TGSRTC | త్రినేత్ర.న్యూస్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరం నుంచి జిల్లాలకు 6341 ప్రత్యేక బస్సులను నడుపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక బస్సులు 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని టీజీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేశారు. అదే విధంగా 18, 19 తేదీల్లో ప్రయాణికుల తిరుగు ప్రయాణం సందర్భంగా కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక బస్సులు ఈ ప్రాంతాల నుంచే.. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందుస్తు రిజర్వేషన్‌కు అవకాశం కల్పించారు. తదితర వివరాల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించారు. మగాళ్లకు షాక్.. టికెట్ ధరలు పెంపు ప్రత్యేక బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.5 వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. ఆ జీవో ప్రకారం ప్రతి ప్రధాన పండుగకు 1.5 వరకు టికెట్ ధరలను ఉమ్మడి కార్పొరేషన్‌గా ఉన్నప్పటి నుంచి అమలు చేస్తుంది. ఈ క్రమంలో ఈ సంక్రాంతి పండుగకు నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.5 వరకు టికెట్ ధరలను సవరించనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ పేర్కొంది. ఈ ప్రత్యేక ఛార్జీలు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే అమల్లో ఉంటాయని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. మహిళలకు ఉచిత రవాణే.. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.