త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Theenmar Mallanna | ఇంకెన్నాళ్లు ఈ అగ్ర‌వ‌ర్ణాల ఆధిపత్యం.. ఇక బీసీ ముఖ్య‌మంత్రే ల‌క్ష్యం

Theenmar Mallanna | తెలంగాణ రాష్ట్ర‌ రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న అగ్ర‌వ‌ర్ణాల ఆధిపత్యం ఇంకెన్నాళ్ల‌ని.. ఇక బీసీని ముఖ్య‌మంత్రిని చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Aug 27, 2026, 7.14 pm IST

Theenmar Mallanna | ఇంకెన్నాళ్లు ఈ అగ్ర‌వ‌ర్ణాల ఆధిపత్యం.. ఇక బీసీ ముఖ్య‌మంత్రే ల‌క్ష్యం
Advertisement
  • వంద‌ల ఓట్లున్నోళ్ల‌కే ఎమ్మెల్యే పీఠం.. ల‌క్షల్లో ఉన్న బీసీలకు నో ఎమ్మెల్యే
  • వెలమల గుత్తాధిపత్యంపై సంచలన గణాంకాల విడుదల
  • 'సర్జికల్ స్ట్రైక్-59' ప్రారంభించిన టీఆర్పీ వ్య‌వ‌స్థాప‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌
  • తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీగా చేరాలని పిలుపు

Theenmar Mallanna | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ రాష్ట్ర‌ రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న అగ్ర‌వ‌ర్ణాల ఆధిపత్యం ఇంకెన్నాళ్ల‌ని.. ఇక బీసీని ముఖ్య‌మంత్రిని చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న స్ప‌ష్టం చేశారు. బీసీ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా గురువారం ఆయ‌న‌ సంచలన గణాంకాలను విడుదల చేశారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో కూడా ఓట్లు లేని వెలమలు ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నార‌ని.. లక్షల సంఖ్యలో ఓటు బలం ఉన్న బీసీలు అధికారానికి దూరమవుతున్నార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువత టీఆర్పీలో చేరాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

సిర్పూర్‌లో వెల‌మ ఓట్లు 108, బీసీలవి 1.05 లక్షలు.. ఎమ్మెల్యే మాత్రం వెలమ

సిర్పూర్ నియోజకవర్గంలో మొత్తం 2.27 లక్షల ఓటర్లలో వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కేవలం 108 మాత్రమే ఉన్నాయని మల్లన్న పేర్కొన్నారు. అదే సమయంలో బీసీ ఓటర్లు 1,05,343 మంది ఉన్నారని, అయినప్పటికీ ఎమ్మెల్యే పదవి వెలమ వర్గానికే దక్కడం సామాజిక అన్యాయానికి నిదర్శనమన్నారు. బలమైన బీసీ నాయకులను వివిధ పార్టీల్లో చీల్చి రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

ఎల్లారెడ్డిలో వెల‌మ ఓట్లు 545.. బీసీల‌వి 1.60 లక్షలు.. మ‌రి ప్రాతినిధ్యం ఎక్కడ?

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీసీ ఓటర్లు 1,60,891 మంది ఉండగా వెలమ ఓట్లు కేవలం 545 మాత్రమే ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. బీసీ నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, ఆ కుట్రలను 2028 ఎన్నికల్లో తిప్పి కొడతాం అని స్పష్టం చేశారు.

మంచిర్యాలలో 70 ఏళ్లుగా ఒకే సామాజిక వర్గం..

మంచిర్యాలలో బీసీ ఓటర్లు 1.57 లక్షలకుపైగా ఉండగా వెలమ ఓట్లు కేవలం 1,131 మాత్రమే ఉన్నాయని మల్లన్న వివరించారు. 1952 నుంచి ఇప్పటి వరకు ఎక్కువకాలం వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఎమ్మెల్యేలుగా కొనసాగారన్నారు. చరిత్రలో ఒక్కసారి మాత్రమే బీసీ అభ్యర్థి విజయం సాధించారని గుర్తు చేశారు.

కోరుట్లలో 2,087 ఓట్లతో దశాబ్దాల ఆధిపత్యం?

కోరుట్ల నియోజకవర్గంలో 71 శాతం బీసీ ఓటర్లు ఉన్నప్పటికీ, రాజకీయ అధికారం మాత్రం వెలమ వర్గం చేతుల్లోనే కొనసాగిందని మల్లన్న అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో బీసీ ఓట్లను ఉపయోగించుకొని అధికారాన్ని కాపాడుకున్నారని విమర్శించారు.

పార్టీలు కాదు.. మన వర్గాల భవిష్యత్తు ముఖ్యం

అధికారం కోసం అగ్రవర్ణ నేతలు సిద్ధాంతాలను మార్చుకుంటూ పార్టీలు మారుతున్నారని మల్లన్న విమర్శించారు. ప్రజలు పార్టీలను కాకుండా తమ సామాజిక వర్గాల రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

59 నియోజకవర్గాల్లో బీసీ రాజ్యాధికార పోరాటం..

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 59 కీలక నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకొని "సర్జికల్ స్ట్రైక్-59" కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా బీసీ ముఖ్యమంత్రిని గద్దెపై కూర్చోబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తోందని మల్లన్న తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, బీసీ వర్గాల ప్రజలు పెద్దఎత్తున పార్టీలో చేరి రాజ్యాధికార ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement