త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కేసీఆర్‌కు వారం రోజులు కాళేశ్వ‌రంను అప్ప‌జెప్పు.. రాష్ట్ర‌మంతా నీళ్లు పారిస్తాం..

KTR | తెలంగాణ రైతాంగానికి కాళేశ్వ‌రం కేసీఆర్ ఇచ్చిన వ‌ర‌మైతే.. రేవంత్ రాష్ట్రానికి ప‌ట్టిన శ‌నేశ్వ‌రం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌కు వారం రోజులు కాళేశ్వ‌రం ప్రాజెక్టును అప్ప‌జెప్పితే.. తెలంగాణ అంత‌టికీ నీళ్లు పారించి చూపుతామ‌ని ఆయ‌న తెలిపారు.

S

Telangana | Published On Jul 5, 2026, 6.47 pm IST

KTR | కేసీఆర్‌కు వారం రోజులు కాళేశ్వ‌రంను అప్ప‌జెప్పు.. రాష్ట్ర‌మంతా నీళ్లు పారిస్తాం..
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రైతాంగానికి కాళేశ్వ‌రం కేసీఆర్ ఇచ్చిన వ‌ర‌మైతే.. రేవంత్ రాష్ట్రానికి ప‌ట్టిన శ‌నేశ్వ‌రం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌కు వారం రోజులు కాళేశ్వ‌రం ప్రాజెక్టును అప్ప‌జెప్పితే.. తెలంగాణ అంత‌టికీ నీళ్లు పారించి చూపుతామ‌ని ఆయ‌న తెలిపారు. కరువు పరిస్థితుల్లోనూ నీళ్లు నిల్వ ఉండే ప్రాంతం కన్నెపల్లి.. కానీ నేడు 98 వేల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్నో అడ్డంకులు సృష్టించి, పర్యటనను అడ్డుకోవాలని చూసినా... వాటన్నిటినీ అధిగమించి కన్నెపల్లి పంప్ హౌస్‌కు చేరుకొని కేటీఆర్ ప‌రిశీలించారు. ఈ సందర్భంగా కన్నెపల్లి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

హైదరాబాద్‌ నుంచి కన్నెపల్లికి చేరుకునేందుకు 4 గంటలు పడుతుంది... కానీ పెంబర్తి, జనగామ, ఘన్‌పూర్‌, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవ్‌పూర్‌లో అడుగడుగునా మమ్మల్ని అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల నుండి ఆదేశాలు ఉన్నాయని.. మమ్మల్ని పోనివ్వమని పోలీసులు అడ్డుకున్నారు. రాజకీయ కక్ష తీర్చుకునేందుకు మేము ఇక్కడికి రాలేదు. దశాబ్దాలుగా నీళ్ల కోసం పోరాటాలు కొనసాగాయి.. గోదావరి నుంచి వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తూనే ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల అంశాలపై పోరాటం జరిగింది. తెలంగాణ భౌగోళికంగా గోదావరి, కృష్ణా నదులు పారుతున్నాయి.. కానీ, నీళ్లు కిందున్నాయి.. భూములు పైనున్నాయి. కింద ఉన్న నీటిని లిఫ్ట్‌ ద్వారా తరలిస్తే తప్ప నీళ్లు రాని పరిస్థితి. దిగువ ప్రాంతం నుంచి ఎగువకు నీటిని తరలించిన ఘనత కేసీఆర్‌ది. గోదావరి నీటిని ఒడిసిపట్టి ఎగువ ప్రాంతానికి తీసుకెళ్లాలని.. పరిశోధించి బృహత్తర ప్రణాళిక చేసింది కేసీఆర్‌ ప్రభుత్వం అని కేటీఆర్ పేర్కొన్నారు.

నేను పుట్టినప్పటి నుంచి వింటున్నా..

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం కేసీఆర్‌ నాయకత్వంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను సంప్రదించాం.. కానీ 150 మీటర్లకు ప్రాజెక్టు ఎత్తు పెంచితే నా ప్రాంతం మునుగుతుందని అన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ఎత్తు పెంచవద్దని ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ సీఎం పృథ్వీ రాజ్ చౌహన్ ఉత్తరం కూడా రాశారు. మేము మూడున్నరేళ్ల స్వల్ప సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టాం.. కానీ ఈ కాంగ్రెస్ నాయకులు మాత్రం తుమ్మిడిహట్టిపై రెండున్నరేళ్ల నుండి టైంపాస్ చేస్తున్నారు. ఎంతటి కరువులోనైనా కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించాలని అధికారులు సూచించారు కాబట్టే మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి నేను పుట్టినప్పటి నుంచి వింటున్నా.. పూర్తి కాలేదు. ఐదు దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. మండుటెండలో, కరువులోనూ నీరు లభ్యత ఉన్న ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం కట్టాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

మిడ్‌ మానేరు నుంచి నీళ్లు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు..

మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే మరమ్మతులు చేయలేదు.. మేడిగడ్డ పిల్లర్ల బ్లాక్‌ను నిర్మించేందుకు రూ.400 కోట్లు అవుతాయి. ప్రజలపై పైసా భారం పడకుండా... ఎల్‌ అండ్‌ టీ సంస్థ ముందుకు వచ్చినా ఇంతవరకూ మరమ్మతు చేయలేకపోయారు. కాళేశ్వరం కూలేశ్వరమైందని కాంగ్రెస్ నాయకులు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం నుంచి స్థిరీకరించిన కొత్త ఆయకట్టు 40 లక్షల ఎకరాలు అని కేటీఆర్ తెలిపారు. మిడ్‌ మానేరు నుంచి నీళ్లు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.. ఫ్లడ్‌ ఫ్లో ద్వారా పంపులు ఆన్‌ చేయకుండానే నీళ్లు తరలించవచ్చు. ఎస్‌ఆర్‌ఎస్పీ, ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చు. కరువు పరిస్థితుల్లోనూ నీళ్లు నిల్వ ఉండే ప్రాంతం కన్నెపల్లి.. కానీ నేడు 98 వేల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీతో అవసరం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తరలించవచ్చు. కన్నెపల్లి వద్ద నీళ్లున్నాయి.. పంపులు ఆన్‌ చేయమని రైతులు ఆందోళనలు చేశారు. మిడ్‌ మానేరు నింపాలని మా నాయకులు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్ కోరినా ఫలితం లేకుండాపోయింది. నీళ్ల లభ్యత ఎక్కడా లేకపోతే.. కన్నెపల్లి నీళ్లను ఎత్తిపోయవచ్చు. ఎస్‌ఆర్‌ఎస్పీలోనూ నీళ్లు లేకుంటే రివర్స్‌ పంపింగ్‌లో నీళ్లు నింపుకోవచ్చు అని కేటీఆర్ పేర్కొన్నారు.

కాళేశ్వరంతోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి

7 జిల్లాలకు సాగునీళ్లు, తాగునీళ్లిచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం. కాకతీయ కాల్వల్లో నీళ్లు లేని పరిస్థితుల్లో నీళ్లిచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. అప్పర్‌ మానేరులో అలుగు పొంగిందంటే కాళేశ్వరం వల్లనే. కాంగ్రెస్ చేతకానితనంతో... కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడంతో హైదరాబాద్‌లో తాగునీటి కోసం ఇవాళ 15 వేల వాటర్‌ ట్యాంకర్లు పెరిగాయి. కాళేశ్వరం నిర్మాణానికి 94 వేల కోట్లు ఖర్చు అయితే... లక్ష కోట్ల అవినీతి ఎలా అవుతాయి? సీఎం రేవంత్‌కు సోయి లేదు.. ఉత్తమ్‌కు స్పృహ లేదు. 2014 కంటే ముందు రికార్డు స్థాయిలో పంటలు ఎందుకు పండలేదు? సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం వచ్చాకనే కదా నీళ్లొచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతు బతుకు బాగుపడింది. పంజాబ్‌ను తలదన్ని వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్‌ వన్‌గా నిలిచింది కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే. కాళేశ్వరంతోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

కాళేశ్వరం కేసీఆర్‌ ఇచ్చిన వరం.. రేవంత్‌ రాష్ట్రానికి పట్టిన శనేశ్వరం

కాంగ్రెస్‌ అవినీతి, అసమర్ధత వల్ల ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కుప్పకూలి 8 మంది మృతి చెందితే.. ఇంతవరకూ మృతదేహాలు తీయలేని పరిస్థితి. మీ దరిద్రపు కాంగ్రెస్ హయాంలో సుంకిశాల గోడ కూలినా.. వట్టెం పంపుహౌస్‌ కొట్టుకుపోయినా పట్టించుకోరు. కేసీఆర్‌పై రాజకీయ కక్షతో రైతులను గోస పెడుతున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే.. నీళ్లు వస్తాయని కాంగ్రెస్‌ నాయకులకూ తెలుసు. ఒకవేళ నీళ్లిస్తే యూరియా ఇవ్వాలి.. పంటలు పండితే మద్దతు ధర ఇవ్వాలి, కరెంటు ఇవ్వాలి, బోనస్‌ ఇవ్వాలనేది కాంగ్రెస్ భయం. ఎన్‌డీఎస్‌ఏ, ఎన్డీఏను అడ్డం పెట్టుకుని బతకాలనుకుంటున్న రేవంత్‌. కాళేశ్వరం కేసీఆర్‌ ఇచ్చిన వరం.. రేవంత్‌ రాష్ట్రానికి పట్టిన శనేశ్వరం. కేసీఆర్‌కు వారం రోజులు కాళేశ్వరంను అప్పజెప్పు.. తెలంగాణ అంతటికీ నీళ్లు పారించి చూపుతాం రేవంత్ అని కేటీఆర్ స‌వాల్ విసిరారు.

50 వేల మందితో ముట్టడించి కన్నెపల్లి పంపులను ఆన్‌ చేస్తాం..

ఎల్‌నినో, సూపర్‌ ఎల్‌నినో వస్తుందని మూడు నెలల క్రితమే అధికారులు చెప్పారు.. 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. కాళేశ్వరంతో హైదరాబాద్‌ తాగునీటితో సహా ఉమ్మడి 7 జిల్లాలకు నీళ్లివ్వవచ్చు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షతో పడావు పెడితే.. సాగునీళ్లే కాదు.. హైదరాబాద్‌ తాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితులున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, మోటార్లు ఆన్ చేసి, నీళ్లను ఎత్తిపోయకపోతే.. 50 వేల మందితో ముట్టడించి కన్నెపల్లి పంపులను ఆన్‌ చేస్తాం. మా బీఆర్ఎస్ హయాంలో రైతుల కోసం రూ.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. కరెంటు మెరుగుపరిచేందుకు లక్ష కోట్లు, 24 గంటల కరెంటుకు 50 వేల కోట్లు ఖర్చు పెట్టాం. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులన్నింటికీ కలిపి రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. రైతుబంధుకు రూ.72 వేల కోట్లు, రైతుబీమా రూ.30 వేల కోట్లు ఇచ్చాం. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలోని ఎన్‌డీఎస్‌ఏ... ఏమీ పరిశీలించకుండానే 48 గంటల్లోనే ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు ఇచ్చింది. కానీ నేడు ఎస్‌ఎల్‌బీసీ కూలినా పట్టించుకోవడం లేదు. పొలాలకు అందించడానికి నీళ్లు ఉన్నా.. నీళ్లు లిఫ్ట్‌ చేసే సోయి రేవంత్‌కు లేదు. అందుకే ఎల్‌ అండ్‌ టీ కంపెనీ, మేడిగడ్డ మరమ్మతుకు ముందుకు వచ్చినా చేయించలేదు అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, మాలోత్ కవిత, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డి, రసమయి బాలకిషన్, తాటికొండ రాజయ్య, జీవన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, నోముల భగత్, చిరుముర్తి లింగయ్య, గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, వొడితల సతీష్ కుమార్, దాసరి మనోహర్ రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆరూరి రమేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు, వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement