త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Tummala | రైతుల అవసరాలే లక్ష్యంగా ఉద్యాన పరిశోధనలు ఉండాలి

Minister Tummala | రైతుల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పరిశోధనలు జరగాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పరిశోధనల ఫలితాలు రైతుల చెంతకు చేరేలా స్మార్ట్‌ఫోన్‌, సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ వంటి ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని సూచించారు.

P

Telangana | Published On Aug 18, 2026, 6.20 pm IST

Minister Tummala  | రైతుల అవసరాలే లక్ష్యంగా ఉద్యాన పరిశోధనలు ఉండాలి
Advertisement
  • ఫలితాలు రైతుల చెంతకు చేరేలా సాంకేతికతను వాడుకోవాలి
  • చిన్న, సన్నకారు రైతులే లక్ష్యంగా ప్రాధాన్యం ఇవ్వాలి
  • కూరగాయల ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక కార్యాచరణ అవసరం
  • వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు
  • కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన కళాశాల ప్రాంగణంలో హార్టికల్చరల్ రీసెర్చ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన

Minister Tummala | రైతుల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పరిశోధనలు జరగాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పరిశోధనల ఫలితాలు రైతుల చెంతకు చేరేలా స్మార్ట్‌ఫోన్‌, సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ వంటి ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని సూచించారు. కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన కళాశాల ప్రాంగణంలో హార్టికల్చరల్‌ రీసెర్చ్‌ కాంప్లెక్స్‌కు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మంత్రి మాట్లాడారు. ఉద్యాన పంటలు రాష్ట్ర వ్యవసాయ భూమిలో 6 శాతమే ఉన్నా.. వ్యవసాయ స్థూల విలువలో 26 శాతం, సుమారు రూ.30,346 కోట్ల వాటా కలిగి ఉన్నాయని మంత్రి తెలిపారు. చిన్న, సన్నకారు రైతులే లక్ష్యంగా తక్కువ ఖర్చుతో, చిన్న కమతాల్లో అమలు చేయగల సాంకేతికత, యంత్రాలు, సాగు పద్ధతులపై పరిశోధనలు జరగాలన్నారు. రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తిలో సుమారు 70 శాతం లోటు ఉందని, ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు. ప్రతి జిల్లా, మండల కేంద్రంలో డెమాన్‌స్ట్రేషన్‌ ప్లాట్లు ఏర్పాటు చేసి రైతులకు పంటలు, దిగుబడులు, ఆదాయ అవకాశాలను ప్రత్యక్షంగా చూపించాలని సూచించారు.

10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌

తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగును రానున్న మూడు, నాలుగేళ్లలో 10 లక్షల ఎకరాలకు విస్తరించడమే లక్ష్యమని తుమ్మల తెలిపారు. ఆయిల్‌పామ్‌తో పాటు కోకో, జాపత్రి వంటి అంతర పంటలతో అదనపు ఆదాయం పొందే అవకాశాలపై పరిశోధనా కేంద్రాలు, డెమో ఫారాల్లో ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. కూరగాయలు, పూలు, ద్రాక్ష, ఔషధ, సుగంధ పంటల పరిశోధనలను ఒకే వేదికపై సమన్వయం చేసేందుకు హార్టికల్చరల్‌ రీసెర్చ్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు కీలక ముందడుగు అని పేర్కొన్నారు. పంట అనంతర నష్టాల నివారణ, నిల్వ–మార్కెటింగ్‌ వ్యవస్థల బలోపేతంపైనా పరిశోధనలు అవసరమన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సమతుల్య ఎరువుల వాడకం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రసాయన అవశేషాలు తగ్గిన నాణ్యమైన ఉత్పత్తులతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తెలంగాణ పంటలకు డిమాండ్‌ పెరుగుతుందన్నారు.

జిల్లాల్లోనూ పరిశోధనలు

డ్రిప్‌, స్ప్రింక్లర్‌ వంటి సూక్ష్మ సాగు విధానాలతో తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే పద్ధతులపై పరిశోధనలు పెంచాలని మంత్రి కోరారు. విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాల్లో కార్యకలాపాలు విస్తరించాలన్నారు. ప్రభుత్వ సీడ్‌ ఫారాలు, ఇతర భూములను వినియోగించి జిల్లా స్థాయిలో పరిశోధన, శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామీణ యువత రూపొందిస్తున్న వ్యవసాయ యంత్రాలు, పరికరాల్లోని సృజనాత్మకతను ప్రోత్సహించాలని, విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్‌, మష్రూమ్‌ ఉత్పత్తి యూనిట్‌ వంటి కార్యక్రమాలు రైతులు, మహిళలు, గ్రామీణ యువతకు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి మూడేళ్లకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని పరిశోధన ఫలితాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేలా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ–ఉద్యాన శాఖలు సమన్వయంతో పనిచేయాలని తుమ్మల సూచించారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ తదితర అనుబంధ రంగాలన్నీ రైతు కేంద్రంగా పనిచేసి, రైతు కష్టాన్ని తగ్గించి ఆదాయాన్ని పెంచే దిశగా పరిశోధనలు సాగాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement