Kishan Reddy | ‘సైట్ విజిట్’తోనే అవినీతికి బాటలు.. ‘బొగ్గు కుంభకోణం’పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Kishan Reddy | ఒకప్పుడు బీఐఎఫ్ఆర్ లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన సింగరేణిని ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంది అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో రూ.684 కోట్ల అప్పుపై మారిటోరియం విధించి సింగరేణిని కాపాడారు.. తద్వారా సింగరేణి లాభాల బాటలో పడింది అని ఆయన పేర్కొన్నారు.
కల్వకుంట్ల ఫ్యామిలీ మాటే సింగరేణిలో చెల్లుబాటైంది..
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ కూడా..
సైట్ విజిట్ నిబంధన తప్పనిసరి కాదు..
రాష్ట్రం ముందుకొస్తే.. సీబీఐ విచారణకు పరిశీలిస్తాం..
సింగరేణిని మాకు అప్పగిస్తే లాభాల్లోకి తెస్తాం..
ఢిల్లీలో మీడియాతో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
Kishan Reddy | త్రినేత్ర.న్యూస్ : ఒకప్పుడు బీఐఎఫ్ఆర్ (బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్) లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన సింగరేణిని ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంది అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో రూ.684 కోట్ల అప్పుపై మారిటోరియం విధించి సింగరేణిని కాపాడారు.. తద్వారా సింగరేణి లాభాల బాటలో పడింది అని ఆయన పేర్కొన్నారు. కానీ 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చింది. అవినీతి అక్రమాలకు కేంద్రంగా మారిపోయింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో కొనసాగుతోంది అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. బొగ్గు కుంభకోణంపై ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ సంస్థలో తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం.. కేంద్రం వాటా 49 శాతం ఉన్నా.. అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానిదే. ఏ రకమైన జోక్యం, అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. ముగ్గురు కేంద్రం నుంచి ఏడుగురు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోర్డు డైరెక్టర్లుగా ఉంటారు. బీఆర్ఎస్ హయాంలో ‘కల్వకుంట్ల ఫ్యామిలీ’ మాటే సింగరేణిలో చెల్లుబాటైంది. టెండర్ల దగ్గర్నుంచి.. చిన్న చిన్న కాంట్రాక్టుల వరకు ప్రతిచోటా కేసీఆర్ కుటుంబం ఆడింది ఆట అన్నట్లు సాగింది. సింగరేణి కార్యక్రమాల్లో రాజకీయ జోక్యంతో.. సమస్యల్లోకి నెట్టేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ. 32 వేల కోట్ల బకాయిలు పెట్టారు. ఎన్ని రకాలుగా సింగరేణిని విధ్వంసం చేయవచ్చో.. బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని ఫాలో అవుతోంది. తమ అవినీతి అక్రమాలకు.. సింగరేణిని బంగారు బాతుగా వాడుకున్నాయి. సింగరేణి కార్మికుల చెమట కష్టాన్ని దోచుకున్నాయి అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
నా వల్లే నైని బ్లాక్‌కు తుది అనుమతులు
తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం.. సింగరేణి సంస్థకు నైని కోల్ బ్లాక్‌ను కేటాయించింది. 2015లోనే ఈ బ్లాక్ కేటాయించి.. కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులను సరైన సమయంలో అందించింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నైని కోల్ బ్లాక్ విషయంలో.. టెండర్లను ఆహ్వానించి.. ముఖ్యమంత్రి చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు. ఇవాళ కాంగ్రెస్ కూడా.. అదే పద్ధతిలో.. టెండర్లను ఆహ్వానించి.. వెనక్కు తగ్గారు. 2024లో నేను బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నైని కోల్ బ్లాక్‌కు సంబంధించిన చివరి అనుమతులు రావడంలో ఒడిశా సీఎం, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌తో మాట్లాడి అనుమతులు వచ్చేలా చొరవతీసుకున్నాను. ఈ ప్రయత్నాల కారణంగా.. సహకార సమాఖ్య స్ఫూర్తితో.. 643 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి అప్పగించేందుకు ఆమోద ముద్ర వేస్తూ.. 2024 జులై 4న ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నైని బ్లాక్‌కు తుది అనుమతులు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనులను ప్రారంభించాల్సింది పోయి.. పారదర్శకమైన పద్ధతిలో పనులు చేపట్టాల్సింది పోయి ఆలస్యం చేశాయి. అనేక అక్రమాలు, అవినీతి జరిగినట్లు వార్తలు రావడం దురదృష్టకరం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
సైట్ విజిట్ తప్పనిసరి కాదు.. అది సెల్ఫ్ డిక్లరేషన్ మాత్రమే
బొగ్గు వెలికి తీయడం, బొగ్గు రవాణాకు సంబంధించి టెండర్‌లో.. ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ నిబంధనను సింగరేణి యాజమాన్యం.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చేర్చింది. అనేక చోట్ల సైట్ విజిట్ చేయాలనే నిబంధన ఉంది. కానీ అది సెల్ఫ్ డిక్లరేషన్. బ్లాక్‌కు సంబంధించి సరైన వివరాలు తెలియకుండా టెండర్‌కు వస్తే ఇబ్బందులుంటాయని.. అవగాహన కోసం ఈ నియమాన్ని తీసుకొచ్చాం. దీనికి ఒక కారణం ఉంది. సైట్ విజిట్ చేసిన తర్వాతే.. సదరు కాంట్రాక్టర్‌కు మినరల్ నిల్వలపై, అక్కడి భౌగోళిక స్థితిపై ఓ స్పష్టమైన అవగాహన వస్తుందనేది ఆ నిబంధనకు అర్థం. కానీ సింగరేణి ప్రభుత్వం దీన్ని తప్పనిసరి నిబంధనగా మార్చి అవినీతికి బాటలు వేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా చోట్ల టెండర్ల ప్రక్రియలో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. పారదర్శంగా పనిచేస్తున్నాం. కానీ.. సింగరేణిలో.. ‘సైట్ విజిట్’ నిబంధనను తప్పనిసరి చేసి.. బొగ్గు వెలికి తీసే ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి..
కోల్ బ్లాక్‌కు సంబంధించి.. సీబీఐ దర్యాప్తు జరపాలి, కేంద్రమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. కానీ కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది. నాడు కేంద్రానికి 49 శాతం భాగస్వామ్యం ఉన్న విషయాలు మరిచిపోయారా? కొన్ని సంస్థలకు, కొందరు వ్యక్తులకు లాభం చేసేలా వ్యవహరించిన మాట వాస్తవం కాదా? తాడిచర్ల కోల్ బ్లాక్‌ను జెన్‌కోకు కేటాయించాం. దీని మైనింగ్ చేసేందుకు సింగరేణి ముందుకొస్తే.. వారితో ‘మేం పని చేయలేమని లేఖ రాయించుకుని’ ప్రైవేటు కంపెనీకి 25 ఏళ్ల టెండర్ కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? ఇవాళ సుమారు.. రూ.47 వేల కోట్ల రూపాయలను సింగరేణికి బకాయి పడింది. దేశంలో ఏ కోల్ మైనింగ్ కంపెనీకి కూడా.. ఈ స్థాయిలో ఇబ్బందుల్లేవు. సింగరేణి పట్ల, కార్మికుల సంక్షేమం పట్ల.. నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ పార్టీల చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవాలి. బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది అని కిషన్ రెడ్డి తెలిపారు.
సింగరేణి అస్తిత్వానికే ప్రమాదం
సింగరేణిలో G11 గ్రేడ్ కోల్ అమ్మకం ధర.. టన్నుకు రూ. 4,088. ఇదే కోలిండియాలో.. G11 గ్రేడ్ కోల్ ఈ ధర రూ. 1,605. దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిమీద పడి దోచుకుంటున్నాయి కాబట్టే.. సంస్థను నడిపేందుకు వారి వద్ద ధరలను పెంచడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. సింగరేణి కోల్ కొంటున్న జెన్‌కో కూడా ప్రభుత్వ సంస్థనే కాబట్టి.. సింగరేణి ధరలు పెంచుకుంటూ పోతోంది. సింగరేణి బొగ్గు క్వాలిటీ 58 శాతం ఉండగా.. కోలిండియాలో బొగ్గు క్వాలిటీ 86 శాతంగా ఉంది. సింగరేణి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది కాబట్టి.. క్వాలిటీ విషయంలో, రేట్ విషయంలో తప్పటడుగులు వేస్తోంది. ఎన్టీపీసీ, ఏపీ, కర్ణాటక ప్రభుత్వం కూడా.. సింగరేణి బొగ్గు మాకు వద్దని అంటున్నాయి. అవినీతి, అక్రమాల కారణంగా సింగరేణి భవిష్యత్తు అంధకారంలో పడే పరిస్థితి నెలకొంది అని కిషన్ రెడ్డి తెలిపారు.
సింగరేణిలో అక్రమాలు అరికట్టాల్సిందే..
సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే.. కేంద్రం దీన్ని పరిశీలిస్తుంది. సింగరేణి కార్మికుల భవిష్యత్తును రక్షించుకునేందుకు.. వ్యవస్థను పక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మంత్రుల మధ్య వాటాల పంపిణీతోనే ఈ వివాదాలు బయటకొచ్చాయి. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఎలా చెల్లిస్తారు? వివిధ దశల్లో చెల్లిస్తారా? ఒకేసారి ఇస్తారా అని ప్రశ్నిస్తున్నాను. ఇవాళ.. సింగరేణి ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెట్టి ఈ అంశాలన్నీ చర్చించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు చర్చించారు. ఇది రాజకీయ పార్టీలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం మాత్రమేకాదు.. ఇది సింగరేణి భవిష్యత్తుకు, దీనిపై ఆధారపడిన కుటుంబాలకు సంబంధించిన విషయం. సంస్థకు సంబంధించిన అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉంది అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
మాకు అప్పగిస్తే.. సింగరేణిని లాభాల బాటలో నడిపిస్తాం..
దీనిపై మా కోల్ సెక్రటరీ.. విదేశీ పర్యటన పూర్తిచేసుకుని వచ్చిన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి లేఖ రాస్తారు. కేంద్ర మంత్రిగా.. కేంద్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారానికి సిద్ధంగా ఉన్నాను. టెండర్ల ప్రక్రియ విషయంలో.. ప్రత్యేక కమిటీ ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నాం. బోర్డులో మేం లెవనెత్తిన చాలా విషయాలను.. వారు విస్మరించారు. త్రైపాక్షిక ఒప్పందం జరగాల్సిన అవసరం ఉంది.. భవిష్యత్తులో జరిగే టెండర్లు, ఇతర ప్రక్రియపై విస్తృతంగా చర్చిస్తాం. నేను కేంద్రమంత్రి అయిన తర్వాత.. వ్యవస్థలో మార్పులను తీసుకొస్తున్నాను. ఎప్పటికప్పుడు, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి.. సింగరేణిని లాభాల బాటలో నడిపేందుకు మాకు అప్పగిస్తే.. ఆ బాధ్యతను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



