త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Tummala | వ్యవసాయ మార్కెట్లకు డిజిట‌ల్ హంగులు

Minister Tummala | రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖను పూర్తిస్థాయిలో డిజిటలీకరించి పారదర్శక వ్యవస్థగా తీర్చిదిద్దాలని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డుల్లో జరిగే ప్రతి లావాదేవీ డిజిటల్ పద్ధతిలో నమోదయ్యేలా చర్యలు చేపట్టాలని, అక్రమాలకు ఏమాత్రం తావులేకుండా సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని స్పష్టం చేశారు.

P

Telangana | Published On Aug 1, 2026, 4.05 pm IST

Minister Tummala | వ్యవసాయ మార్కెట్లకు డిజిట‌ల్ హంగులు
Advertisement
  • ఇక‌పై అక్రమాలకు చెక్..
  • సెప్టెంబర్ నుంచి ఆటోమేషన్ అమలు
  • మూడు నెలల్లో మార్కెట్ యార్డులు, గోదాములకు సౌర విద్యుత్ వ్యవస్థ
  • వెల్ల‌డించిన మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర్‌రావు

Minister Tummala | రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖను పూర్తిస్థాయిలో డిజిటలీకరించి పారదర్శక వ్యవస్థగా తీర్చిదిద్దాలని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డుల్లో జరిగే ప్రతి లావాదేవీ డిజిటల్ పద్ధతిలో నమోదయ్యేలా చర్యలు చేపట్టాలని, అక్రమాలకు ఏమాత్రం తావులేకుండా సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో నిర్వహించిన మార్కెటింగ్ శాఖ సమీక్ష సమావేశంలో శాఖ పనితీరు, అభివృద్ధి పనులు, పత్తి కొనుగోళ్ల సన్నద్ధత, ఇంజినీరింగ్ పనులు, సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు, ప్రత్యేక తనిఖీ బృందాల నివేదికలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఆటోమేష‌న్ అమ‌లు చేయాల‌ని ఆదేశాలు

రాష్ట్రంలోని 206 మార్కెట్ కమిటీలను పూర్తిస్థాయిలో ఆటోమేషన్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు, టెండర్ ప్రక్రియలను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి, సెప్టెంబర్ నుంచి అమలు ప్రారంభించాలని సూచించారు. ప్రతి మార్కెట్ కమిటీలో సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, గేట్ ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారంపై అనుసంధానం చేయాలని చెప్పారు. రవాణా శాఖలో అమలవుతున్న నంబర్ ప్లేట్ స్కానింగ్ విధానాన్ని మార్కెట్ యార్డుల్లోనూ అమలు చేసి, వాహనాల రాకపోకలు, తూకం, కొనుగోలు లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలో నమోదయ్యేలా సాఫ్ట్‌వేర్ రూపొందించాలని ఐటీ విభాగానికి సూచించారు. ఇకపై మార్కెటింగ్ శాఖలో జరిగే కొనుగోళ్లు పూర్తిగా డిజిటల్ విధానంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఏడు ప్రత్యేక తనిఖీ బృందాలు నిర్వహించిన తనిఖీలపై సోమవారం లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఆ నివేదికల ఆధారంగా మార్కెటింగ్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ బృందాల పనితీరును వారంవారీ లక్ష్యాలతో పర్యవేక్షించాలని పేర్కొన్నారు.

పత్తి కొనుగోళ్లకు ముందస్తు సన్నద్ధత

రానున్న పత్తి కొనుగోలు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు, సంబంధిత అధికారులతో ఆగస్టు తొలి లేదా రెండో వారంలో సమన్వయ సమావేశం నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. గత రెండేళ్లలో విజిలెన్స్ గుర్తించిన లోపాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, కనీస మద్దతు ధర ప్రయోజనం పూర్తిగా రైతులకే అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లు, లిఫ్టర్లు వంటి పరికరాలను కొనుగోలు చేసే ముందు సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని, వాటి వినియోగంపై అధికారులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అవసరం ఉన్న జిల్లాల్లోనే పరికరాలు కొనుగోలు చేయాలని, వినియోగం లేకుండా కొనుగోలు చేసి నిరుపయోగంగా ఉంచితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అభివృద్ధి పనులకు గడువులు

మార్కెటింగ్ శాఖలో కొనసాగుతున్న ఇంజినీరింగ్ పనులన్నింటినీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేసేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. ఇంజినీరింగ్ సిబ్బంది కొరత కారణంగా పనులు ఆలస్యమైతే అవసరమైతే ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలకు అప్పగించాలని ఏపీసీకి సూచించారు. విధులకు హాజరుకాని ఇంజినీర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మార్కెట్ యార్డుల్లో పెండింగ్ బిల్లులు, ఇతర సమస్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని శాఖ కార్యదర్శికి సూచించారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులు, గోదాముల్లో సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు అత్యంత ప్రాధాన్యంగా చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వచ్చే నెలలోగా అన్ని మార్కెట్ కమిటీల నుంచి ఫీజిబిలిటీ నివేదికలు సేకరించి, సెప్టెంబర్‌లో పనులు ప్రారంభించి, నవంబర్ నాటికి సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

వారంలో కోహెడ పండ్ల మార్కెట్ డిజైన్లు

కోహెడ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను వచ్చే వారంలోగా ఖరారు చేసి, ముఖ్యమంత్రి ఆమోదంతో వచ్చే నెలలో నిర్మాణ పనులు ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని నెలవారీ లక్ష్యాలతో పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. మార్కెటింగ్ శాఖలో ఇంజినీరింగ్, పరిపాలన విభాగాల్లో ఉన్న సిబ్బంది కొరతను గుర్తించి, అదనపు పోస్టుల మంజూరు కోసం ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని మార్కెటింగ్ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. శాఖ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని భర్తీ చేసి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని సూచించారు.

ఆయిల్ పామ్ రైతులతో మంత్రి భేటీ

సచివాలయంలో వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నిర్మల్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఆయిల్ పామ్ రైతు సంఘాల నాయకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి పలు సమస్యలను వివరించారు. నాణ్యమైన మొక్కల సరఫరా, తక్కువ ధరలకు ఎరువులు, విద్యుత్ లైన్ల సమస్యల పరిష్కారం, ప్రతి మండలంలో ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రాల ఏర్పాటు, బ్యాంకు రుణాలు, యంత్ర పరికరాలపై సబ్సిడీ, కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి స్పందిస్తూ ఆయిల్ పామ్ రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు కోరిన వెంటనే నాణ్యమైన మొక్కలు అందుబాటులో ఉండేలా ఇప్పటికే కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అధికారులు, కంపెనీలు, రైతులు సమన్వయంతో పనిచేస్తే రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు మరింత విస్తరిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement