త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Seed Act | నకిలీ, నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయిన రైతుకు తక్షణమే నష్టపరిహారం

నకిలీ విత్తనాలతో నష్టపోతున్న రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో కొత్త విత్తన చట్టం తీసుకురానుంది.

J

Telangana | Published On Aug 29, 2026, 6.45 pm IST

Telangana Seed Act | నకిలీ, నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయిన రైతుకు తక్షణమే నష్టపరిహారం
Advertisement
  • సచివాలయంలో డ్రాఫ్ట్ విత్తన చట్టం-2025పై ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమీక్ష
  • నకిలీ విత్తనాలతో పంట నష్టపోయే రైతులకు వెంటనే పరిహారం అందేలా కొత్త చట్టంలో కీలక నిబంధనలు
  • విత్తన చట్టం విషయంలో కేంద్రం జాప్యం చేసినా, వచ్చే పంట కాలం నాటికి రాష్ట్రంలో స్వంతంగా విత్తన చట్టం అమలు
  • విత్తన ఉత్పత్తి రైతులు, కంపెనీల మధ్య దళారుల ప్రమేయం లేకుండా పారదర్శక అగ్రిమెంట్ల కోసం చర్యలు

Telangana Seed Act | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. నకిలీ విత్తనాలతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు, కేంద్ర చట్టంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోనే 'సమగ్ర విత్తన చట్టాన్ని' (Comprehensive Seed Act) పకడ్బందీగా తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్ణయించారు. సచివాలయంలో డ్రాఫ్ట్ విత్తన చట్టం-2025 పై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి, అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

కేంద్రం జాప్యం.. రాష్ట్రం యాక్షన్

రాష్ట్రంలో సమగ్ర విత్తన చట్టం కోసం తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఓ డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసి.. రైతులు, సీడ్ కంపెనీలు, డీలర్లతో చర్చలు జరిపింది. సరిగ్గా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా 'విత్తన చట్టం-2025' ముసాయిదాను తెరపైకి తెచ్చింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తన అభ్యంతరాలు, సూచనలు పంపి నెలలు గడుస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కేంద్రం నిర్ణయం కోసం ఇక వేచి చూసేది లేదని, వచ్చే క్రాప్ సీజన్ (Crop Season) నాటికి రాష్ట్ర సొంత చట్టాన్ని అమలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఒకవేళ కేంద్రం అనుమతి ఇవ్వకపోతే, నేరుగా అసెంబ్లీలో బిల్లు పెట్టి సభ్యుల ఆమోదంతో చట్టంగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు.

నష్టపోతే పరిహారం.. నకిలీలకు చెక్

నకిలీ, నాసిరకం విత్తనాల వల్ల ఏ రైతు పంట నష్టపోయినా వారికి తక్షణమే నష్టపరిహారం (Compensation) అందేలా ఈ కొత్త చట్టంలో పటిష్టమైన గ్రీవెన్స్ సిస్టమ్‌ను (Grievance Redressal Mechanism) తీసుకురానున్నారు. అనధికార విత్తన విక్రయాలను అరికట్టేందుకు క్రాప్ బుకింగ్, సీడ్ ట్రేసబిలిటీ (Seed Traceability) విధానాన్ని అనుసంధానం చేస్తామని మంత్రి తెలిపారు.

దళారులకు చెక్.. రైతులకు భద్రత

తెలంగాణను దేశానికే "సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా" (Seed Bowl of India) గా పిలుస్తారు. ఈ క్రమంలో విత్తన ఉత్పత్తి చేసే రైతులకు చట్టపరమైన రక్షణ కల్పించనున్నారు. రైతులు, సీడ్ కంపెనీలకు మధ్య మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా డైరెక్ట్, పారదర్శక ఒప్పందాలు జరిగేలా కొత్త చట్టం రక్షణ కల్పిస్తుంది. విత్తన ఉత్పత్తికి న్యాయమైన ధర కల్పించడంతో పాటు, మండల స్థాయిలో కమ్యూనిటీ సీడ్ బ్యాంకులు ఏర్పాటు చేసి దేశీయ విత్తనాలను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

Advertisement
Advertisement