త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Party | సీఎం అంటే చీఫ్ మినిస్ట‌ర్ కాదు.. కోల్ మాఫియా : కేటీఆర్‌

BRS Party | నేడు తెలంగాణ‌లో సీఎం అంటే చీఫ్ మినిస్ట‌ర్ కాద‌ని.. కోల్ మాఫియా నాయ‌కుడిగా ప్ర‌జ‌లు, సింగ‌రేణి కార్మికులు భావించే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు విమ‌ర్శించారు. సింగ‌రేణి కుంభ‌కోణంపై బీఆర్ఎస్ బృందం బుధ‌వారం రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ను క‌లిసింది.

P

Telangana | Published On Jan 27, 2026, 6.56 pm IST

BRS Party | సీఎం అంటే చీఫ్ మినిస్ట‌ర్ కాదు.. కోల్ మాఫియా : కేటీఆర్‌
Advertisement

BRS Party | నేడు తెలంగాణ‌లో సీఎం అంటే చీఫ్ మినిస్ట‌ర్ కాద‌ని.. కోల్ మాఫియా నాయ‌కుడిగా ప్ర‌జ‌లు, సింగ‌రేణి కార్మికులు భావించే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు విమ‌ర్శించారు. సింగ‌రేణి కుంభ‌కోణంపై బీఆర్ఎస్ బృందం బుధ‌వారం రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ను క‌లిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అవినీతి, సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో స‌వివ‌రంగా విజ్ఞాప‌న ప‌త్రాన్ని నేత‌లు అంద‌జేశారు. అనంత‌రం కేటీఆర్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఆయ‌న మాట్లాడుతూ.. త‌మ పార్టీ తరఫున శాసనమండలి సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయ‌కుల బృందం అందరం కూడా కలిసి గవర్నర్ కు ఒక వివరమైన విజ్ఞాపన పత్రాన్ని అందించామ‌ని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి అందజేయడం జ‌రిగింద‌ని, సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా మా శాసనసభాపక్ష ఉపనాయకులు, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పత్రికా సమావేశం పెట్టి, ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొద‌లైంద‌న్నారు.

పాల‌కుల గుండెల్లో రైళ్లు..

మీడియా స‌హ‌కారంతో కుంభ‌కోణాన్ని పూర్తిస్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయ‌ని విమ‌ర్శించారు. కేవలం మాట్లాడటమే కాద‌ని, ఆధారాలతో సహా మరి ఈరోజు పూర్తిస్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్ ని, దృష్టి మళ్లించడానికి, విచారణ పేరిట ఇవాళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ కుంభకోణాన్ని, రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉండే మా కార్మిక సోదరులు కూడా అర్థం చేసుకుంటే.. చాలా స్పష్టంగా ఆధారాలతో సహా తాము బయటపెట్టిన తర్వాత, ముఖ్యంగా మేము లేవనెత్తిన కొన్ని ప్రశ్నల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేద‌న్నారు. ఈ విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారేమో అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఆడుతున్నాడు సింగరేణితో... ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ ఫోజులు కొడతా ఉన్న‌డు అంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఏ వ‌య‌సులో జ‌ర‌గాల్సిన ముచ్చ‌ట.. ఆ వ‌య‌సులోనే జ‌ర‌గాలి..

నేను వారికి (సీఎం) గుర్తు చేస్తా ఉన్నా.. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జ‌ర‌గాల‌ని.. చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తదో ఒకసారి వారు కూడా ఆలోచించుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. రూ.10కోట్ల సింగరేణి నిధులు, సంస్థకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసి, మీరు ఫుట్‌బాల్ ఆటకి వినియోగించార‌ని.. ఈ రాష్ట్ర ప్రజలతో ఎలాగూ ఫుట్ బాల్ ఆడుతున్నారని.. కానీ సింగరేణి సంస్థతో కూడా ఫుట్ బాల్ ఆడుతూ రూ.10కోట్లు దుర్వినియోగం చేసి ఈరోజు ఆ సంస్థకి తీరని అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి అంటూ మండిప‌డ్డారు. ఒక్క స్కామ్ కి సంబంధించి ఇన్ని ఆధారాలు బయటపెడితే కూడా.. స్కామ్ కు సంబంధించి ఇప్పటివరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేద‌న్నారు. టెండర్ల విషయంలో గతంలో ఎన్నడూ లేని 'సైట్ విజిట్ సర్టిఫికేషన్' అంటే.. మీరు సైట్ మీదకి రావాలి, అక్కడికి వచ్చినట్టు సర్టిఫికెట్ తీసుకోవాలి అన్న నిబంధన పారదర్శకతకు పాతరవేసి ఎందుకు పెట్టారంటూ ప్ర‌శ్నించారు.

ఇంత వ‌ర‌కు స‌మాధానం లేదే..

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది ఎందుకు పెట్టారంటే ఇంతవరకు సమాధానం లేద‌ని, భారతదేశంలో ఎక్కడ ఏ కోల్ గనిలో లేని, ఏ బొగ్గు గనిలో లేని నిబంధన ఇక్కడనే ఎందుకు పెట్టినారు అంటే ఇంతవరకు సమాధానం రాద‌ని విమ‌ర్శించారు. నిజంగానే 2018 నుంచి 2024 వరకు ఈ నిబంధన గనుక కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సిఫారసు చేసి ఉంటే.. ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని గుర్తు చేశారు. అన్ని టెండర్లను కూడా ట్రాన్స్పరెంట్‌గా ఆనాడు తాము పిలిచామ‌ని, అందుకే ఆరోజు అన్ని మైనస్ టెండర్లు వ‌చ్చాయ‌ని తెలిపారు. ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే తక్కువ ఖర్చుకే సింగరేణికి డబ్బు ఆదా చేస్తూ ఆరోజు జరిగిన మాట వాస్తవమా కాదా? అని నిల‌దీశారు. టెండర్లలో లేని షరతు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 'సైట్ విజిట్ సర్టిఫికేషన్' అనే విధానం ఎందుకు పెట్టారు? ఎవరికి లాభం చేయడానికి? అంటూ ప్ర‌శ్న‌లు సంధించారు.

శ్వేత‌ప‌త్రం డిమాండ్ చేస్తే..

నిబంధన అప్పటి నుంచి తొమ్మిది నెలల్లో ఎన్ని సంస్థలు ఇప్పటివరకు ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్ సందర్శించారు? మీకు ఎన్ని ఈమెయిల్స్ వచ్చాయి? ఎన్ని లేఖలు వచ్చాయి? ఎన్ని సర్టిఫికేట్లు సింగరేణి సంస్థ జారీ చేసింది..? ఓ శ్వేత‌ప‌త్రం డిమాండ్ చేస్తే ఇంత వ‌ర‌కు స‌మాధానం లేద‌న్నారు. కొంతమందికే సెలెక్టివ్‌గా ఎందుకు ఇచ్చారు మీరు? కొంతమందికే సెలెక్టివ్‌గా మీరు ఎందుకు మరి కొంతమంది కాంట్రాక్ట్ సంస్థలనే ఎందుకు మీరు ఎన్నుకుంటున్నారు? మిగతా వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు? అంటూ నిల‌దీశారు. ఇందులో రింగ్ మాస్టర్, సృజన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బావమరిది అవునా.. కాదా? అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం రాద‌ని.. ఇంతవరకు ఆయన విషయంలో స్పష్టత రాద‌న్నారు. ఒక నైనీ నీ బొగ్గు గని టెండర్లే కాదు.. అన్ని టెండర్లకు పారదర్శకత ఉండాల్సిందేన‌న్నారు.

రెండుసార్లు టెండ‌ర్లు పిలిచాం..

నైనీలో గతంలో 2021లో, 2022లో రెండు సార్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు టెండర్లు పిలిచామ‌ని, కానీ ఆ రోజు ఈ 'సైట్ విజిట్ సర్టిఫికేట్' అనే నిబంధన లేద‌న్నారు. మరి ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిబంధన ఎందుకు అవసరమైంది? సోలార్ పవర్ స్కామ్ గురించి కూడా మేము బయట పెట్టామ‌న్నారు. భారతదేశంలో ఎక్కడైనా మెగావాట్‌కు రెండున్నర నుంచి మూడు కోట్లలో ఇవాళ సోలార్ నిర్మాణం జరుగుతుంద‌ని చెప్పారు. కానీ, తెలంగాణలో మాత్రం సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో మాత్రం ఏడు కోట్లు
రెండున్నర మూడు కోట్లలో అయ్యే పని దేశం మొత్తంలో, ఒక్క తెలంగాణలో మాత్రం ఏడు కోట్లు ఎందుకు అవుతున్నది? ఇది స్కామ్ కాదా? సోలార్ పవర్‌లో అని మేము నిలదీస్తే ఇంతవరకు సమాధానం లేద‌న్నారు.

అద‌నంగా రేటు పెంచారు..

ఎక్స్‌ప్లోజివ్స్ , జిలెటిన్ స్టిక్స్, 30 శాతం అదనంగా రేటు పెంచార‌ని, డైరెక్టర్లు నిలదీస్తే బోర్డులో, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు.. తప్ప కాంట్రాక్టర్లకు లాభం చేసే పనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనకకు తగ్గలేద‌న్నారు. ఈ అన్ని విషయాలు ఇవాళ గవర్నర్ దృష్టికి తీసుకు వ‌చ్చామ‌న్నారు. కాంట్రాక్టర్లను బెదిరించి, కాంట్రాక్టర్లను ఒక రింగు చేసి ఇవాళ ప్రజా ధనాన్ని దోచుకుంటున్న తీరును వివరించడం జ‌రిగింద‌న్నారు. ఈ విష‌యంలో ఇన్వాల్వ్ కావాల‌ని.. లేదంటే కిష‌న్‌రెడ్డికి ఆదేశాలు ఇవ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను కోరామ‌న్నారు. సీబీఐకి ఇస్తారా? సిట్టింగ్‌ జడ్జికి ఇస్తారా? మీ ఇష్టం ఎవరికి ఇస్తారో ఇవ్వండ‌న్నారు. ప్రజా ధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థను, అటు సోలార్ పవర్‌లో కుంభకోణం, ఇటు సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణం.. అడ్డుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్‌కు విన్న‌వించామ‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement