Illegal liquor outlets | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల( Gram Panchayat Elections ) ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రామాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు( Illegal liquor outlets ) పుట్టుకొస్తున్నాయి. ఈ బెల్ట్ షాపులపై కనీసం పోలీసులు( Police ) కూడా కన్నెత్తి చూడడం లేదు. అడ్డగోలు ధరలకు మద్యం విక్రయిస్తూ.. మందుబాబుల జేబులను గుల్ల చేస్తున్నారు బెల్ట్ షాపు నిర్వాహకులు. ఆదిలాబాద్ జిల్లా( Adilabad District ) వ్యాప్తంగా ఇటీవలి కాలంలో వేల సంఖ్యలో బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. ఈ దుకాణాల్లో రిటైల్ ధరలకు( Retail Rates ) మించి మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఉన్న ధరలకు అదనంగా 20 శాతం అధికంగా వసూలు చేస్తున్నారు మందు బాబుల నుంచి. అయితే మద్యం దుకాణాలు మండల కేంద్రాల్లో ఉండడంతో.. అంత దూరం వెళ్లలేక.. గ్రామీణ ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా భావించిన బెల్ట్ షాపు యజమానులు మందు బాబులను సొమ్ము చేసుకుని, ఇష్టమొచ్చిన ధరలకు విక్రయిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఇక బెల్ట్ షాపుల యజమానులు పోలీసులకు లంచాలు చెల్లించి తమ వ్యాపారాన్ని బహిరంగంగా కొనసాగిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో బెల్ట్ షాపులకు గిరాకీ మరింత ఎక్కువైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు కూడా బెల్ట్ షాపులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయా బెల్ట్ షాపుల నుంచి మద్యం కొనుగోలు చేయండి.. తామే డబ్బులు చెల్లిస్తామని ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లకు చెబుతున్న పరిస్థితి నెలకొంది. వీటన్నింటిని తమ విజయాలకు అవకాశాలుగా మలుచుకుంటున్నారు అభ్యర్థులు. ఎన్నికల నియామవళి ఉల్లంఘిస్తున్న బెల్ట్ షాపు యజమానులను ఆయా రెవెన్యూ అధికారుల ముందు పోలీసులు ప్రవేశపెడుతున్నారు. డబ్బులతో, మద్యంతో ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అక్రమ మద్యం తరలింపును అడ్డుకునేందుకు అక్కడక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు.