త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ఉపాధి ఉన్న ద‌గ్గ‌రే ఇందిర‌మ్మ‌ ఇండ్లు కట్టిస్తం

Ponnam Prabhakar | ఉపాధి ఉన్న ద‌గ్గ‌రే ఇందిర‌మ్మ ఇండ్లు క‌ట్టిస్తామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. హైద‌రాబాద్‌లో ప‌క్కా ల‌క్ష ఇండ్లు నిర్మించి ఇస్తామ‌న్నారు. గత పదేళ్లుగా గృహాల కోసం ఎదురుచూసిన లబ్ధిదారులు పడిన ఇబ్బందులను ప్రభుత్వం గుర్తిస్తోంద‌న్నారు.

S

Telangana | Published On Jul 5, 2026, 6.58 pm IST

Ponnam Prabhakar | ఉపాధి ఉన్న ద‌గ్గ‌రే ఇందిర‌మ్మ‌ ఇండ్లు కట్టిస్తం
Advertisement
  • హైద‌రాబాద్‌లో ప‌క్కా ల‌క్ష నిర్మిస్తం
  • చాంద్రాయ‌ణ‌గుట్ట నియోజ‌క‌వ‌ర్గంలో 361 గృహాల‌కు ప‌ట్టాలిచ్చాం
  • ఇళ్ల ప‌ట్టాల పంపిణీలో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: ఉపాధి ఉన్న ద‌గ్గ‌రే ఇందిర‌మ్మ ఇండ్లు క‌ట్టిస్తామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. హైద‌రాబాద్‌లో ప‌క్కా ల‌క్ష ఇండ్లు నిర్మించి ఇస్తామ‌న్నారు. గత పదేళ్లుగా గృహాల కోసం ఎదురుచూసిన లబ్ధిదారులు పడిన ఇబ్బందులను ప్రభుత్వం గుర్తిస్తోంద‌న్నారు. ఆ జాప్యానికి ప్రభుత్వ ప్రతినిధిగా త‌న‌కు బాధేస్తుంద‌న్నారు. సంక్షేమ పథకాల అమల్లో ఆలస్యం కాకుండా పనిచేస్తున్నామన్నారు. ఆదివారం హైదరాబాద్ కలెక్టరేట్ లో రాష్ట్ర మైనారిటీల సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మాజీద్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా లతో కలిసి 2 బీహెచ్‌కే గృహాల పట్టాలను ఆయ‌న అందచేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడ మండలానికి చెందిన లబ్ధిదారులకు 187 గృహాలు, నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్‌నగర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు 79 గృహాలు, నాచారం కాలనీకి చెందిన లబ్ధిదారులకు 95 గృహాలు కేటాయించాం. మొత్తం 361 గృహాలను పట్టాలు పంపిణీ చేసి తాళాలు అందజేశాం అని మంత్రి పొన్నం తెలిపారు.

అర్హత గల పేద నిరుపేద కుటుంబాలకు శాశ్వత నివాసాన్ని కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్‌లో వివిధ వృత్తుల్లో ఉపాధి చేసుకుంటున్న‌ పేదలకు అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇస్తం. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. గృహాలు పొందుతున్న ప్రతి కుటుంబానికి అభినందనలు. ఇది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేద కుటుంబాల కల సాకారమైన చారిత్రక సందర్భంగా అని పొన్నం పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గృహ నిర్మాణ విధానాన్ని రూపొందించాం. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందజేశాం. ఇంకా అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే కార్డు జారీ చేసే విధానాన్ని అమలు చేస్తున్నాం. నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది అని మంత్రి పొన్నం తెలిపారు.

మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. హైదరాబాద్‌లో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యత్వాన్ని పెంచాలి. మహిళలకు వడ్డీ లేని రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా విద్య, ఉపాధి, కుటుంబ అవసరాలు, ప్రార్థనా స్థలాలకు వెళ్లేందుకు ఎంతో సౌలభ్యం కలిగింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాం. వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది అని ప్ర‌భాక‌ర్ వివ‌రించారు.

హైదరాబాద్‌లోని పాత ప్రభుత్వ గృహ సముదాయాలు, వాంబే హౌసింగ్, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం తదితర పథకాల కింద నిర్మించిన పాత భవనాలపై సమగ్ర సర్వే నిర్వహించాలి. ఇందుకు కలెక్టర్ చొర‌వ తీసుకోవాలి. నివాసయోగ్యం కాని భవనాలను వెంటనే ఖాళీ చేయించాలి. పూర్తిగా శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేసి పునర్నిర్మించేందుకు మూడు విభాగాలుగా వర్గీకరించి నివేదిక సిద్ధం చేయాలి అని సూచించారు.

మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ ప్రసంగిస్తూ పేదలకు శాశ్వత గృహం కల్పించడం సామాజిక న్యాయానికి ప్రతీక అన్నారు. ప్రతి పేద కుటుంబానికి పారదర్శకంగా గృహాల పంపిణీ జరుగుతోందన్నారు. పేదలకు నగరంలోనే ఇళ్లు నిర్మించి అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.

 

 

Advertisement
Advertisement