త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fruit and vegetables | పండ్లు, కూరగాయ‌ల్లో అధిక పురుగుల మందులు.. తెలంగాణ‌నే టాప్‌

Fruit and vegetables | దేశంలోనే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిర్ణయించిన మోతాదు కంటే అధికంగా పురుగుమందుల (కీటకనాశినుల-Pesticide) అవశేషాలు ఉన్న పండ్లు, కూరగాయల నమూనాల (Fruit and vegetables) గుర్తింపులో తెలంగాణ (Telangana) రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.

D

Telangana | Published On Aug 14, 2026, 11.56 am IST

Fruit and vegetables | పండ్లు, కూరగాయ‌ల్లో అధిక పురుగుల మందులు.. తెలంగాణ‌నే టాప్‌
Advertisement

Fruit and vegetables | త్రినేత్ర‌.న్యూస్ : దేశంలోనే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిర్ణయించిన మోతాదు కంటే అధికంగా పురుగుమందుల (కీటకనాశినుల-Pesticide) అవశేషాలు ఉన్న పండ్లు, కూరగాయల నమూనాల (Fruit and vegetables) గుర్తింపులో తెలంగాణ (Telangana) రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఈ విష‌యాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ లోక్‌స‌భ‌కు వెల్లడించింది. 2023-26 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన నమూనాల వివరాలను స‌భ ముందు ఉంచింది. ఆ వివ‌రాల ప్ర‌కారం.. మొత్తం 70,652 పండ్లు, కూరగాయల నమూనాలను సేకరించగా అందులో 2,223 (3.1%) నమూనాల్లో పరిమితికి మించి అవశేషాలు బయటపడ్డాయి.

తెలంగాణ టాప్‌..

తెలంగాణ (Telangana) నుంచి 8,198 పండ్లు, కూర‌గాయ‌ల న‌మూనాల‌ను సేక‌రించిగా అందులో 486 (5.9 శాతం) నమూనాల్లో అనుమతించదగిన పరిమితిని మించి అవ‌శేషాలు ఉన్న‌ట్లు తేలింది. తెలంగాణ త‌ర్వాత క‌ర్ణాట‌క రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. అక్క‌డ 9,176 నమూనాల్లో 334 (3.6 శాతం) ఉన్న‌ట్లు గుర్తించారు. మహారాష్ట్రలో 5,295 నమూనాలకు 260 (4.9 శాతం), గుజరాత్‌లో 6,035 నమూనాలకు 170 (2.8 శాతం), హర్యాణాలో 2,371 నమూనాలకు 152 (6.4 శాతం), ఆంధ్రప్రదేశ్‌లో 2,104 నమూనాలకు 134 ( 6.4 శాతం) చొప్పున అధిక అవశేషాలు నమోదయ్యాయి.

నిర్ణీత పరిమితులను మించి కీటకనాశినుల నమూనాలను నివేదించిన ఇతర రాష్ట్రాల్లో రాజస్థాన్ (111), హిమాచల్ ప్రదేశ్ (92), కేరళ (82), తమిళనాడు (81), మధ్యప్రదేశ్ (66), ఉత్తర ప్రదేశ్ (64), జమ్ము క‌శ్మీర్ (58), పంజాబ్ (55), ఉత్తరాఖండ్ (50), ఢిల్లీ (19), పశ్చిమ బెంగాల్ (5), చండీగఢ్ (2), అస్సాం (1), అండమాన్ నికోబార్ దీవులు (1) ఉన్నాయి. అయితే, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో MRL (గరిష్ట అవశేష పరిమితి) కంటే ఎక్కువ నమూనాలు ఏవీ నమోదు కాలేదని ప్ర‌భుత్వ డేటా వెల్ల‌డించింది.

సేక‌ర‌ణ ఇలా..

రైతుల పొలాలు, రిటైల్ దుకాణాలు, హోల్‌సేల్ మార్కెట్లు, సహకార సంఘాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు (APMC), సేంద్రియ ఉత్పత్తుల విక్రయ కేంద్రాల నుంచి ఈ నమూనాలను సేకరించారు. వీటిని గుర్తించడానికి జీపీఎస్ (GPS) లొకేషన్లు, ట్రేసబిలిటీ విధానాన్ని ఉపయోగించారు. పంటలపై కీటకనాశినులను సురక్షితంగా, విచక్షణతో ఉపయోగించేలా రైతులను చైతన్యవంతం చేయడానికి.. సేకరించిన నివేదికలను సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల వ్యవసాయ శాఖలతో పంచుకుంటున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

రైతుల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు..

రైతులు పురుగుమందులను విచక్షణారహితంగా వినియోగించకుండా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాల‌ను నిర్వ‌హిస్తోంది. ప్రభుత్వం 48 కేంద్ర సమీకృత తెగుళ్ల నిర్వహణ కేంద్రాల ద్వారా రైతుల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు, విత్త‌న శుద్ధి ప్ర‌చారాలు, అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. 2021-22 నుంచి 25-26 మ‌ధ్య ప్ర‌భుత్వం 1,353 రైతు క్షేత్ర పాఠశాల కార్యక్రమాలను నిర్వ‌హించింది. ఈ కార్యక్రమాల ద్వారా మొత్తం 46,969 మంది రైతులకు ప్రత్యేక శిక్షణ అందించారు. రెండు రోజుల శిక్షణ కార్యక్రమాల ద్వారా 37,664 మంది, 2,384 సురక్షిత, సముచిత పురుగుమందుల వినియోగ అవగాహన కార్యక్రమాల ద్వారా 76,702 మంది రైతులు లబ్ధి పొందారు. అలాగే 2,548 విత్తన శుద్ధి కార్యక్రమాల ద్వారా 81,048 మందికి అవగాహన కల్పించారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాగు సాంకేతికత, పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునే విధానాలపై అవగాహన కల్పించడానికి ఈ క్షేత్ర పాఠశాలలు ఎంతగానో ఉపయోగపడతాయి.

2028-29 వరకు..

జాతీయ స్థాయిలో పురుగుమందుల అవశేషాల పర్యవేక్షణ ప్రాజెక్టు (MPRNL)ను 2028-29 వరకు కొనసాగించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆహార ఉత్పత్తులలో పురుగుమందుల పరిమాణాన్ని అంచనా వేయడానికి ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం 2005-06 లో ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లోని 40 భాగస్వామ్య ప్రయోగశాలల ద్వారా అమలువుతోంది. పురుగుమందుల అవశేషాలను పర్యవేక్షించడానికి, అలాగే మంచి వ్యవసాయ పద్ధతులు (GAP), సమగ్ర సస్యరక్షణ (IPM) విధానాలను అమలు చేయడానికి ఇప్పటికే 21 రాష్ట్రాలు రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేశాయి.

Also Read..

భారీగా ప‌డిపోయిన బంగారం ధ‌ర‌లు.. పెట్టుబ‌డిదారుల్లో యుద్ధం టెన్ష‌న్‌..

పురుషుల‌ను గౌర‌వించ‌డం మ‌న సంప్ర‌దాయం.. వారికి కేటాయించిన సీట్ల‌లో వారినే..

రేవంత్ రెడ్డి.. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు: హ‌రీశ్ రావు

Advertisement
Advertisement