త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GP’s Income | గ్రామపంచాయతీల ఖాతాల్లోకే సొంత ఆదాయం!

GP's Income | గ్రామపంచాయతీల ఆర్థిక స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామపంచాయతీలు తమ సొంత వనరుల ద్వారా సమకూర్చుకునే ఆదాయం ఇకపై నేరుగా వాటి ఖాతాల్లోనే జమ కానుంది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్‌ (నాలుగో సవరణ) చట్టం–2026 అమలుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

P

Telangana | Published On Nov 6, 2026, 6.52 pm IST

GP’s Income | గ్రామపంచాయతీల ఖాతాల్లోకే సొంత ఆదాయం!
Advertisement
  • చట్ట సవరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
  • గ్రామాల అభివృద్ధి పనులకు నిధుల వినియోగంలో వేగం
  • పల్లెల ఆర్థిక స్వావలంబనకు కీలక ముందడుగ‌న్న మంత్రి సీతక్క

GP's Income | గ్రామపంచాయతీల ఆర్థిక స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామపంచాయతీలు తమ సొంత వనరుల ద్వారా సమకూర్చుకునే ఆదాయం ఇకపై నేరుగా వాటి ఖాతాల్లోనే జమ కానుంది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్‌ (నాలుగో సవరణ) చట్టం–2026 అమలుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌ 9 నుంచి ఈ చట్ట సవరణ అమల్లోకి వస్తుందని పేర్కొంటూ శుక్రవారం జీవో నంబర్‌ 43ను విడుదల చేసింది.

అభివృద్ధికి ఇక ఆటంకాలు ఉండవు

గతంలో గ్రామపంచాయతీలు తమ సొంత వనరుల ద్వారా సమకూర్చుకున్న ఆదాయం ట్రెజరీలో జమ కావడంతో నిధుల వినియోగంలో జాప్యం జరిగేది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రహదారులు తదితర అత్యవసర అవసరాల కోసం నిధులు అందుబాటులోకి రావడానికి ఎదురుచూడాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం చట్ట సవరణ చేపట్టింది. తాజా నిర్ణయంతో గ్రామపంచాయతీలు సమకూర్చుకునే సొంత ఆదాయం నేరుగా వాటి బ్యాంకు ఖాతాల్లోనే జమ కానుంది. దీంతో స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులను వేగంగా ఖర్చు చేసే వెసులుబాటు కలగనుంది. గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన మరింత వేగవంతం కానుంది.

పల్లెల ఆర్థిక స్వావలంబనకు బాటలు

మంత్రి సీతక్క చొరవతో గ్రామపంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించే దిశగా ప్రభుత్వం ఈ చట్ట సవరణ తీసుకొచ్చింది. తాజాగా అమలుకు ఉత్తర్వులు వెలువడటంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పల్లెల ఆర్థిక స్వావలంబనకు ఇది కీలక ముందడుగు అని పేర్కొన్నారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా స్థానిక సంస్థలే నిధుల వినియోగంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం కలగడంతో గ్రామీణాభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.

GO 43

Advertisement
Advertisement