లోడ్ అవుతోంది...


ట్రాఫిక్ చలాన్ల విషయంలో
ద్వంద్వ వైఖరి చూపుతున్న సీఎం
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. చలాన్లు వద్దన్నాడు
సీఎం అయ్యాక.. ముక్కు పిండి వసూలు చేయమంటున్నాడు
విస్తుపోతున్న తెలంగాణ జనం..
విరుచుకుపడుతున్న ప్రతిపక్షాలు...
పిల్లలు తెలిసో తెల్వక తాగితే డ్రంకెన్ డ్రైవ్ అని నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని, వాన్ని పోలీసు స్టేషన్‌లో పెట్టి, వాని వీపులు పగులగొట్టి, రూ. 5 వేలు వసూలు చేస్తున్న సన్నాసి.. చట్టం నీకోటి.. పేదోళ్లకు ఇంకో చట్టమా అని నేను అడుగుతున్నా. - 2023 ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి
డ్రంకెన్ డ్రైవ్‌లో బండ్లు నడిపే వారిని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది. వాళ్ల మీద కఠినంగా కూడా వ్యవహరించాలి. మీరు చలాన్లు వేస్తున్నారు. కానీ సంవత్సరమైన తర్వాత డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. ఎలాగూ తగ్గిస్తారు కదా.. మళ్లీ చూద్దాం లే అన్న వ్యవస్థ ఈ రోజు ఒక సమస్యగా మారింది. అందుకే పోలీసు శాఖకు ఒక సూచన చేస్తున్నా. ఈ చలాన్లు వేయడం అనేది అవగాహన కల్పించాలి. ఎవరి మీదనైనా చలాన వేస్తే ఒక్క పైసా కూడా తగ్గించకండి. మూడోది వారి బ్యాంకు అకౌంట్స్‌తోని డైరెక్ట్‌గా డిపార్ట్‌మెంట్‌కి సింక్రనైజ్ చేసుకుంటే ఎప్పుడు చలాన్ పడితే అప్పుడు ఆటోమేటిక్‌గా డెడక్ట్ అయ్యే విధంగా చూడండి. బండి రిజిస్ట్రేషన్‌కు వచ్చినప్పుడు ఆ యజమాని ఖాతాను మీరు తీసుకోండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తదో.. ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తదో.. ఆ బండి యజమాని ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యే విధంగా మీరు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. - 2026 జనవరి 12న సీఎం రేవంత్ రెడ్డి
త్రినేత్ర.న్యూస్ : ట్రాఫిక్ చలాన్లు వేసి ప్రజలను వేధిస్తున్నారంటూ నాడు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడిన నేటి సీఎం రేవంత్ రెడ్డి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ...ముక్కుపిండి వసూలు చేయాలని ఆదేశించడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రాఫిక్ చలాన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణిపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో 2026 జనవరి 12న యూసుఫ్‌గూడ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎరైవ్ - ఎలైవ్ ప్రచార కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రోడ్డు భద్రతను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని సీఎం చెప్పారు. ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం, డ్రంకెన్ డ్రైవ్ చేసేవారిని నియంత్రించాలి. ఉల్లంఘనలపై చలాన్లు వేస్తున్నారు. మళ్లీ వాటిని కట్టడానికి ఆఫర్లు ఇస్తున్నారు. వారి బ్యాంక్ అకౌంట్లతో వాహనాలను అనుసంధానం చేయండి. చలాన్ పడిన వెంటనే వారి బ్యాంక్ ఖాతా నుంచి అటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యేలా బ్యాంకులతో సమన్వయం చేసుకునే ప్రణాళికలు చేయండి. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమవుతున్న తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేయాలి. ఇలాంటి వాటిని నివారించడానికి ప్రాథమిక విద్యలోనే పిల్లలకు అవగాహన కల్పించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ ఆదేశాల నేపథ్యంలో ఆయన ప్రతిపక్షంలో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో వాహన చలాన్లకు సంబంధించిన రాయితీ హామీని స్క్రీన్‌షాట్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.
ట్రాఫిక్ చలాన్ విధించిన క్షణాల్లోనే వాహన యజమాని ఖాతా నుంచి నేరుగా నగదు బదిలీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం రేవంత్ ఆదేశాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. ట్రాఫిక్ చలాన్లపై 50 శాతం రాయితీ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చలాన్లపై ఎలాంటి రాయితీ లేదని మాట మార్చడం సరికాదని దుయ్యబట్టారు. ట్రాఫిక్ చలాన్ల విషయంలో రేవంత్ యూటర్న్ తీసుకోవడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. రోడ్డు భద్రత ముఖ్యమే. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఇది ఎవరూ కాదనలేని విషయం. కానీ చలాన్ల కోసం వాహనదారుడి ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా నగదు బదిలీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలనడం అనాలోచిత చర్య. ఈ విధానం అమలు చేసే కంటే ముందు.. రోడ్లను అధ్వాన్నంగా మార్చిన మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ బ్యాంకు ఖాతాలను లింక్ చేయాలి. ఈ పరిణామాలను చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ జన్‌ధన్ ఖాతాలు ఓపెన్ చేసి ప్రజలకు డబ్బులను జమ చేస్తుంటే.. కాంంగ్రెస్ మాత్రం ప్రజల ఖాతాల నుంచి నగదును లూటీ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా ధైర్యం ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీల అమలు కోసం రాష్ట్ర ఖజానా నుంచి ఆటో డిడక్షన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఫీజు రియింబర్స్‌మెంట్, రైతు భరోసా, పెన్షన్‌దారులకు నేరుగా నగదు జమ అయ్యేలా చూడాలి. పెనాల్టీలు వసూలు చేయడంలో చూపించే వేగం.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ చూపించాలి అని బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇక ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం రెడ్డిపై కూడా తెలంగాణ ప్రజలు గుర్రుగా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. ట్రాఫిక్ రుసుములు తగ్గిస్తామన్న హామీ ఏమైంది అని ఆయనను ప్రజలను నిలదీస్తున్నారు.
చిన్న బండి నడుపుకుని బతుకుదామనుకున్న ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ చలాన్లు శాపంగా మిగిలిపోయాయి. ఇవన్నీ సమస్యల మీద మేం ఐదేండ్ల కాలంలో చాలా కార్యక్రమాలు చేసినం. ఆ వర్గాలన్నింటిని ఇవాళ కాంగ్రెస్‌కు అనుకూలంగా కదిలించడానికి మేం ప్రయత్నం చేస్తున్నాం. నేను అందరికీ కూడా చెప్పేది ఏందంటే ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు రద్దు కావాలి. భవిష్యత్‌లో ఈ ట్రాఫిక్ రుసుములు తగ్గించాలని మేం కాంగ్రెస్‌ను అడిగినం. వాళ్లు కూడా దానికి అంగీకరించారు. కాబట్టి ఇది అందరికీ మేలు చేసేటటువంటి నిర్ణయం. ప్రజలందరూ కూడా వీటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరతున్నాను అని 2023 ఎన్నికల సమయంలో కోదండరాం ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam