త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP CV Anand | పోలీస్ నియామకాల్లో పారదర్శకతే ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

DGP CV Anand | పోలీస్ నియామక ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయత కీలకమని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. తెలంగాణ పోలీస్ శాఖలోని వివిధ విభాగాల పనితీరుపై కొనసాగుతున్న సమీక్షల్లో భాగంగా డీజీపీ సీవీ ఆనంద్ శనివారం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్ ట్రైనింగ్ విభాగం, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (పీసీఎస్) విభాగాల పనితీరును సమీక్షించారు.

P

Telangana | Published On Jul 18, 2026, 8.32 pm IST

DGP CV Anand | పోలీస్ నియామకాల్లో పారదర్శకతే ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
Advertisement

DGP CV Anand | పోలీస్ నియామక ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయత కీలకమని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. తెలంగాణ పోలీస్ శాఖలోని వివిధ విభాగాల పనితీరుపై కొనసాగుతున్న సమీక్షల్లో భాగంగా డీజీపీ సీవీ ఆనంద్ శనివారం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్ ట్రైనింగ్ విభాగం, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (పీసీఎస్) విభాగాల పనితీరును సమీక్షించారు. ఆయా విభాగాల అధికారులు తమ కార్యకలాపాలు, ప్రస్తుత కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై డీజీపీకి వివరించారు. త్వరలో చేపట్టనున్న నియామక ప్రక్రియను కూడా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిష్పాక్షికంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దేశంలోని పలు నియామక సంస్థల్లో ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో ఇప్పటివరకు అలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని డీజీపీ పేర్కొన్నారు. ఇది బోర్డు విశ్వసనీయతకు నిదర్శనమని చెబుతూ అధికారులు, సిబ్బందిని అభినందించారు.

ఈ సందర్భంగా 1989–91 మధ్య జరిగిన పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ నియామకాలను డీజీపీ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కూడా నియామకాలు పారదర్శకంగా జరిగాయని, ఆ సమయంలో తన స్నేహితులు ఎస్‌ఐలుగా ఎంపిక కాగా, తాను ఐపీఎస్‌కు ఎంపికైన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నియామక ప్రక్రియ మరింత పటిష్టంగా, పారదర్శకంగా మారిందని తెలిపారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు బోర్డు కార్యకలాపాలపై డీజీపీకి ప్రజెంటేషన్ ఇచ్చారు. 2015-16, 2018-19, 2021, 2022-23 సంవత్సరాల్లో చేపట్టిన నియామక ప్రక్రియ వివరాలను వెల్లడించారు. 2015-16లో 10,980 పోస్టులను భర్తీ చేయగా, 2017లో 17,297 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. 2021లో 92 ప్రాసిక్యూషన్ పోస్టులు, 2022-23లో రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా 16,654 పోస్టులను భర్తీ చేసినట్లు వివరించారు.

ఇప్పటివరకు జరిగిన నియామకాల్లో 5శాతం సబ్‌ఇన్‌స్పెక్టర్ స్థాయి పోస్టులు ఉండగా, 95 శాతం కానిస్టేబుల్ స్థాయి పోస్టులేనని చైర్మన్ వివరించారు. 2025 సంవత్సరానికి సంబంధించిన నియామకాల వివరాలను కూడా రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వెల్లడించారు. 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు, 1,743 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు, ఫింగర్‌ప్రింట్ విభాగానికి సంబంధించిన పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. తొలిసారిగా చేపట్టిన ఫింగర్‌ప్రింట్ పోస్టుల నియామకంలో 60 పోస్టులకు గాను 57 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు చెప్పారు. ఆర్టీసీ విభాగానికి సంబంధించిన 198 సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.

ఆర్‌ఎస్‌ఐ నుంచి ఎస్‌ఐ, సివిల్ పీసీ నుంచి టీజీఎస్‌పీ, ఇతర విభాగాల్లో పోస్టుల కన్వర్షన్, రిజర్వేషన్ విధానాలకు సంబంధించిన అంశాలను కూడా సమావేశంలో వివరించారు. పోలీస్ నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా, అభ్యర్థులకు సౌకర్యవంతంగా మార్చేందుకు చేపట్టిన సంస్కరణలను కూడా బోర్డు వివరించింది. 2015-16లో 33.5 శాతం రిజర్వేషన్ అమలు, శారీరక సామర్థ్య పరీక్షల్లో 5 కిలోమీటర్ల పరుగుకు బదులుగా 2.5 కిలోమీటర్ల పరుగును ప్రవేశపెట్టడం, బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం వంటి మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. 2018లో ఆర్‌ఎఫ్‌ఐడీ టెక్నాలజీ, మొబైల్, ఈ-మెయిల్ ఆధారిత రిజిస్ట్రేషన్ విధానం, పరీక్షల్లో నెగెటివ్ మార్కింగ్ వంటి మరిన్ని సాంకేతిక సంస్కరణలను అమలు చేసినట్లు వివరించారు.

సమావేశంలో పోలీస్ ట్రైనింగ్ విభాగం, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగాల పనితీరు, సాంకేతిక ఆధునికీకరణ, శిక్షణ ప్రమాణాల పెంపుపై కూడా డీజీపీ సమీక్షించారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు, డీజీ సీఐడీ చారు సిన్హా, ఐజీపీ గజరావు భూపాల్, డీఐజీ కమ్యూనికేషన్స్ కిరణ్ కుమారి, ఎస్పీలు రూపేష్, శ్రీనివాస్, అంబర్‌పేట్, కరీంనగర్, వరంగల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీల ప్రిన్సిపల్స్, డీఎస్పీలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement