త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

చెప్పులు వేసుకొని ఆ గ్రామంలో అడుగుపెడితే రూ.5 వేలు ఫైన్

ఎప్పుడైతే గోండు దేవతలకు ప్రతి సంవత్సరం పుష్య మాసంలో పూజలు చేయడం ప్రారంభించారో అప్పటి నుంచి ఈ ఊరు రాత మారింది. యువత కూడా పనుల్లో చేరుతున్నారు. మద్యాన్ని మానేస్తున్నారు.

J

Telangana | Published On Dec 23, 2025, 3.40 pm IST

చెప్పులు వేసుకొని ఆ గ్రామంలో అడుగుపెడితే రూ.5 వేలు ఫైన్
Advertisement

సాధారణంగా ఏదైనా గుడికి వెళ్తే మనం చెప్పులు బయటే వదిలి వెళ్తుంటాం. కానీ.. ఏదైనా ఊరికి వెళ్లాలంటే ఆ ఊరి పొలిమేర ముందే చెప్పులు విడిచి వెళ్లాలంటే ఎలా ఉంటుంది? ఇదెక్కడి వింత ఆచారం అని ముక్కున వేలేసుకుంటాం. ఇప్పుడు మనం చదువుకోబోయే గ్రామం కూడా అటువంటిదే. ఆ ఊళ్లోకి చెప్పులు వేసుకొని వెళ్లడం నిషేధం. వాళ్లేంటి చెప్పేది.. మేము చెప్పులు వేసుకొని ఆ ఊళ్లోకి వెళ్తాం అంటే.. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని రూ.5 వేలు ఫైన్ వేస్తారు. మీరు ససేమిరా అన్నా మీ ముక్కు పిండి మరీ ఫైన్ వసూలు చేస్తారు. అసలు ఏంటి ఈ ఆచారం. ఎందుకు రూ.5 వేలు ఫైన్ వేస్తున్నారు. చెప్పులతో ఆ గ్రామంలో అడుగుపెడితే ఏమైనా కొంపలు మునిగిపోతాయా? అని అనకండి. దాని వెనుక పెద్ద స్టోరీ ఉంది.. పదండి ఎక్కువ లాగ్ కాకుండా అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉంది ఆ గ్రామం. పేరు తుమ్ముగూడ. ఆ గ్రామంలో ఉండేవాళ్లంతా ఆదివాసీ ప్రజలు. ఇంద్రవెల్లి మండల కేంద్రం నుంచి 6 కిమీల దూరంలో ఉంటుంది ఈ గ్రామం.

చాలా ఏళ్ల క్రితం వరకు కూడా ఆ గ్రామంలో వర్షాలు పడేవి కావు. జనాలకు వింత వ్యాధులు సోకేవి. యువత కూడా చెడు మార్గంలో నడిచేవారు. చెడు వ్యసనాలకు బానిసలయ్యేవారు. గ్రామమంతా ఎందుకు ఇలా తయారయింది అని ఆ ఊరు పెద్దలు ఆలోచించారు. తెలిసిన పండితులను అడిగారు. దీంతో గ్రామ దేవతలు అయిన గోండు దేవతలు ఆకి దేవుడు, అవ్వల దేవుడు, జంగుబాయిలకు పూజలు చేయాలని, ప్రతి సంవత్సరం పుష్యమాసంలో దీక్షలు చేస్తే ఊరు బాగు పడుతుందని చెప్పారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పుష్య మాసంలో ఇలా ఆ గ్రామస్తులంతా దీక్ష చేపడతారు.

చెప్పులు వేసుకోరు, మద్యం, మాంసం ముట్టుకోరు

ఆ గ్రామస్తులు ప్రతి సంవత్సరం పుష్య మాసం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు నెల రోజుల పాటు గ్రామంలో చెప్పులు వేసుకొని తిరగరు. అలాగే.. మద్యం, మాంసం తినరు. బయటి నుంచి ఆ గ్రామానికి వచ్చే వాళ్లు కూడా చెప్పులు వేసుకోవడానికి వీలు లేదు. ఊరికి ఒక పొలిమేర ఉంటుంది. అక్కడే చెప్పులు వదిలేసి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చెప్పులు వేసుకొని ఊళ్లోకి వస్తే రూ.5 వేల ఫైన్ వేస్తారు. ఆ ఫైన్‌ ద్వారా కలెక్ట్ చేసిన డబ్బులను మళ్లీ ఊరి బాగు కోసమే ఖర్చు పెడుతుంటారు.

మారిన ఊరు బతుకు

ఎప్పుడైతే గోండు దేవతలకు ప్రతి సంవత్సరం పుష్య మాసంలో పూజలు చేయడం ప్రారంభించారో అప్పటి నుంచి ఈ ఊరు రాత మారింది. యువత కూడా పనుల్లో చేరుతున్నారు. మద్యాన్ని మానేస్తున్నారు. పంటలు పండుతున్నాయి. అందుకే క్రమం తప్పకుండా అదే ఆచారాన్ని ప్రతి సంవత్సరం ఫాలో అవుతున్నారు. ఈ సంవత్సరం 22 డిసెంబర్ 2025 నుంచి 22 జనవరి 2026 వరకు దీక్ష చేపడుతున్నారు. అందుకే ఊరి పొలిమేర వద్ద ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ముందే ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement