లోడ్ అవుతోంది...


ఓటమిని జీర్ణించుకోలేక పిచ్చి ప్రేలాపనలు
సామాన్య ప్రజలను బలి చేస్తామంటే ఊరుకోం
పంచాయతీ ఫలితాలే.. మున్సిపల్ ఎన్నికల్లోనూ
మాజీ మంత్రులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్
Ponguleti Srinivasa Reddy | త్రినేత్ర.న్యూస్ : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీపై పిచ్చి ప్రేలాపనలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. అగ్నిగుండం చేస్తే.. ప్రజలు మిమ్మల్నే అగ్నిగుండంలోకి నెట్టేస్తారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్తుపల్లి పర్యటనలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ ఉద్యమంలో అగ్గిపెట్టె పట్టుకుని యువతను రెచ్చగొట్టిన వారు చావలేదు కానీ.. అమాయకపు వేలాది పిల్లల్ని పొట్టనపెట్టుకున్నరు. మీ స్వార్థం కోసం ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మళ్లీ జిల్లాల పేరుమీద ఉద్యమాలు చేస్తాం.. అగ్నిగుండాలు చేస్తాం.. సామాన్య ప్రజలను బలి చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రజలు తెలివైన వారు.. అన్నీ గమనిస్తున్నారు. మీరు ప్రజల్ని రెచ్చగొట్టి అగ్నిగుండం తయారుచేసి చలి కాచుకుంటామంటే ప్రజలు మిమ్మల్నే అగ్నిగుండంలోకి నెట్టేస్తారు అని పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు.
శాస్త్రీయంగా లేని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల విభజనను తప్పకుండా సరిచేస్తాం. శాసనసభలో చర్చంచి, రిటైర్డ్ జడ్జీ ద్వారా కమీటి వేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటాం. కేబినెట్‌లో చర్చించి ప్రజలకు అనుకూలమైన విధంగా సరైన పునర్ వ్యవస్థీకరణ చేస్తాం అని ఆయన అన్నారు.
మొన్నటి పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూశాక బీఆర్ఎస్ నాయకులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఓటమిని జీర్ణించుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రోడ్డు మీద పిచ్చి కుక్క కరిస్తే ఎలా పిచ్చెక్కినట్లు వాగుతారో.. అదే పద్ధతిలో గత పదేళ్లు పాలించిన వారు బ్లఫ్ చేస్తున్నారు. 10 మంది సర్పంచులను గెలిపించుకుని, కార్యకర్తలందరినీ నిలబెట్టి మేమే గెలిచామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని పొంగులేటి ఎద్దేవా చేశారు.
గతంలో ఎన్నికల ఫలితాలను సెమీఫైనల్స్‌గా అభివర్ణించిన మాజీ మంత్రులపై పొంగులేటి నిప్పులు చెరిగారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 69 శాతం సీట్లు గెలిచి కాంగ్రెస్ తన జైత్రయాత్రను చాటిందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇది 80 శాతానికి మించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam