త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | ఆర్మీ నియామ‌కాల్లో యువ‌త‌ను ప్రోత్స‌హించేందుకు క‌లిసి ప‌ని చేస్తాం

Revanth Reddy | భారత ఆర్మీ చేపట్టే నియామకాల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించేలా కలిసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విపత్తు నిర్వహణలో ఆర్మీ పాత్రపై చర్చించారు.

S

Telangana | Published On Aug 12, 2026, 6.42 pm IST

Revanth Reddy | ఆర్మీ నియామ‌కాల్లో యువ‌త‌ను ప్రోత్స‌హించేందుకు క‌లిసి ప‌ని చేస్తాం
Advertisement
  • వరదల వేళ క్రియాశీలంగా ప‌ని చేసేలా చూడండి
  • లెఫ్టినెంట్ జనరల్ సి.రాజేష్ పుష్కర్‌ను కోరిన సీఎం రేవంత్

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: భారత ఆర్మీ చేపట్టే నియామకాల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించేలా కలిసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. స్థానిక యువతకు భారీ అవకాశాలు కల్పించే లక్ష్యంతో అనువైన జిల్లా కేంద్రాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బుధ‌వారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆయ‌న్ను క‌లిసిన భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి.రాజేష్ పుష్కర్‌ను కోరారు.

ఈ సంద‌ర్భంగా రాజేశ్‌పుష్క‌ర్‌తో విపత్తు నిర్వహణలో ఆర్మీ పాత్రపై చర్చించారు. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస చర్యల్లో ఆర్మీ యంత్రాంగం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కోరారు.

దీనిపై సానుకూలంగా స్పందిస్తూ దేశ వ్యాప్తంగా నిర్వహించే వివిధ ఆర్మీ రిక్రూట్మెంట్‌లకు ముందు ఆయా తెలంగాణ జిల్లా కేంద్రాల్లో యువతకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకు లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ సుముఖత వ్యక్తం చేశారు. తెలంగాణలో విపత్తు పరిస్థితుల్లో ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని స్థానిక ఆర్మీ అధికారులను ఆదేశిస్తానన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును రాజేశ్‌పుష్క‌ర్‌ కొనియాడారు. హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి, చారిత్రక వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు మూసీ నది పునరుజ్జీవనం అవసరమ‌ని పున‌రుద్ఘాటించారు.

ఈ భేటీలో మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డితో పాటు మేజర్ జనరల్ శ్రీనివాస్ రావు, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement