త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC Elections | కొన‌సాగుతున్న ఆర్టీసీ యూనియ‌న్ ఎన్నికలు.. డిపోల్లో ప్ర‌శాంతంగా పోలింగ్‌

TGSRTC Elections | తెలంగాణ‌ ఆర్టీసీలో పదేండ్ల‌ తర్వాత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు (TGSRTC Elections) జ‌రుగుతున్నాయి. శుక్ర‌వారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్ (Polling) సాయంత్రం 6 గంట‌ల‌ వరకు సాగనుంది.

G

Telangana | Published On Oct 9, 2026, 10.57 am IST

TGSRTC Elections | కొన‌సాగుతున్న ఆర్టీసీ యూనియ‌న్ ఎన్నికలు.. డిపోల్లో ప్ర‌శాంతంగా పోలింగ్‌
Advertisement

TGSRTC Elections | త్రినేత్ర న్యూస్‌: తెలంగాణ‌ ఆర్టీసీలో పదేండ్ల‌ తర్వాత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు (TGSRTC Elections) జ‌రుగుతున్నాయి. శుక్ర‌వారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్ (Polling) సాయంత్రం 6 గంట‌ల‌ వరకు సాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలు, వ‌ర్క్‌షాప్‌ల‌లో ప్రశాంత వాతావ‌ర‌ణంలో పోలింగ్ కొన‌సాగుతున్న‌ది. మొత్తం 36,300 మంది ఆర్టీసీ కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో 32, హైదరాబాద్‌ జోన్‌లో 38, కరీంనగర్‌ జోన్‌ పరిధిలో 45 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కార్మికుడికి రెండు చొప్పున‌ ఓట్లు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘం కోసం ఒకటి, ప్రాంతీయ స్థాయి గుర్తింపు సంఘం కోసం మరో ఓటు వేయనున్నారు. విధుల్లో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ నెల 14, 15న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్​ను ఏర్పాటు చేశారు.

ఎన్నిక‌ల బ‌రిలో 12 యూనియ‌న్లు ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధానంగా రెండు కూట‌ముల మ‌ధ్యే పోటీ నెల‌కొంది. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (TWU), స్టాఫ్ వర్కర్స్ యూనియ‌న్ (SWU), స్టాఫ్ వ‌ర్క‌ర్స్ ఫెడరేషన్ (SWF) ఒక‌ కూటమిగా, ఎంప్లాయిస్ యూనియన్ (EU), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (TMU), నేషనల్ మజ్దూర్ యూనియన్​ (NMU) ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి. అయితే గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 17న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫలితాలు ప్ర‌క‌టించ‌నున్నారు.

2016లో చివ‌రిసారిగా ఎన్నిక‌లు..

ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా చివరిసారిగా 2016లో కార్మిక సంఘాలకు గుర్తింపు (RTC Union Elections) ఎన్నికలు జరిగాయి. అయితే గ‌త ప్ర‌భుత్వం ఆర్టీసీలో సంఘాలను రద్దు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ సంఘాల‌ను పున‌రుద్ధ‌రిస్తామ‌ని అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా హామీ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. కార్మికులకు ఓటు హక్కు అర్హతగా సెప్టెంబర్‌ 1,2026 వరకు ప్రామాణికంగా నిర్ణయించారు. ఆ తేదీ నాటికి కనీసం 8 నెలల నిరం తర సర్వీస్‌ పూర్తిచేసి రెగ్యులర్‌, క్యాజువల్‌, కాంట్రాక్ట్‌, కన్సాలిడేటెడ్‌ పే, కార్మి కులందరికీ ఓటు హక్కు కల్పించారు. అనారోగ్యంతో సెలవుల్లో ఉన్నవారు, సస్పెన్షన్‌, ఫుట్‌ ఆఫ్‌ డ్యూటీలో ఉన్న కార్మికులకు కూడా ఓటు హక్కు కల్పిం చారు.

క్లాస్‌-2 సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్లు, కండక్టర్లు, ప్రైవేట్‌ ఈవీ బస్‌ డ్రైవర్లు, రిటైర్డ్‌ సిబ్బందికి ఓటు హక్కు కల్పించలేదు. ఈ నేప‌థ్యంలో మొత్తం 36,300 మంది ఓట‌ర్లు ఉండ‌గా.. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో 13,797 మంది, కరీంనగర్‌ జోన్‌లో 11,392 మంది, హైదరాబాద్‌ జోన్‌లో 9,303 మంది చొప్పున‌ ఉన్నారు.

Advertisement
Advertisement