త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG TET 2026 | టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుద‌ల‌.. హాజ‌రు కానున్న 50 వేల మంది టీచ‌ర్లు..!

TG TET 2026 | తెలంగాణ టెట్ 2026 షెడ్యూల్ విడుద‌లైంది. 2026 జ‌న‌వ‌రి 3 నుంచి 15వ తేదీ వ‌ర‌కు 9 రోజుల పాటు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌తి రోజు రెండు సెష‌న్ల చొప్పున మొత్తం 15 సెష‌న్ల‌లో సీబీటీ విధానంలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కొన‌సాగ‌నుంది.

S

Telangana | Published On Dec 16, 2025, 3.53 pm IST

TG TET 2026 | టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుద‌ల‌.. హాజ‌రు కానున్న 50 వేల మంది టీచ‌ర్లు..!
Advertisement

TG TET 2026 | హైద‌రాబాద్ : తెలంగాణ టెట్ 2026 షెడ్యూల్ విడుద‌లైంది. 2026 జ‌న‌వ‌రి 3 నుంచి 15వ తేదీ వ‌ర‌కు 9 రోజుల పాటు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌తి రోజు రెండు సెష‌న్ల చొప్పున మొత్తం 15 సెష‌న్ల‌లో సీబీటీ విధానంలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కొన‌సాగ‌నుంది. తొలి సెష‌న్‌ను ఉద‌యం 9 నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కు, రెండో సెష‌న్‌ను మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు పాఠ‌శాల విద్యాశాఖ అధికారికంగా ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షలకు అభ్యర్థులు ముందుగానే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకుని, పరీక్షా కేంద్రాలకు సరైన సమయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

మొత్తం ద‌ర‌ఖాస్తులు 2,37,754

టీజీ టెట్ పేప‌ర్-1, పేప‌ర్-2కు క‌లిపి మొత్తం 2,37,754 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ అధికారులు వెల్ల‌డించారు. ఇందులో పేప‌ర్‌-1కు 85,538 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, పేప‌ర్‌-2కు 1,52,216 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 1,52,216 మంది రెండు పేప‌ర్ల‌కు హాజ‌రు కానున్నారు.

టెట్‌కు హాజ‌రు కానున్న‌ 50 వేల మంది టీచ‌ర్లు

2,37,754 ద‌ర‌ఖాస్తుదారుల్లో 50 వేల మంది వ‌ర‌కు టీచ‌ర్లు ఉన్నారు. పేప‌ర్‌-2కు 33,564 మంది టీచ‌ర్లు ద‌ర‌ఖాస్తు చేసుకోగా, పేప‌ర్‌-1కు 15,672 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. రెండు పేప‌ర్ల‌కు క‌లిపి 11,719 మంది టీచ‌ర్లు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

టీచ‌ర్లకు టెట్ త‌ప్ప‌నిస‌రి.. ఎందుకంటే..?

ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగంలో కొనసాగేందుకు లేదా పాఠశాలల్లో పదోన్నతి పొందేందుకు టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్టు(టెట్‌)లో ఉత్తీర్ణులు కావడం ఉపాధ్యాయులకు తప్పనిసరని సుప్రీంకోర్టు 2025 సెప్టెంబ‌ర్ 1వ తేదీన స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్‌ 23(1) ప్రకారం టీచర్ల విద్యార్హతలను ఎన్‌సీటీఈ నిర్ధారిస్తుంది. 1 నుంచి 8వ తరగతి వరకు టీచర్లుగా పనిచేయాలంటే టెట్‌లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23న ఎన్‌సీటీఈ ఓ నోటిఫికేషన్‌ జారీచేసింది. టీచర్లుగా నియమితులైనవారు ఐదేళ్ల లోపు టెట్‌లో ఉత్తీర్ణులు కావాలని ఎన్‌సీటీఈ సమయం ఇచ్చింది. అయితే తర్వాత ఈ గడువును మరో నాలుగేళ్లకు పొడిగించింది. కాగా, ఎన్‌సీటీఈ నోటిఫికేషన్‌ని సవాలు చేస్తూ కొందరు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. 2011 జూలై 29 లోపల టీచర్లుగా నియమితులైన అభ్యర్థులు సర్వీసులో కొనసాగడానికి టెట్‌ అవసరం లేదని మద్రాసు హైకోర్టు 2025 జూన్‌లో తీర్పు ఇచ్చింది. అయితే పదోన్నతి కోసం టెట్‌ పాసు కావడం తప్పనిసరని స్పష్టం చేసింది. దీనిపై దాఖలైన అప్పీలుపై 2025 సెప్టెంబ‌ర్ 1న‌ తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు సర్వీసులో కొనసాగడంతోపాటు ప్రమోషన్‌ పొందేందుకు కూడా టెట్‌ తప్పనిసరని స్పష్టం చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement