త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు మాజీ ఎమ్మెల్సీ క‌విత బ‌హిరంగ క్ష‌మాప‌ణ

Kalvakuntla Kavitha | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ క‌విత బ‌హిరంగ క్ష‌మాప‌ణ చేశారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు న్యాయం చేయ‌లేక‌పోయినందుకు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెబుతున్న‌ట్లు క‌విత పేర్కొన్నారు.

S

Telangana | Published On Mar 29, 2026, 3.52 pm IST

Kalvakuntla Kavitha | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు మాజీ ఎమ్మెల్సీ క‌విత బ‌హిరంగ క్ష‌మాప‌ణ
Advertisement

ఆనాటి ప్ర‌భుత్వంలో నాకు పాపం ఉంది..
అందుకే క్ష‌మించాల‌ని కోరుతున్నాను..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేష‌న్ ఏర్పాటు చేయాలి..
ఏజెన్సీల‌కు కొమ్ము కాస్తూ 5 ల‌క్ష‌ల మందికి అన్యాయం..
రెండు రోజుల్లో స‌మ‌స్య ప‌రిష్కారం కావాలి..
మేధావుల మౌనం.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు శాపం..

Kalvakuntla Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ క‌విత బ‌హిరంగ క్ష‌మాప‌ణ చేశారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు న్యాయం చేయ‌లేక‌పోయినందుకు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెబుతున్న‌ట్లు క‌విత పేర్కొన్నారు. ఆనాటి ప్ర‌భుత్వ పాపంలో నాకు భాగం ఉంది.. నన్ను క్ష‌మించాల‌ని కోరుతున్నాన‌ని ఆమె తెలిపారు. హైద‌రాబాద్ ఇందిరా పార్కు వ‌ద్ద ఉన్న ధ‌ర్నా చౌక్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ధర్నాకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మ‌ద్ద‌తు ఇచ్చి ప్ర‌సంగించారు.

మన రాష్ట్రంలో 5 లక్షల మంది అన్నదమ్ములు, అక్కా చెల్లెలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నారు. మీరు చేస్తున్న ఈ ఉద్యమం మరొక తెలంగాణ ఉద్యమంలా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇక అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని అనుకున్నాం. కానీ విచిత్రంగా అప్పుడున్న పర్మినెంట్ ఉద్యోగులే కొన్ని డిపార్ట్‌మెంట్లలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అయ్యారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను చాలా వరకు గతంలో కంటిన్యూ చేశారు. కానీ తెలంగాణ వచ్చాక కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో జరిగిన వ్యవహారమే అందుకు ఉదాహరణ. విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో ఆర్టిజన్లను మార్చే ప్రయత్నం మేము చేశాం. కొన్ని చేయగలిగాం, మరికొన్ని మాత్రం ఏమీ మారలేదు. గత ప్రభుత్వంలో నేను కూడా భాగం. ఆనాటి పాపంలో నాకు భాగం ఉంది. అప్పుడు మీ జీవితాల్లో మార్పు తేలేనందుకు మీ చెల్లిగా మీ అందరినీ క్షమాపణ కోరుతున్నానని క‌విత పేర్కొన్నారు.

హైదరాబాద్ వీధుల్లో మార్చ్..

బీఆర్ఎస్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకోవటం లేదని కాంగ్రెస్‌ను గెలిపించారు. రేవంత్ రెడ్డి ఉద్యమంలో లేకపోయిన సరే కోదండంరాం, హరగోపాల్ చెప్పారని కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. మీరు ఏ పోరాటం చేసిన ముందుగా డిక్లేర్ చేసి పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ధర్నా చౌక్‌ను తీసేసి ప్రజాస్వామ్య హక్కు లేకుండా చేశారు. రేవంత్ రెడ్డి, కోదండరాం, హరగోపాల్ లాంటి వాళ్లు మాత్రం ధర్నా చౌక్ కొనసాగిస్తామని చెప్పారు. కానీ ధర్నా చౌక్ వద్ద ఎన్ని రోజులు ధర్నా చేసిన మీ చావు మీరు చావండన్నట్లుగా ఈ ప్రభుత్వ వైఖరి ఉంది. రెండేళ్లుగా మీరు చేస్తున్న పోరాటం చూస్తూనే ఉన్నాం. మిలియన్ మార్చ్ లాంటి పోరాటం ద్వారా మనం తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు మీ 5 లక్షల మంది హాఫ్ మిలియన్ ఉద్యోగులు హైదరాబాద్ వీధుల్లో మార్చ్ చేస్తే వెంటనే కార్పొరేషన్ వస్తుంది. సమస్యపై పోరాటం మాత్రమే కాదు.. పరిష్కారం దొరికే వరకు కొట్లాడటం తెలంగాణ బిడ్డల లక్షణం అని క‌విత స్ప‌ష్టం చేశారు.

రాజుల సొమ్ము రాళ్ల పాలు..

మీ పోరాటానికి జాగృతితో పాటు వేదిక మీద ఉన్న అందరూ మద్దతుగా ఉంటారు. అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా 9 వందల ఏజెన్సీలకు మాత్రమే లాభం అవుతోంది. ఏజెన్సీలకు జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించారు. కానీ ఆ ప్రయోజనాన్ని ఉద్యోగులకు రాకుండా చేస్తున్నారు. అంటే ఎంత నిర్లక్ష్యం? రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మీద ఒక్క రూపాయి భారం లేకుండా న్యాయం చేయవచ్చని మీరు చెబుతున్నారు. అయినా సరే ఏజెన్సీలకు కొమ్ము కాస్తు ఈ ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఆడబిడ్డల కష్టంగా మరీ దారుణంగా ఉంది. అన్ని ఎగ్జామ్స్ పెట్టి వాళ్లను తీసుకున్నప్పటికీ వారికి రావాల్సిన హక్కులను కల్పించటం లేదు. కనీసం మెటర్నటీ లీవులను కూడా వారికి అప్లయ్ చేయటం లేదని క‌విత తెలిపారు.

విశారదన్ నా కన్నా మొండి

మేము త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరించబోతున్నాం. అసలు ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల ఉండవద్దన్నదే మా విధానం. ప్రభుత్వం ఇచ్చే ఫలాలు ప్రజలకు చేరేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉండాలన్నదే మా పాలసీ. మేము రాజకీయ పార్టీగా అవతరించే లోపే మీ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నా. ఏ సమస్య పట్టుకున్నా సరే నేను మొండిగా పోరాటం చేస్తా. మొన్న ఖమ్మంలో వెలుగుమట్ల బాధితుల విషయంలో శాంపిల్ చూపించాం. విశారదన్ నేను అన్నం మెతుకు ముట్టకుండా బాధితులకు మేలు జరిగేలా చేశాం. నేనే మొండి దాన్ని అనుకుంటే విశారదన్ నా కన్నా మొండిగా ఉన్నారని క‌విత పేర్కొన్నారు.

రెండు రోజుల్లో స‌మ‌స్య ప‌రిష్క‌రించాలి..

ఈ ప్రభుత్వానికి మేము రెండు రోజులు సమయం ఇస్తున్నాం. ఈ లోపు ప్రతి డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి ఉద్యోగ భద్రతపై జీవోలు రావాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్‌ను కూడా వెంటనే ఏర్పాటు చేయాలి. మధ్యలో ఏజెన్సీలు ఉండకూడదు. మేము అధికారంలోకి వస్తే పర్మినెంట్‌గా కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తాం. తెలుగు దేశం ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంపై మనం అప్పట్లో జోకులు వేసుకున్నాం. కానీ ఇప్పటికీ కూడా అదే విధానం కొనసాగటం బాధాకరం. ఈ విషయంలో కోదండంరాం, హరగోపాల్ మాట్లాడాలి. మేధావుల మౌనం... అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శాపంగా మారింద‌ని క‌ల్వ‌కుంట్ల క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement