త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

99TV Statesman Awards | నాయకుడు అనడానికి అర్హత ఫాలోవర్స్ కాదు.. క్యారెక్టర్

రాజకీయం అంటే కేవలం ఎన్నికల్లో గెలవడమే కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. యువతకు ఆయన ఇచ్చిన సందేశం ఇదే!

J

Telangana | Published On Jul 25, 2026, 7.41 pm IST

99TV Statesman Awards | నాయకుడు అనడానికి అర్హత ఫాలోవర్స్ కాదు.. క్యారెక్టర్
Advertisement
  • 99TV కాంక్లేవ్‌లో హరీశ్ రావు స్ఫూర్తిదాయక స్పీచ్
  • కేసీఆర్ నాయకత్వం, యువత పోరాటమే తెలంగాణ సాధనకు నిదర్శనమని కితాబు
  • కేంద్ర మంత్రి రాజీనామా చేయడంలో 'జెన్-జి' (Gen Z) యువత పోరాటానికి అభినందన
  • ఫాలోవర్స్ సంఖ్యను చూసి నాయకత్వం అని భ్రమపడొద్దని, వ్యక్తిత్వమే లీడర్‌కు ముఖ్యమని యువతకు సూచన

99TV Statesman Awards | త్రినేత్ర.న్యూస్ : రాజకీయం (Politics) అంటే కేవలం ఎన్నికల్లో గెలవడం, అధికారం చెలాయించడం మాత్రమే కాదు.. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. 99టీవీ ఆధ్వర్యంలో జరిగిన 'స్టేట్స్‌మ్యాన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ – కాంక్లేవ్' (Statesman Excellence Awards - Conclave)లో ఆయన పాల్గొన్నారు. 'పాలిటిక్స్ బియాండ్ పవర్' (Politics Beyond Power) అనే అంశంపై మాట్లాడుతూ యువతను ఉద్దేశించి ఆయన పవర్ ఫుల్ మెసేజ్ ఇచ్చారు.

నిజమైన రాజకీయం అంటే ఇదే

యువతలో రాజకీయం అంటే ఎలక్షన్స్, సోషల్ మీడియా ట్రెండ్స్, రాజకీయ విమర్శలు మాత్రమే అనే అపోహ ఉందని హరీశ్ రావు అన్నారు. కానీ నిజమైన రాజకీయం అంటే రైతుకు నీరు, బిడ్డకు ఎడ్యుకేషన్ (Education), యువతకు ఉపాధి, సరైన రోడ్లు, మెరుగైన వైద్యం అందించడమేనని వివరించారు. పవర్ (Power) అనేది కేవలం సేవ చేయడానికి ఉపయోగపడే ఒక టూల్ మాత్రమేనని, ప్రజా సేవే అంతిమ లక్ష్యం కావాలని గుర్తుచేశారు.

కేసీఆర్ విజన్‌.. తెలంగాణ సాకారం

ఒక బలమైన నాయకత్వానికి, యువత (Youth) శక్తి తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో చెప్పడానికి తెలంగాణ ఉద్యమమే బెస్ట్ ఎగ్జాంపుల్ అని ఆయన అన్నారు. తెలంగాణ సాధన అసాధ్యమనుకున్న తరుణంలో.. కేసీఆర్ తన విజన్, అకుంఠిత దీక్షతో దానిని ఒక క్రమశిక్షణతో కూడిన ప్రజాస్వామిక ఉద్యమంగా మార్చారన్నారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమానికి దిశానిర్దేశం చేసిందని.. ఆ స్ఫూర్తితోనే యువత, విద్యార్థులు కెరీర్‌ను సైతం పక్కనపెట్టి ప్రాణాలకు తెగించి పోరాడి రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు.

ప్రతిపక్షంలో ఉన్నా సేవ చేయొచ్చు

పవర్ ఉన్నప్పుడే కాదు.. అపోజిషన్ (Opposition) లో ఉన్నా బాధ్యతతో పనిచేసి ప్రజలకు మేలు చేయవచ్చని హరీశ్ రావు చెప్పారు. దీనికి ఉదాహరణగా దేవాదుల ప్రాజెక్టును ప్రస్తావించారు. ప్రతిపక్షంగా ఉంటూనే ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి.. దేవాదుల పంపులు ఆన్ చేయించి రైతుల పొలాలకు నీళ్లు వచ్చేలా చేశామని.. డెమోక్రసీ (Democracy) అంటే ఇదేనని ఆయన స్పష్టం చేశారు.

Gen Z పవర్.. AI కేవలం టూల్ మాత్రమే

నేటి జెన్-జి (Gen Z) యువత తలుచుకుంటే సిస్టమ్‌ను ఎలా మార్చగలదో ఇటీవల జరిగిన పరిణామాలే నిదర్శనమని ఆయన అన్నారు. యువత చేసిన వీరోచిత పోరాటం వల్లే కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని అభినందించారు. ప్రశ్నించే యువతతోనే ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. ఈరోజు ప్రపంచ నాలెడ్జ్ అంతా యువత అరచేతిలో ఉందని.. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం ప్రశ్నలకు ఆన్సర్స్ మాత్రమే ఇస్తుందని, మానవత్వంతో ఆలోచించే మనిషి మాత్రమే సొసైటీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలడని చెప్పారు.

వ్యక్తిత్వమే నాయకుడి అసలైన అర్హత

సోషల్ మీడియాలో ఫాలోవర్స్ (Followers) సంఖ్య చూసి అదే లీడర్‌షిప్ అని భ్రమపడవద్దని ఆయన యువతను హెచ్చరించారు. నాయకుడికి ఉండాల్సిన అతిపెద్ద క్వాలిటీ 'క్యారెక్టర్' (Character) అని చెప్పారు. ప్రభుత్వ ఆఫీసుల్లోని ప్రతి ఫైల్ వెనుకా ఒక మనిషి జీవితం ఉంటుందనే స్పృహ ప్రజా ప్రతినిధులకు ఉండాలన్నారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ మనం చేసిన సేవ మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. దేశ నిర్మాణంలో యువత కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోకుండా.. బాధ్యత గల పౌరులుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన లోర్వెన్ క్రాఫ్ట్స్, 99టీవీ నిర్వాహకులను ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
Advertisement