త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | భూములు విక్రయించైనా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | ఆర్టీసీ (RTC) కార్మికుల సంక్షేమం, ప్ర‌యాణికుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు, సంస్థ అభివృద్ధే ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్యాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బ‌కాయిలు చెల్లించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని చెప్పారు.

G

Telangana | Published On Oct 16, 2026, 10.40 am IST

Ponnam Prabhakar | భూములు విక్రయించైనా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్‌: ఆర్టీసీ (RTC) కార్మికుల సంక్షేమం, ప్ర‌యాణికుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు, సంస్థ అభివృద్ధే ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్యాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బ‌కాయిలు చెల్లించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని చెప్పారు. అవ‌స‌ర‌మైతే ఆర్టీకి చెందిన భూములను విక్ర‌యించి అయిన బ‌కాయిలు చెల్లిస్తామ‌న్నారు. పదవీ విరమణ (Retired Employees) అనంతరం ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా, వారికి రావాల్సిన ప్రయోజనాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెల్ల‌డించారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన ఈయూ (EU), టీఎంయూ (TMU), ఎన్ఎంయూ (NMU) ప్రతినిధులు మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను క‌లిశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులను మంత్రి అభినందించి, ఘ‌నంగా సత్కరించారు. అనంత‌రం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి స్థాయిలో ఎన్నికలు జరగడం ఎంతో ముఖ్యమన్నారు. కార్మిక సంఘాల ఎన్నికల్లానే (RTC Union Elections) విద్యార్థి సంఘాల ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యానికి కీలకమని చెప్పారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు, వారి హక్కులను కాపాడేందుకు ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యబద్ధమైన నాయకత్వం ఏర్పడాలని తెలిపారు. తాను కూడా విద్యార్థి సంఘాల ఎన్నికల ద్వారానే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తుచేశారు.

కార్మికుల సమస్యలను తొందరపాటు నిర్ణయాలతో కాకుండా, నిర్మాణాత్మకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అధికారులు, కార్మిక సంఘాల నాయకులు సమన్వయంతో చర్చించి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న సమస్యలతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను కూడా ముందుగానే గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ విలీన ప్రక్రియకు (RTC Merger) సంబంధించి ఎదురైన సమస్యలు తెలంగాణలో పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూనే సంస్థ అభివృద్ధికి దోహదపడే విధంగా నిర్ణయాలు ఉండాలని పేర్కొన్నారు.

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు చర్యలు

ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను త్వరితగతిన చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా, వారికి రావాల్సిన ప్రయోజనాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అవసరమైతే సంస్థకు చెందిన విలువైన భూములను విక్రయించైనా రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

ఉద్యోగుల సీసీఎస్‌ (CCS) బకాయిలతో పాటు ఇతర పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన సీసీఎస్ బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించాల్సిన బాధ్యతను తీసుకుంటోందని స్పష్టం చేశారు. సీసీఎస్ పాత బకాయిలకు సంబంధించి ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, చట్టపరమైన బాధ్యతలకు అనుగుణంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, సంస్థ అభివృద్ధి అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ లక్ష్యాల సాధనలో కార్మిక సంఘాల నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తుందని, కార్మికులు కూడా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement