Tiger | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో ఏదో ఒక చోట పెద్ద పులులు దర్శనమిస్తూనే ఉన్నాయి. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లాలో ఓ పెద్ద పులి కలకలం సృష్టించింది. శ్రీరాంపూర్‌లోని బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో మరోసారి పెద్ద పులి కనిపించడంతో కార్మికులు, స్థానికులు ఆందోళనకు గురైన విషయం తెలిసిందే. తాజాగా గోదావరి తీరం దాటి పెద్దపల్లి జిల్లాల్లోకి పులి ప్రవేశించడం ఆందోళన కలిగిస్తుంది. ఈ పెద్దపులి మహారాష్ట్ర భూభాగం నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. గత రెండు వారాల నుంచి శ్రీరాంపూర్ బొగ్గు గనుల్లో తలదాచుకున్న పెద్ద పులి మళ్లీ పెద్దపల్లి జిల్లాలోకి సోమవారం ప్రవేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. పులుల గుర్తింపునకు 50 సీసీ కెమెరాలు మహారాష్ట్ర నుంచి తెలంగాణ భూభాగంలోకి ప్రవేశిస్తున్న పులులను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు సరిహద్దు మార్గాల్లో 50 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పెద్ద పులుల కదలికలను గమనిస్తూ, స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బొగ్గు గనుల ఏరియాల్లో నిఘా పెట్టిన అధికారులు కార్మికులను అలర్ట్ చేస్తున్నారు.