త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jakka Venkat Reddy | అందెశ్రీ పాట‌లు పాడితే నువ్ గ‌న్నులు ప‌ట్టుకొని తిరిగిన‌వ్‌.. నీకు ఆత్మ‌బంధువెట్ల‌యిత‌డు?

Jakka Venkat Reddy | అందెశ్రీ తెలంగాణ ఉద్య‌మంలో పాట‌లు పాడుకుంటూ తిరిగితే.. నువ్ గ‌న్నులు ప‌ట్టుకొని తిరిగింది మ‌ర్చిపోయావా అని సీఎం రేవంత్‌పై పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయ‌ర్‌ జక్క వెంక‌ట్‌రెడ్డి ఫైరయ్యారు. నీకు అందెశ్రీ ఆత్మ‌బంధువు ఎలా అవుతాడో చెప్పాల‌న్నారు.

S

Telangana | Published On Jul 19, 2026, 4.15 pm IST

Jakka Venkat Reddy | అందెశ్రీ పాట‌లు పాడితే నువ్ గ‌న్నులు ప‌ట్టుకొని తిరిగిన‌వ్‌.. నీకు ఆత్మ‌బంధువెట్ల‌యిత‌డు?
Advertisement
  • రాసిపెట్టుకో రేవంత్‌.. మ‌ళ్లీ వ‌చ్చేది కేసీఆరే
  • నీకు, నీ ముఠాకు చంచ‌ల్‌గూడ జైలే దిక్కు
  • మా నాయకుల జోలికి వస్తే ఖబర్ధార్
  • రేవంత్‌పై మాజీ మేయ‌ర్‌ జక్క వెంక‌ట్‌రెడ్డి ధ్వ‌జం

Jakka Venkat Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: అందెశ్రీ తెలంగాణ ఉద్య‌మంలో పాట‌లు పాడుకుంటూ తిరిగితే.. నువ్ గ‌న్నులు ప‌ట్టుకొని తిరిగింది మ‌ర్చిపోయావా అని సీఎం రేవంత్‌పై పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయ‌ర్‌ జక్క వెంక‌ట్‌రెడ్డి ఫైరయ్యారు. నీకు అందెశ్రీ ఆత్మ‌బంధువు ఎలా అవుతాడో చెప్పాల‌న్నారు. అందెశ్రీని స్వార్థ రాజ‌కీయాల‌కు వాడుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. మ‌ళ్లీ వ‌చ్చేది కేసీఆరేన‌ని.. నీతో పాటు నీ ముఠా స‌భ్యుల‌కు కేరాఫ్ చంచ‌ల్‌గూడ జైలే దిక్కని హెచ్చ‌రించారు. సీఎంగా ఉండి తెలంగాణ‌లో ఇంకెప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేస్తున్నందుకు రేవంత్‌ను అభినందిస్తున్నామ‌ని ఎద్దేవా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఆదివారం మాట్లాడుతూ రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

నిజం తెలిసేలోపు అబ‌ద్దం ఊరంత తిరిగి వ‌స్తుంది అనే నానుడి నీకు స‌రిపోత‌ది..

ప‌విత్ర‌మైన ప్ర‌జా క‌వి అందెశ్రీ స‌మాది సాక్షిగా ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ప్ర‌ధాత‌పై ల‌త్కోర్ మాట‌లు మాట్లాడుతావా? అబ‌ద్దాల‌ను అల‌వోక‌గా చెప్ప‌డంలో రేవంత్ రెడ్డి దిట్ట. నిజం తెలిసేలోపు అబ‌ద్దం ఊరంత తిరిగి వ‌స్తుంది అనే నానుడి రేవంత్‌కు ప‌ర్‌ఫెక్ట్ స‌రిపోతుంది. సీఎం స్థాయిలో ఉండి.. నీది నోరు కాదు.. మోరీ అని నిరూపించుకుంటున్నావు. మా నాయ‌కుడు కేటీఆర్ యువ సంగ్రామ స‌ద‌స్సుతో రాష్ట్రంలో మీ ప‌ని అయిపోయిందని మీ పార్టీ పాయ‌కులే చ‌ర్చించుకుంటున్నారు అని జ‌క్క పేర్కొన్నారు.

ప‌రాయి పాల‌న‌ను పార‌దోలి స్వ‌ప‌రిపాల‌న‌కు శ్రీకారం చుట్టిన కేసీఆర్.. తెలంగాణ‌ను దేశంలోనే అగ్ర‌గామిగా నిలిపారు. నువ్వేమో తెలంగాణ రాష్ట్రాన్ని అధ‌పాతాళానికి తోస్తున్నావు. తెలంగాణకు కీడు చేస్తూ నీ గురువు చంద్ర‌బాబుకు మేలు చేస్తున్నావ్‌. అందుకే కాళేశ్వ‌రం జ‌లాల‌ను ఎత్తిపోయ‌కుండా సీమాంధ్ర‌లోని ప‌ట్టిసీమ‌కు నీళ్లు మ‌ళ్లిస్తున్నావు. దేశంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు నిర్మించి కేసీఆర్ రికార్డు నెల‌కొల్పితే.. నువ్వేమో హైడ్రా ముసుగులో ప్ర‌జ‌ల ఇండ్లు కూల‌గొట్టడంలో రికార్డు నెల‌కొల్పిన‌వ్ అని విమ‌ర్శించారు.

మా కేసీఆర్ ప్ర‌భుత్వం మొత్తం 11,062 టీచ‌ర్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు ఇస్తే, నీవు నియామ‌క ప‌త్రాలిచ్చిన‌వ్. మా కేసీఆర్ గ్రూప్‌-1 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇస్తే, నీవు వ‌చ్చి నియామ‌క ప‌త్రాలిచ్చిన‌వ్‌. మందికి పుట్టిన పిల్ల‌ల‌ను మా పిల్ల‌ల‌ని చెప్పుకుంటున్నావు. నీవు నియామ‌క ప‌త్రాలిచ్చిన గ్రూప్‌-1 ఉద్యోగుల‌కు జీతాలు ఇస్తున్నావా..? చెప్పు.. నాడు కేసీఆర్ ప్ర‌భుత్వం 2014-2023లోపు కేవ‌లం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతు సంక్షేమానికి రూ.3.2 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టారు. ఈ రెండున్న‌ర సంవ‌త్స‌రాల‌లో నీవు ఎంత ఖ‌ర్చు చేసిన‌వో చెప్పు? రైతుల‌ వ‌డ్లు కొనేదిక్కు లేదు, రైతుల‌కు ఎరువుల స‌ర‌ఫ‌రాపై సోయి లేదు. కానీ రైతును రాజు చేయాలని సంక‌ల్పించిన కేసీఆర్‌పై అవాకులు చెవాకులు, పేలుతావా? ఎంత‌సేపు ఏడుగొంటి మాట‌లతో కాలం వెళ్ల‌దీస్తున్న మీ ప్ర‌భుత్వానికి మ‌రో రెండేండ్లు మిగిలింది అని జ‌క్క పేర్కొన్నారు.

నీకు తెల్వ‌కుంటే సీత‌క్క‌ను అడుగు..

గ‌డిచిన దాదాపు మూడేండ్ల‌లో మీరు మీ ప్ర‌భుత్వం చేసింది భూ దందాలు, బ్లాక్ మెయిలింగ్‌, పేద‌ల ఇండ్లు కూల‌గొట్ట‌డం. నీవు మా కేసీఆర్‌ను సీఎం కానివ్వ‌ను అంటున్నావ్‌? అయితే మీరు సీఎంగా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ‌లో మ‌ల్లెప్పుడూ కూడా అధికారంలోకి రాకుండ చేసినందుకు నిన్ను అభినందించాలి. మొత్తం బ‌డ్జెట్‌లో నీ ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికి రూ.10వేల కోట్లు కేటాయించుకుని, రాష్ట్రంలోని మిగిలిన 118 అసెంబ్లీ స్థానాల‌కు మొండి చేయి చూపిస్తున్న‌ది నిజం కాదా? అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి గ్రామ పంచాయితీల‌కు ఇచ్చింది పెద్ద గుండు సున్నా. నీకు తెలియ‌కుంటే మంత్రి సీత‌క్కను అడుగు. నీ ప్ర‌భుత్వంలో క‌మీష‌న్ల కార‌ణంగా నేడు కాంట్రాక్టులు రోడ్డున ప‌డ్డారు. నీ పాల‌న పుణ్య‌మాని.. నేడు తెలంగాణ‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌ ఆత్మ‌హ‌త్య‌లు, రైతుల‌కు ఎరువులు, సాగు నీటి క‌ట‌క‌ట‌, ఉద్యోగుల‌కు, పింఛ‌న‌ర్ల‌కు హ‌రిగోస అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నీ వ‌ల్ల రాష్ట్రంలో ఏ ఒక్క వ‌ర్గ ప్ర‌జ‌లు సంతోషంగా లేరు. కానీ నువ్వు, నీ అన్న‌ద‌మ్ములు మాత్రం వంద‌ల కోట్ల‌ను దోచుకుని తెలంగాణ‌ను లూటీ చేస్తున్నారు. నీవు చ‌రిత్ర హీనుడిగా, తెలంగాణ హిట్ల‌ర్‌లా నిలిచిపోతావు. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి.. తెలంగాణలో మ‌ళ్లీ వ‌చ్చేది కేసీఆరే. నువ్వు.. నీ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళితే.. నీతో పాటు నీ పార్టీ ఎమ్మెల్యేల‌కు డిపాజిట్లు కూడా రావు అని జ‌క్క ఫైర‌య్యారు.

Advertisement
Advertisement