త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | 2027 ఆగ‌స్టులోపు మూడు బ్యారేజీలు రిపేర్ చేస్తం

Uttam Kumar Reddy | కాళేశ్వ‌ర మూడు బ్యారేజీల‌ను వ‌చ్చే వాన‌కాలం అంటే 2027 జూలై-ఆగ‌స్టు వ‌ర‌కు మ‌రమ్మ‌తులు పూర్తి చేస్తామ‌ని మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఏమేం చేయాల్నో చ‌ర్చించి అక్టోబ‌ర్ వ‌ర‌కు నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. టెస్టింగ్‌లు లాస్ట్ స్టేజీలో ఉన్నాయ‌ని.. డ‌యాఫ్ర‌మ్ వాల్ కట్టాల్సి వ‌స్త‌దేమోన‌ని పేర్కొన్నారు.

S

Telangana | Published On Jul 5, 2026, 5.00 pm IST

Uttam Kumar Reddy | 2027 ఆగ‌స్టులోపు మూడు బ్యారేజీలు రిపేర్ చేస్తం
Advertisement
  • ఐఐటీ బాంబే నివేదిక వ‌స్తే అన్ని తెలుస్త‌య్‌
  • డ‌యాఫ్ర‌మ్ వాల్ క‌ట్టాల్సి వ‌స్త‌దేమో
  • బీఆర్ఎస్ వ‌ల్లే కాళేశ్వ‌రం నీళ్లు ఉప‌యోగిస్తలేం 
  • క‌ళేశ్వ‌రం క‌ట్టింది, కూలింది బీఆర్ఎస్ ఉన్న‌ప్పుడే
  • నీళ్లు స్టోరేజ్ చేసిన‌ప్పుడు కూలితే భ‌ద్రాచ‌లం, 44 గ్రామాలు కొట్టుకుపోత‌య్‌
  • బీఆర్ఎస్ నేత‌ల తీరు ఉల్టా చోర్ కొత్వాల్‌కు దండే అన్న‌ట్లు ఉంది
  • కేటీఆర్ నాట‌కాలాడుతున్నారు
  • బీఆర్ఎస్‌పై మంత్రి ఉత్త‌మ్ ధ్వ‌జం

Uttam Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: కాళేశ్వ‌ర మూడు బ్యారేజీల‌ను వ‌చ్చే వాన‌కాలం అంటే 2027 జూలై-ఆగ‌స్టు వ‌ర‌కు మ‌రమ్మ‌తులు పూర్తి చేస్తామ‌ని మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఏమేం చేయాల్నో చ‌ర్చించి అక్టోబ‌ర్ వ‌ర‌కు నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. టెస్టింగ్‌లు లాస్ట్ స్టేజీలో ఉన్నాయ‌ని.. డ‌యాఫ్ర‌మ్ వాల్ కట్టాల్సి వ‌స్త‌దేమోన‌ని పేర్కొన్నారు. ఐఐటీ బాంబే నివేదిక వ‌స్తే అన్ని విష‌యాలు తెలుస్తాయ‌ని వివ‌రించారు. ఆ ప్రాజెక్టు క‌ట్టింది కూలింది బీఆర్ఎస్ హ‌యాంలోనేన‌ని ఇంజినీర్లు నివేదిక‌లిచ్చార‌ని గుర్తుచేశారు. బీఆర్ఎస్ వ‌ల్లే కాళేశ్వ‌రం ప్రాజెక్టు నీళ్లు వినియోగించ‌లేక‌పోతున్నామ‌న్నారు. ఈరోజు కేటీఆర్‌ కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి నాటకమాడుతున్నారని మండిప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కులు ఏది ముట్టుకుంటే అది నాశ‌న‌మ‌ని ఆరోపించారు. ప‌దేళ్ల‌లో నీళ్ల శాఖ‌ను నాశ‌నం చేస్తే చ‌క్క‌దిద్దామ‌ని పేర్కొన్నారు. ఆదివారం సెక్రెటేరియ‌ట్ వ‌ద్ద నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాళేశ్వ‌ర మూడు బ్యారేజీల‌ను వ‌చ్చే వాన‌కాలం అంటే 2027 జూలై-ఆగ‌స్టు వ‌ర‌కు మ‌రమ్మ‌తులు పూర్తి చేస్తం. దాని కోసం ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంది. అస‌త్య ప్ర‌చారాల‌ను ఖండిస్తున్నం. ఈ ప‌రిస్థితికి వాళ్లే కార‌ణం. నీళ్లు పంపు చేసి ఎక్క‌డికి పంపాలి. స‌రే అన్నారం పంపాలే అనుకుందాం.. మ‌రి ఆ బ్యారేజ్ కూడా స‌రిగా క‌ట్ట‌లేదు క‌దా. అందులో కూడా ఫౌండేష‌న్ స్టోన్ లీకింగ్ ఉంది. ఏమేం చేయాల్నో చ‌ర్చించి అక్టోబ‌ర్ వ‌ర‌కు నిర్ణ‌యం తీసుకుంటాం. డయాఫ్రమ్ వాల్ క‌ట్టాల్సి వ‌స్త‌దేమో. ఆ డిజైన్ అవుతోంది. టెస్టింగ్ లాస్ట్ స్టేజీలో ఉంది. ఒక నెల‌రోజుల్లో ప‌ని మొద‌లుపెడ‌తం. ఐఐటీ బాంబే వారు ఇచ్చే నివేదిక వ‌చ్చే వ‌ర‌కు ఏం చెప్ప‌లేం అని ఉత్త‌మ్ చెప్పారు.

మ‌హారాష్ట్ర‌తో మాట్లాడుతున్నం..

ప్ర‌వాహ సమ‌యంలో టెస్టింగ్ చేయ‌లేం. ఆగిపోయాక టెస్టింగ్ మొదలు పెట్టినం. ఈ స‌మ్మ‌ర్‌లోనే పూర్తి చేశాం. క‌ర్ణాట‌కలోని ఒక్క గేటు పోతే దానికి ఈ మూడు బ్యారేజీల‌కు పోల్చొద్దు. తుమ్ముడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చుకోవాలి. 80 టీఎంసీలు తీసుకొచ్చేలా ప్ర‌ణాళిక‌లు చేస్తున్నం. తుమ్ముడిహెట్టి, ఎల్లంప‌ల్లి విష‌యంలో మ‌హారాష్ట్ర‌తో మాట్లాడుతున్నం. వాటిని కూడా పూర్తి చేస్తం. ఎల్‌నినో అనేది తెలంగాణ‌కే ప‌రిమితం కాదు. అది ప్ర‌పంచ స్థాయి స‌మ‌స్య‌. దాని ప్ర‌భావం లేకుండా చూస్తం. అందుకు త‌గిన ప్ర‌ణాళిక‌లు, కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నం. స‌మ‌స్య రాకుండా చూస్తం అని ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

క‌మీష‌న్ల కోస‌మే క‌ట్టారు..

పదేళ్లలో తెలంగాణ ప్రజల జీవితాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ శాఖను చక్కదిద్దామన్నారు. అధిక శాతం లోన్లు తీసుకొచ్చి బీఆర్ఎస్ నాయకుల క‌మీష‌న్ల కోస‌మే కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. కానీ తెలంగాణ ప్రజల కోసం క‌ట్ట‌లేద‌న్నారు. రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రపు ఆయకట్టు ఇచ్చారని చెప్పారు. ఆ ప్రాజెక్టులు అన్ని అసంపూర్తిగా ఉన్నాయన్నారు.

ఉల్టా చోర్ కొత్వాల్‌కు దండే అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు ఉందని ఎద్దేవా చేశారు. కన్నెపల్లి పంపు దగ్గరకు పోయి ప్రాణహిత పంపు ఆన్ చేసి నీళ్లు ఇవ్వాలంటూ కేటీఆర్ నాటకాలు ఆడుతున్నారని ఫైర‌య్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు సరిగా కడితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

కాళేశ్వ‌రం కొన‌సాగిస్తే ప్ర‌మాద‌మ‌ని నిపుణులు నివేదిక‌లిచ్చారు..

నాసిరక నిర్మాణం వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు ఉపయోగించలేకపోతున్నామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫౌండేషన్ తప్పుగా ఉందని అధికారులే నివేదిక‌లు ఇచ్చార‌న్నారు. కాళేశ్వరం ఇలానే కొనసాగిస్తే ప్రమాదమని అంతర్జాతీయ, జాతీయ నీటి నిపుణులు రిపోర్టులు ఇచ్చార‌ని గుర్తు చేశారు. కేటీఆర్ కంటే ఎన్డీఎస్‌ఏ అధికారులకు నాలెడ్జ్ ఎక్కువగా ఉందని తాను అనుకుంటున్నానని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు స్టోరేజ్ చేసినప్పుడు కూలిపోతే కింద ఉన్న 40 ఊర్లు, భద్రాచలం కొట్టుకుపోతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు కమీషన్లకు కక్కుర్తి పడి తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టకుండా తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. అవి క‌డితే ఉత్తర తెలంగాణ ఎప్పుడో సస్యశామలం అయ్యేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర‌ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ, నాయ‌కుల‌కు మంచి పేరు వస్తుందన్న అక్క‌సుతో తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు డిజైన్ మార్చారని మంత్రి ఉత్త‌మ్‌ ఆరోపించారు.

 

Advertisement
Advertisement