త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Uttam | తెలంగాణలో భారీగా ఆధునిక ధాన్య సైలోలు

Minister Uttam | రాష్ట్రంలో పెరుగుతున్న వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణకు అనుగుణంగా భారీ స్థాయిలో ఆధునిక ధాన్య సైలోలు నిర్మించాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. అదనంగా 5 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్‌ టన్నుల శాస్త్రీయ నిల్వ సామర్థ్యాన్ని సృష్టించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థను ఆదేశించారు.

P

Telangana | Published On Aug 27, 2026, 7.09 pm IST

Minister Uttam | తెలంగాణలో భారీగా ఆధునిక ధాన్య సైలోలు
Advertisement
  • 5-10 లక్షల టన్నుల అదనపు నిల్వ సామర్థ్యం లక్ష్యం
  • నిర్మాణం, నిర్వహణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు భాగస్వామ్యం
  • ఆటోమేటెడ్ హ్యాండ్లింగ్, డిజిటల్ పర్యవేక్షణతో ఆధునిక సదుపాయాలు
  • మిల్లర్ల బకాయిల వసూలుకు పటిష్ట కార్యాచరణ
  • జీఈఎం, తెలంగాణ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా ధాన్యం వేలం
  • మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి

Minister Uttam | రాష్ట్రంలో పెరుగుతున్న వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణకు అనుగుణంగా భారీ స్థాయిలో ఆధునిక ధాన్య సైలోలు నిర్మించాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. అదనంగా 5 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్‌ టన్నుల శాస్త్రీయ నిల్వ సామర్థ్యాన్ని సృష్టించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థను ఆదేశించారు. సైలోల నిర్మాణం, నిర్వహణలో మహిళా స్వయం సహాయక సంఘాలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. పౌర సరఫరాల సంస్థ కార్యకలాపాలపై సీనియర్‌ అధికారులతో మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. మెరుగైన సాగునీటి సదుపాయాలు, సాగు విస్తీర్ణం పెరగడం, కనీస మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం సేకరిస్తుండటంతో రాష్ట్రంలో వరి ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లు ఏటేటా పెరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సేకరించిన ధాన్యాన్ని సురక్షితంగా, శాస్త్రీయంగా నిల్వ చేసేందుకు వ్యూహాత్మక ప్రాంతాల్లో ఆధునిక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సంప్రదాయ గోదాములతో సరిపోదు

భవిష్యత్‌ అవసరాలను కేవలం సంప్రదాయ గోదాములతో తీర్చడం సాధ్యం కాదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆటోమేటెడ్‌ హ్యాండ్లింగ్‌, శాస్త్రీయ సంరక్షణ, యాంత్రిక రవాణా, డిజిటల్‌ పర్యవేక్షణ వంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలతో కూడిన నిల్వ నెట్‌వర్క్‌ తెలంగాణకు అవసరమన్నారు. తేమ, పురుగులు, ఇతర కారణాలతో ధాన్యం నష్టపోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. నిల్వ నుంచి తరలింపు వరకు ప్రతి దశలో నాణ్యత, భద్రత, సామర్థ్యాన్ని పెంచేలా సైలో వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామస్థాయి సంస్థలు, పౌర సరఫరాల సంస్థ భాగస్వామ్యంతో సైలోల నిర్మాణం, నిర్వహణకు అనువైన నమూనాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల సంస్థ, మహిళా సంఘాలు, ఇతర భాగస్వామ్య సంస్థల బాధ్యతలను స్పష్టంగా నిర్వచించాలని చెప్పారు. సైలోలు ఆర్థికంగా స్వయం సమర్థంగా, వృత్తిపరంగా నిర్వహించేలా తగిన ఆర్థిక, కార్యాచరణ నమూనాలను రూపొందించాలని సూచించారు. “రాష్ట్ర ధాన్య నిల్వ మౌలిక సదుపాయాలను కేవలం వచ్చే కొనుగోలు సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని కాదు. రాబోయే దశాబ్దాల అవసరాలను ముందుగానే అంచనా వేసి నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది” అని మంత్రి వివరించారు.

90 లక్షల టన్నుల సేకరణకు సన్నద్ధం

ప్రస్తుతం పౌర సరఫరాల సంస్థ, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, కేంద్ర గిడ్డంగుల సంస్థ, భారత ఆహార సంస్థ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, ప్రైవేటు పెట్టుబడిదారుల గోదాముల ద్వారా ధాన్యం నిల్వ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు సొంతంగా సుమారు 6 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ.. ప్రతి సీజన్‌లో భారీగా సేకరించే ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ఇతర సంస్థలు, అద్దె గోదాములపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ఇటీవలి ధాన్యం సేకరణ పరిమాణమే నిల్వ వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడిని తెలియజేస్తోందని చెప్పారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో పౌర సరఫరాల సంస్థ 90 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం సేకరించేందుకు సిద్ధమైందని, సీజన్‌ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా తక్షణమే సుమారు 12 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భారీగా పెరుగుతున్న సేకరణకు, అందుబాటులో ఉన్న శాశ్వత శాస్త్రీయ నిల్వ సామర్థ్యానికి మధ్య అంతరం కొత్త సైలోల నిర్మాణం ఎంత అవసరమో స్పష్టం చేస్తోందన్నారు.

మిల్లర్ల బకాయిల వసూలుకు వ్యూహం

డిఫాల్టర్‌ కస్టమ్‌ రైస్‌ మిల్లర్ల నుంచి రావాల్సిన బకాయిల వసూలును వేగవంతం చేసేందుకు సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశాలు, ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా బకాయిల వసూలు వ్యూహాన్ని సిద్ధం చేయాలని చెప్పారు. డిఫాల్టర్లపై చేపట్టే న్యాయపరమైన, విజిలెన్స్‌, పరిపాలనాపరమైన చర్యలన్నింటిలోనూ ప్రజాధనం తిరిగి రాబట్టడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు.

వేలంలో పార‌ద‌ర్శ‌క‌త‌

ధాన్యం నిల్వల ప్రతిపాదిత వేలంపైనా మంత్రి సమీక్షించారు. తదుపరి విడత వేలం ప్రారంభించే ముందే లాట్‌ పరిమాణాలు, బిడ్డింగ్‌ నిబంధనలు, వేలం నిర్వహించే వేదికలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. వేలం ప్రక్రియలో పారదర్శకత, ఏకరూపత, విస్తృత భాగస్వామ్యం ఉండేలా గవర్నమెంట్‌ ఈ-మార్కెట్‌ప్లేస్‌ (GeM), తెలంగాణ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ వంటి ప్రభుత్వ వేదికలను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తికి తగిన నిల్వ సామర్థ్యాన్ని సృష్టించడం ద్వారా రైతుల కష్టార్జిత పంటకు భద్రత కల్పించడంతోపాటు.. ప్రజాధనాన్ని కాపాడటం, నిల్వ నష్టాలను తగ్గించడం, పౌర సరఫరాల వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల అదనపు సంచాలకులు రోహిత్‌సింగ్‌, పౌర సరఫరాల సంస్థకు చెందిన ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement