త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | తెలంగాణ క్రీడాభివృద్ధికి బలమైన పునాదిగా ఖేలో ఇండియా పోటీలు: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy | తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే కార్యాచరణలో భాగంగా ‘ఖేలో ఇండియా’ పోటీలు (Khelo India Youth Games) రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి బలమైన పునాదిగా నిలువనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy ) అన్నారు. స్టేడియంల పునరుద్ధరణతో పాటు ఏర్పాట్లలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారుల‌ను ఆదేశించారు.

G

Telangana | Published On Nov 25, 2026, 5.41 pm IST

Revanth Reddy | తెలంగాణ క్రీడాభివృద్ధికి బలమైన పునాదిగా ఖేలో ఇండియా పోటీలు: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

Revanth Reddy | త్రినేత్ర న్యూస్‌: తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే కార్యాచరణలో భాగంగా ‘ఖేలో ఇండియా’ పోటీలు (Khelo India Youth Games) రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి బలమైన పునాదిగా నిలువనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy ) అన్నారు. స్టేడియంల పునరుద్ధరణతో పాటు ఏర్పాట్లలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారుల‌ను ఆదేశించారు. నెలాఖరుకల్లా స్టేడియాలలో అభివృద్ధి పనులు పూర్తికావాల‌ని, క్రీడా ప‌రిక‌రాలు అందుబాటులో ఉంచాల‌న్నారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జ‌రుగ‌నున్న‌ ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈ నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి, అధికారులతో కలిసి పోటీల ఏర్పాట్ల పురోగతిపై సీఎం రేవంత్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. డిసెంబర్ 11న అట్టహాసంగా ఖేలో ఇండియా పోటీలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు, గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.

తెలంగాణ యువతను క్రీడల వైపు మళ్లించేందుకు దోహదపడేలా భవిష్యత్‌కు పునాది వేయడంపై దృష్టి సారించాలన్నారు. స్టేడియంల పునరుద్ధరణతోపాటు ఏర్పాట్లలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. స్టేడియాలలో ఏర్పాట్ల నాణ్యతపై విజిలెన్స్ నిఘా ఉండాలన్నారు. పోటీల్లోని అన్ని వేదికల్లో టాయిలెట్ల తో సహా అన్ని నిర్వహణ అవసరాలకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వాడాలని సూచించారు.

ఇన్‌చార్జులుగా మంత్రులు..

ఏర్పాట్లకు సంబంధించి ఒక్కో విభాగానికి ఒక్కొక్కరిని ఇంచార్జులుగా నియమించి బాధ్యులను చేయాలన్నారు. ప్రారంభోత్సవం, ముగింపు వేడుకలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. పోటీల ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లాలవారీగా మంత్రులను ఇన్‌చార్జిగా నియమించాలన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో ఇన్‌చార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించాలని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు. మహబూబ్ నగర్ పరిధిలో జూపల్లి కృష్ణారావు, వరంగల్ పరిధిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ పరిధిలో అడ్లూరి లక్ష్మణ్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలన్నారు. ఖమ్మం పరిధిలో తుమ్మల నాగేశ్వర్ రావు, నిజామాబాద్ పరిధిలో సుదర్శన్ రెడ్డిని పోటీల ఏర్పాట్ల పర్యవేక్షణకు బాధ్యతలు ఇవ్వాలని సూచించారు. పోలీస్, మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

నెలాఖరుకల్లా పూర్తి..

ఈ నెలాఖరుకల్లా స్టేడియాలలో అభివృద్ధి పనులు, 27 క్రీడలకు సంబంధించి అవసరమైన అన్ని క్రీడా పరికరాలు సిద్ధంగా ఉండనున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే 14 స్టేడియాలలో పనులు పూర్తవగా, మిగిలిన 6 చోట్ల నెలాఖరుకల్లా పూర్తి కానున్నాయి. పనుల పురోగతిపై ఆయా క్రీడా వేదికల్లో నియమించిన నోడల్ ఆఫీసర్ల నుంచి ప్రతి రోజు రిపోర్ట్ తెప్పించుకోవాలన్నారు. ఆయా జిల్లాల్లో ఇప్పటికే కలెక్టర్లు క్రీడా క్యాంపులను, స్టేడియాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 27 క్రీడలకు సంబంధించిన 1,334 మంది తెలంగాణ క్రీడాకారులకు క్యాంపులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. రాష్ట్రం నుంచి ఖేలో ఇండియా పోటీల్లో పాల్గొనే 861 క్రీడాకారులు, కోచ్ లకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. స్పోర్ట్స్ కిట్లలో 2 జతల ట్రాక్ సూట్లు, 2 టీ-షర్టులు , 2 షార్టులు, ఒక జత స్పోర్ట్స్ షూ, 2 జతలు సాక్క్సులు, 2 జతల లోదుస్తులు, 2 ట్రైనింగ్ టీ-షర్టులు ఇవ్వనున్నారు.

అత్యుత్త‌మ కోచ్‌లు..

మట్టిలో మాణిక్యాలను వెలికితీసి మెరుగైన శిక్షణ అందించేందుకు దేశంలో అత్యుత్తమ కోచ్‌లను నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతిభగల క్రీడాకారులను గుర్తించేందుకు చేపడుతున్న ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు తెలంగాణ సంప్రదాయ యుద్ధ కళ కర్రసాము ఈ పోటీల్లో ప్రదర్శన క్రీడగా తొలిసారి అడుగుపెడుతున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. జాతీయ వేదికపై కర్రసాముకు సముచిత స్థానం కల్పించడం ద్వారా రాష్ట్రంలో ఈ క్రీడకు ప్రోత్సాహం అందుతుందని సీఎం అన్నారు.

తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అనేక స్టేడియాల ఆధునీకరణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా క్రీడా అకాడమీలు, మినీ స్టేడియంల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది.

క్రీడ‌ల‌కు కొత్త ఊపిరి..

నూతన క్రీడా విధానం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులను ప్రోత్సహించే కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు కొత్త ఊపిరి పోస్తున్న‌ది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే స్థాయికి రాష్ట్ర క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ, క్రీడా విద్య, స్పోర్ట్స్ సైన్స్ అందించేందుకు హైదరాబాద్‌లో 'యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ' (YIPESU) ఏర్పాటు చేసింది. దీనికోసం దక్షిణ కొరియాకు చెందిన కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.

ఖేలో ఇండియా పోటీల నిర్వహణ కోసం రాష్ట ప్రభుత్వం మొత్తం రూ.203 కోట్లు వెచ్చిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం వాటాగా ఈ క్రీడల నిర్వహణ కోసం రూ.21 కోట్లు కేటాయించింది. అందులో భాగంగా రూ.120 కోట్ల రాష్ట్ర బడ్జెట్‌తో స్టేడియాలలో ప్రపంచ స్థాయి అభివృద్ధి పనులు, అత్యాధునిక క్రీడా పరికరాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (KIYG) 2026 నిర్వహణ నేపథ్యంలో ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వ్యూహరచన చేసింది. ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ఖేళో ఇండియా పోటీల సందర్భాంగా తీసుకున్న తాత్కాలిక చర్యలకు పోకుండా శాశ్వత క్రీడా సదుపాయాలను కల్పించే ప్రక్రియ వేగంగా జరుగుతున్న‌ది. రాష్టంలో భావి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రూ. 120 కోట్లతో పలు అంతర్జాతీయ క్రీడా అభివృద్ధి పనులు చేపడుతూ, అత్యాధునిక క్రీడా పరికరాలు సమకూరుస్తోంది. దీంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా క్రీడా సౌకర్యాలు రాష్ట్ర క్రీడాకారులకు ఉపయోగపడనున్నాయి.

2002 త‌ర్వాత ఇప్పుడే..

అయితే, 2002 సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో క్రీడలకు సంబంధించిన ప్రోత్సాహం అందించడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన 2002 జాతీయ క్రీడల తర్వాత తెలంగాణాలో మళ్ళీ జాతీయ స్థాయిలో ఇంతటి భారీ క్రీడా పోటీలని నిర్వహించనుండటం విశేషం. 2002 డిసెంబర్లో జరిగిన జాతీయ క్రీడల్లో క్రీడాకారులు, అధికారులు కలిపి దాదాపు 8,000 మంది పాల్గొనగా ఈసారి ఖేళో ఇండియాలో అన్ని రాష్ట్రాల నుంచి 9,000 పైగా మంది హాజరుకానున్నట్టు అంచనా. ఈ సంఖ్య ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే కామన్వెల్త్ క్రీడల కంటే రెట్టింపు కావ‌డం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement