సమన్వయానికి ప్రతీకగా కూడా ఈ క్షేత్రాన్ని భావిస్తారు.

12 జ్యోతిర్లింగాల్లో ఒకటి.. 22 తీర్థాలు..

దేశంలోని ప్రసిద్ధ 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం ఒకటి. ‘రాముని నాథుడు’ అనే భావాన్ని ప్రతిబింబించేలా రామనాథస్వామి అనే పేరు ఏర్పడిందని చెబుతారు. ఉత్తర భారతంలోని కాశీతో పాటు దక్షిణ భారతంలో రామేశ్వరం అత్యంత ప్రాధాన్యమున్న శైవ క్షేత్రంగా భక్తులు భావిస్తారు. చార్‌ధామ్‌ యాత్రలోనూ రామేశ్వరానికి ప్రత్యేక స్థానం ఉంది. రామేశ్వర యాత్రలో అత్యంత ప్రత్యేకమైన ఆచారాల్లో 22 తీర్థాల్లో స్నానం ఒకటి. ఆలయ ప్రాంగణంలోనే 22 పవిత్ర బావులు (తీర్థాలు) ఉన్నాయి. వీటిలోని నీటికి ప్రత్యేకమైన రుచి, ఉష్ణోగ్రత ఉంటాయని యాత్రికులు చెబుతుంటారు. ఆలయ అధికారిక సమాచారం ప్రకారం.. 22 తీర్థాల్లో స్నానానికి ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు భక్తులను అనుమతిస్తారు. ఈ 22 తీర్థాలకు సంబంధించి రామాయణం, సంప్రదాయాలతో అనేక విశ్వాసాలు ముడిపడి ఉన్నాయి. ఆలయం వెలుపల సముద్ర తీరంలోని అగ్ని తీర్థాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. రాముడు రావణ సంహారం అనంతరం ఇక్కడ స్నానం చేసి శివుడిని పూజించాడని స్థలపురాణం చెబుతోంది. ఆలయ తూర్పు వైపునే అగ్ని తీర్థం ఉంటుంది. రామేశ్వర యాత్రలో ఆలయ దర్శనంతో పాటు అగ్ని తీర్థాన్ని సందర్శించడం భక్తుల సంప్రదాయంలో భాగంగా ఉంది. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఇక్కడ ప్రత్యేకంగా భక్తుల రద్దీ ఉంటుంది. సముద్రం, ఆలయం, రామాయణ గాథ.. ఈ మూడు కలిసి రామేశ్వరానికి వచ్చే భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి.

స్తంభాలు.. అద్భుతమైన ప్రాకారాలు

రామనాథస్వామి ఆలయానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు అపూర్వమైన వాస్తుశిల్ప వైభవం ఉంది. సుదీర్ఘమైన ప్రాకారాలు, వరుసగా నిలిచిన శిలాస్తంభాలు, శిల్పకళ ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. ఆలయ నిర్మాణ చరిత్ర 12వ శతాబ్దం నుంచి వివిధ దశల్లో కొనసాగిందని రామనాథపురం జిల్లా అధికారిక సమాచారం చెబుతోంది. సేతుపతి పాలకులు ఆలయ నిర్మాణ, విస్తరణలో కీలక పాత్ర పోషించారు. తూర్పు–పడమర దిశలో సుమారు 197 మీటర్లు, ఉత్తర–దక్షిణ దిశలో సుమారు 133 మీటర్ల విస్తీర్ణంతో ఉన్న మూడో ప్రాకారం ఆసియాలోనే అత్యంత పొడవైన ఆలయ కారిడార్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. వరుసగా కనిపించే స్తంభాల మధ్య నడుస్తుంటే ఒక చివర నుంచి మరో చివర కనిపించనంత పొడవుగా ఉండి.. ఈ దృశ్యం భక్తులను కట్టిపడేస్తుంది. ప్రతి స్తంభంలోని శిల్పాలు, పైకప్పు అలంకరణలు ద్రావిడ ఆలయ వాస్తుకళ వైభవాన్ని చాటుతాయి. మొత్తం ఆలయ సముదాయం సుమారు 15 ఎకరాల్లో విస్తరించి ఉంది.

పంబన్‌ వంతెన దాటితేనే..

రామేశ్వరం పంబన్‌ ద్వీపంలో ఉంది. ప్రధాన భూభాగం నుంచి ద్వీపానికి చేరుకోవాలంటే పంబన్‌ వంతెన మీదుగా ప్రయాణించాలి. సముద్రం మధ్య నుంచి రైలు, రహదారి ప్రయాణం చేయడం యాత్రలోనే ఓ ప్రత్యేక అనుభూతి కలిగిస్తుంది. పంబన్‌ వంతెన రామేశ్వరానికి భౌగోళిక అనుసంధానమే కాకుండా పర్యాటక ఆకర్షణగా కూడా మారింది. బ్రిటీష్‌ ప్రభుత్వ కాలంలో నిర్మించిన రైల్వే బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. దాంతో భారతీయ రైల్వే దాదాపుగా రూ.500కోట్లకుపైగా వ్యయంతో అత్యాధునిక రైల్వే వంతెనను నిర్మించింది. ప్రస్తుతం వంతెన మీదుగానే రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి.

ధనుష్కోడి.. రామసేతు జ్ఞాపకాలు

రామేశ్వరానికి వెళ్లినవారు ధనుష్కోడిని తప్పక చూడాలనుకుంటారు. ద్వీపం చివరన ఉన్న ఈ ప్రాంతం ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రంతో కనిపించే అరుదైన భౌగోళిక దృశ్యానికి ప్రసిద్ధి. 1964 తుపానులో ధనుష్కోడి తీవ్రంగా దెబ్బతింది. నేటికీ అక్కడి శిథిలాలు అప్పటి విషాదానికి గుర్తులుగా నిలిచాయి. రామసేతుతో ముడిపడిన పురాణ విశ్వాసాల కారణంగా ధనుష్కోడికి భక్తుల దృష్టిలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సమీపంలోని కోదండరామస్వామి ఆలయం కూడా చూడదగ్గ ప్రదేశం. అలాగే క్షేత్రం పరిధిలో పంచముఖి హనుమాన్‌ ఆలయం, గంధమాదన పర్వతం, రామపాదం, కోదండరామస్వామి ఆలయం, జడా తీర్థాలు ఉన్నాయి. రామేశ్వరం అంటే కేవలం ఆలయం మాత్రమే కాదు. భారత మాజీ రాష్ట్రపతి, ‘మిసైల్‌ మ్యాన్‌’గా పేరొందిన డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం బాల్యం కూడా ఈ ప్రాంతంతో ముడిపడి ఉంది. ఆయన జ్ఞాపకార్థం నిర్మించిన స్మారకం రామేశ్వరంలోని ముఖ్య పర్యాటక ప్రదేశాల్లో ఒకటి.

హైదరాబాద్‌ నుంచి ఎలా వెళ్లాలి?

పర్యాటకులు రామేశ్వరం వెళ్లేందుకు రైలు, విమానం సర్వీసులు అందుబాఉటలో ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి రామేశ్వరానికి రైలు ఉంది. వారానికోసారి రైలు నడుస్తుంది. ప్రయాణానికి సుమారు 26 గంటల వరకు టైమ్‌ పడుతుంది. అలాగే, రామేశ్వరం వెళ్లేందుకు మదురై వరకు రైళ్లు ఉన్నాయి. అక్కడి నుంచి క్షేత్రానికి చేరుకోవచ్చు. అయితే, రామేశ్వరంలో విమానాశ్రయం లేదు. సమీప ప్రధాన విమానాశ్రయం మదురై. మదురై విమానాశ్రయం రామేశ్వరం నుంచి సుమారు 175 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రామేశ్వరానికి చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి మదురైకి విమానంలో వెళ్లి.. అక్కడి నుంచి టాక్సీ, బస్సు, రైలు ద్వారా రామేశ్వరం వెళ్లొచ్చు. ఇక రోడ్డు మార్గంలో హైదరాబాద్‌–రామేశ్వరం ప్రయాణం సుదీర్ఘంగా ఉంటుంది. దాదాపుగా 1,100–1,300 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వాహనంలో వెళితే ఒక రోజులో ప్రయాణం చేయడం కష్టమే. మార్గ మధ్యలో ఇతర ఆలయాలు ఉన్నా వాటిని దర్శించుకుంటే వెళ్లడం ఉత్తమం.

రామేశ్వరం వెళ్లే గమనించాల్సిన ఇవే..

రామేశ్వరం రైల్వే స్టేషన్‌ నుంచి రామనాథస్వామి ఆలయం సుమారు 1.3 కిలోమీటర్లు. బస్టాండ్‌ ఆలయం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థానికంగా ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. ఆలయ అధికారిక సమాచారం ప్రకారం.. ఆలయం తెల్లవారుజామున 4 గంటలకు తెరుచుకుంటుంది. భక్తుల దర్శనానికి ఉదయం 5 గంటల నుంచి అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయ ద్వారాలు మూసి, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తెరుస్తారు. సాయంత్రం దర్శనానికి రాత్రి 8 గంటల వరకు అవకాశం ఉంటుంది. ఉత్సవాల రోజుల్లో సాధారణ రోజులతో పోలిస్తే రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆగస్టు 16 కల్యాణోత్సవం రోజున ముందుగానే రామేశ్వరం చేరుకుని వసతి, రవాణా, దర్శన ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. ఆలయ అధికారిక సేవలు, సమయాలు మారే అవకాశం ఉన్నందున బయలుదేరే ముందు సమాచారాన్ని తెలుసుకోవడం మంచిది.

భక్తి.. చరిత్ర.. ప్రకృతి.. అన్నీ కలిసిన క్షేత్రం

ఒకవైపు రాముడు పూజించిన శివలింగం.. మరోవైపు 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామనాథస్వామి.. చుట్టూ 22 తీర్థాలు.. అద్భుతమైన సుదీర్ఘ ప్రాకారాలు.. సముద్ర తీరంలోని అగ్ని తీర్థం.. పంబన్‌ వంతెన.. ధనుష్కోడి.. రామసేతు విశ్వాసాలు.. కలాం జ్ఞాపకాలు.. అందుకే రామేశ్వరం ఒక సాధారణ పుణ్యక్షేత్రం కాదు. పురాణం, చరిత్ర, శిల్పకళ, సముద్ర ప్రకృతి, భక్తి.. అన్నింటినీ ఒకే యాత్రలో అనుభవించే అరుదైన ప్రదేశం. ఆ పవిత్ర క్షేత్రంలో ఆగస్టు 16న జరిగే రామనాథస్వామి–పార్వతవర్ధిని అమ్మవారి తిరుకల్యాణం భక్తులకు మరో అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.

Advertisement
Advertisement