త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Towers | రేపు ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌

Indiramma Towers | హైదరాబాద్ మహానగరంలో ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల కలను సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

S

Telangana | Published On Aug 12, 2026, 6.02 pm IST

Indiramma Towers | రేపు ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌
Advertisement

క్యూర్ పరిధిలో ఏడాదిలో లక్ష ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం
తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 8 వేల ఇళ్ల నిర్మాణం
అర్హులైన పేదలకు పారదర్శకంగా లక్కీడిప్ ద్వారా కేటాయింపు
ఏడాదిలో గృహప్రవేశాలు జరిగేలా ప్రణాళిక
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్ల‌డి

Indiramma Towers | త్రినేత్ర‌.న్యూస్ : హైదరాబాద్ మహానగరంలో ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల కలను సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. క్యూర్‌ పరిధిలో చేపడుతున్న ప్రతిష్టాత్మక ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి 13న‌(గురువారం) సాయంత్రం కూక‌ట్‌ప‌ల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంపై బుధ‌వారం అధికారుల‌తో మంత్రి స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూక‌ట్‌ప‌ల్లిలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శంకుస్ధాప‌న చేయ‌నున్న ఐదు ఎక‌రాల ప్రాంతంలో నాలుగు ట‌వ‌ర్స్ నిర్మిస్తామ‌ని ఒక్కో ట‌వ‌ర్‌లో 120 చొప్పున ఫ్లాట్స్ ఉంటాయ‌న్నారు. ఒక్కో ఫ్లోర్‌లో 12 ఫ్లాట్స్ ఉండేలా 480 ఫ్లాట్స్ నిర్మాణం జ‌రుగుతుంద‌ని దీనికోసం రూ. 43.20 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని తెలిపారు. క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మాణానికి ఇంత‌వ‌ర‌కు సుమారు 90 ఎక‌రాల‌ను ఎంపిక చేశామ‌ని మంత్రి తెలిపారు.

క్యూర్ పరిధిలో ఈ ఏడాది లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, తొలి విడతలో ప్రయోగాత్మకంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 8,000 ఇళ్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి సంబంధించి గత నెల 20వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామని, ఇప్పటివరకు సుమారు 50 వేల దరఖాస్తులు అందాయని మంత్రి తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు.

రాజకీయ జోక్యం లేకుండానే అర్హులైన పేదలకు ఇండ్లు

దరఖాస్తుల స్వీకరణ అనంతరం అర్హతలను పూర్తిస్థాయిలో పరిశీలించి, ఎలాంటి రాజకీయ జోక్యం, సిఫార్సులు, అవకతవకలకు తావులేకుండా అర్హులైన పేదల నుంచి పారదర్శక పద్ధతిలో డ్రా/లక్కీడిప్ ద్వారా ఇళ్ల కేటాయింపు చేపడతామని తెలిపారు. ఇల్లు మంజూరు కాని దరఖాస్తుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు చెల్లించిన ఈఎండీ మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లిస్తామన్నారు.

వచ్చే ఏడాది బోనాల పండుగకు గృహప్రవేశాలు

ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా, వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది బోనాల పండుగ సమయానికి ఎంపికైన లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శంకుస్థాపన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి దశను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, నిర్ణీత గడువులో నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.

Advertisement
Advertisement