త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Budget 2026 | రాష్ట్ర‌వ్యాప్తంగా ఇందిర సౌర గిరి జ‌ల వికాసం.. బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఆర్థిక‌మంత్రి భ‌ట్టి

TG Budget 2026 | ఇందిర సౌర గిరి జ‌ల వికాసం ప‌థ‌కానికి రూ.12,600 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. ఈ పథకం ద్వారా 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లను అందించి, వారి పురోగతికి ఇతోధికంగా తోడ్ప‌డ‌తామ‌న్నారు.

P

Telangana | Published On Mar 20, 2026, 1.07 pm IST

TG Budget 2026 | రాష్ట్ర‌వ్యాప్తంగా ఇందిర సౌర గిరి జ‌ల వికాసం.. బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఆర్థిక‌మంత్రి భ‌ట్టి
Advertisement

TG Budget 2026 | ఇందిర సౌర గిరి జ‌ల వికాసం ప‌థ‌కానికి రూ.12,600 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. ఈ పథకం ద్వారా 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లను అందించి, వారి పురోగతికి ఇతోధికంగా తోడ్ప‌డ‌తామ‌న్నారు. 6 లక్షల ఎకరాల పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహించి 2 లక్షల 10 వేల గిరిజన రైతులకు ఈ సౌకర్యం అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ పథకాన్ని ఇప్పటికే అచ్చంపేటలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామ‌ని, దీని విధివిధానాలు అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా.. రాష్ట్రంలోని ఐకేపీ సంఘాల్లోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది త‌మ ప్రభుత్వ సంకల్ప‌మ‌న్నారు. అందుకోసం ఐదేళ్ల‌లో రూ.లక్ష కోట్లు బ్యాంకు ద్వారా రుణాలను ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామ‌న్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.57,938 కోట్ల రుణం ఇప్పించామ‌న్నారు. వీఎల్ఆర్ పథకం కింద 2023 డిసెంబర్ నుంచి ఈనాటి వరకు పట్టణ గ్రామీణ ఎస్‌హెచ్‌జీల‌కు 1,329 కోట్ల వడ్డీ రాయితీని విడుదల చేయడం జరిగింద‌న్నారు. రాష్ట్రంలో 67 లక్షల మహిళలతో ఐకేపీ బలమైన స్వయం సహాయక సంఘాల నెట్ వర్క్‌గా ఏర్ప‌డింద‌న్నారు. మహిళా సంఘాలతో శిల్పారామంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామ‌ని, ఈ సముదాయం ఉత్పత్తులు 7 కోట్ల 68 లక్షలకు చేరాయ‌న్నారు. ఎస్‌హెచ్‌జీల ద్వారా 600 బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్ ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించి, మొదటి దశలో 177 కోట్ల 84 లక్షల రూపాయలతో 494 బస్సులను కొనుగోలు చేసింద‌న్నారు. నారాయణపేట, సంగారెడ్డిలలో 2 పెట్రోలు బంక్ లు ఏర్పాటు చేశామ‌న్నారు. 28 పెట్రోలు బంకుల ఏర్పాటు పురోగతిలో ఉన్నాయ‌న్నారు. మహిళా సాధికారతను మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే ఉన్న 10 జిల్లాలకు అదనంగా 22 జిల్లాలలో ఇందిరా మహిళా శక్తి భవనాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు.

ఇందిర సౌర గిరి జల వికాసం పథకం అంటే.. ?

కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గిరిజన రైతుల కోసం తీసుకువ‌చ్చిన ప‌థ‌క‌మే ఇందిర సౌర గిరి జల వికాసం పథకం. పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరి రైతుల‌కు ఈ ప‌థ‌కంలో సాగునీటి వ‌స‌తి క‌ల్పిస్తారు. గిరిజన రైతులు వ్యవసాయంపై ఆధారపడి ఆర్థికంగా నిల‌దొక్కుకునేందుకు ప్ర‌భుత్వ స‌హాయ స‌హ‌కారాలు అందిస్తుంది. విద్యుత్ సౌకర్యం లేని పోడు భూముల్లో సాగు చేసే గిరిజ‌న రైతులందరికీ 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపుసెట్ల‌ను ఉచితంగా ప్ర‌భుత్వం అందిస్తుంది. నీటి వనరులు లేని భూముల్లో బోర్లు, బావులు తవ్వించి నీటి సౌకర్యాన్ని క‌ల్పించేందుకు ఏర్పాట్లు చేస్తారు. అంతే కాకుండా భూమిని సాగుయోగ్యంగా మార్చ‌డం, విత్త‌నాలు, ఎరువులు, ఆధునిక సాగు పద్ధతులపై అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. గిరి రైతులు కేవ‌లం వ‌ర్షాల‌పై ఆధార‌ప‌డ‌కుండా నీటి వ‌స‌తితో పంట‌లు పండించి ఆర్థికంగా నిల‌దొక్కుకునేలా ప్రోత్సాహం అందిస్తుంది. అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన రైతులు మాత్ర‌మే ఈ ప‌థ‌కానికి అర్హులు. రెండున్న‌ర ఎక‌రాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల‌కు ఒక యూనిట్ వ్య‌క్తిగ‌తంగా అందిస్తారు. అంత‌క‌న్నా త‌క్కువ భూమి ఉన్న రైతుల‌ను స‌మీపంలో ఉన్న రెండు నుంచి ఐదుగురు రైతుల‌ను గ్రూప్‌గా ఏర్పాటు చేసి వారికి ఈ యూనిట్ అందిస్తారు.

Advertisement

తాజావార్తలు

Advertisement