త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

భూముల రగడ బంతి మళ్లీ రేవంత్ కోర్టులో.. సీఎం ముందున్న ఐదు ప్రశ్నలు ఇవే !

అసెంబ్లీ వేదికగా మొదలైన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ రగడ, ఇప్పుడు పొలిటికల్ 'టెన్నిస్ మ్యాచ్'ను తలపిస్తోంది! KCR భూములపై రేవంత్ విసిరిన పంచ్‌కు, BRS అంతే స్పీడ్‌గా మైండ్ బ్లోయింగ్ 'రిటర్న్ షాట్' కొట్టింది! ఆరోపణల బంతి తిరిగి సీఎం కోర్టుకే చేరడంతో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు 5 నిప్పులాంటి ప్రశ్నలు నిలిచాయి!

S

Telangana | Published On Sep 17, 2026, 8.11 pm IST

భూముల రగడ బంతి మళ్లీ రేవంత్ కోర్టులో.. సీఎం ముందున్న ఐదు ప్రశ్నలు ఇవే !

సంక్షిప్త సారాంశం

388 ఎకరాల లెక్క సీఎం ముందే చెప్పేయడంతో, 30 రోజుల అధికారుల విచారణ ఎంత నిష్పక్షపాతంగా సాగుతుందనే సందేహాలు మొదలయ్యాయి. ఇరు కుటుంబాల ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు BRS సవాల్ విసరడంతో, బంతి మళ్లీ సీఎం కోర్టులోకి చేరింది. ఈ 30 రోజుల నివేదికను బహిర్గతం చేసి రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంటుందో లేదో చూడటమే ఇప్పుడు అసలు సస్పెన్స్!

Advertisement

       కేసీఆర్ భూములపై ఆరోపణలతో రేవంత్ సర్వీస్...  ...   ...  అదే బంతిని వేగంగా సీఎం కోర్టులోకి రిటర్న్ చేసిన BRS

 

ఎర్రవల్లి భూముల వివాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో టెన్నిస్ మ్యాచ్‌ను తలపిస్తోంది. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కుటుంబ భూములపై ఆరోపణలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి బంతిని ప్రత్యర్థి కోర్టులోకి కొట్టారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసర భూములను పరిశీలించి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అయితే రేవంత్ కొట్టిన అదే బంతిని BRS వేగంగా రిటర్న్ చేసి తిరిగి సీఎం కోర్టులోకే పంపింది.

మా ఆస్తులపై విచారణ చేయండి.. రేవంత్ కుటుంబ ఆస్తులనూ అదే విచారణ పరిధిలోకి తీసుకురండి.. సిట్టింగ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో తేల్చుకుందాం అంటూ హరీశ్‌రావు, కేటీఆర్ సవాల్ విసిరారు. దీంతో రాజకీయ ర్యాలీ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. కేసీఆర్ కుటుంబ భూములపై నిజానిజాలు విచారణలో తేలాల్సిందే. కానీ BRS కౌంటర్ తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి ముందు ఐదు సూటి ప్రశ్నలు వచ్చి నిలిచాయి. వాటికి సమాధానం చెప్పాల్సింది కూడా ప్రభుత్వమే.

1. విచారణలో తేలాల్సిన ‘388’.. సీఎం ముందే ఎలా తేల్చారు?

ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో దాదాపు 700 ఎకరాలను పరిశీలించాలని, అందులో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని సీఎం అసెంబ్లీలో ఆరోపించారు. అదే సమయంలో వాస్తవాలు తేల్చి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఇక్కడే సీఎంగా రేవంత్ ముందు మొదటి ప్రశ్న నిలుస్తోంది.

388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నది ఇప్పటికే నిర్ధారణ అయితే విచారణలో తేల్చాల్సింది ఏమిటి? ఇంకా విచారణలోనే నిర్ధారణ కావాల్సి ఉంటే.. 388 ఎకరాలన్న నిర్దిష్ట సంఖ్యను సీఎం ఏ ఆధారంతో ప్రకటించారు?
ఆ ఆధారం ఏమిటో ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే ఆరోపణ సాధారణ రాజకీయ వేదికపై రాలేదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి నుంచి వచ్చింది. సంఖ్య కూడా నిర్దిష్టంగా వచ్చింది. అందుకే ఇప్పుడు ఆ సంఖ్య వెనుక ఉన్న రికార్డులేంటన్నది కూడా ప్రజలకు తెలియాల్సిన అంశమే.

2. సీఎం ముందే తీర్పులాంటి మాట చెబితే.. అధికారి మరోలా రాయగలరా?

రెండో ప్రశ్న విచారణ విశ్వసనీయతకు సంబంధించినది.

ఆరోపణ చేసింది ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకుడు కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతిగా ఉన్న ముఖ్యమంత్రి. ఇప్పుడు అదే ఆరోపణపై నిజానిజాలు తేల్చాల్సింది ఆయన ప్రభుత్వంలోని అధికారులే. అందుకే విచారణ పూర్తికాకముందే సీఎం ఒక నిర్దిష్ట నిర్ధారణకు వచ్చినట్లుగా మాట్లాడితే.. దానికి భిన్నమైన విషయం తేలినప్పుడు అధికారులు అదే స్వేచ్ఛతో నివేదికలో రాయగలరా? అధికారులు ప్రభావితమయ్యారని చెప్పడం కాదు. కానీ అలాంటి ప్రశ్నే రాకుండా విచారణ జరగాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. 388 ఎకరాల ఆరోపణ నిజమని తేలినా చెప్పాలి. తప్పని తేలినా చెప్పాలి. సీఎం సభలో చెప్పిన మాటకు భిన్నమైన ఫలితం వచ్చినా దాన్ని యథాతథంగా నమోదు చేయగలిగినప్పుడే విచారణపై నమ్మకం నిలుస్తుంది.

3. ‘మా భూములూ చూడండి.. మీవీ చూద్దాం’—సవాల్‌కు సీఎం సమాధానమేంటి?

ఇక్కడే BRS రేవంత్ కొట్టిన బంతిని తిరిగి ఆయన కోర్టులోకి పంపింది.

హరీశ్‌రావు సీఎం ఆరోపణలను ఖండిస్తూ తమ ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లు, ఇతర రికార్డుల్లో ఉన్నాయని చెప్పారు. రేవంత్ కుటుంబ భూములపైనా ఆరోపణలు చేస్తూ న్యాయ విచారణకు డిమాండ్ చేశారు. కేటీఆర్ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. కేసీఆర్, రేవంత్ కుటుంబాల ఆస్తులన్నింటినీ సిట్టింగ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారిద్దామని సవాల్ చేశారు. దీంతో BRS వాదన సూటిగానే ఉంది ‘మాపై విచారణ వద్దు’ అనడం లేదు. ‘మాపై చేయండి.. మీపైనా అదే ప్రమాణంతో చేయండి’ అంటోంది. అందుకే ఇప్పుడు ప్రశ్న కూడా సూటిగానే ఉంది. ఇద్దరి కుటుంబాల ఆస్తులపై ఒకే రకమైన స్వతంత్ర విచారణకు ప్రభుత్వం సిద్ధమా? కాదా? ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కారణం చెప్పాల్సింది ప్రభుత్వమే.

4. ఆరోపణ సభలో చేశారు.. 30 రోజుల తర్వాత నివేదిక కూడా సభ ముందుకొస్తుందా?

సీఎం అధికారులకు 30 రోజుల గడువు పెట్టారు. నిర్ణీత సమయంలో వివరాలు ఇవ్వకపోతే చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. కానీ నివేదిక సిద్ధమైన తర్వాత దాని పరిస్థితి ఏమిటి? ఆరోపణను అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు పెట్టిన ప్రభుత్వం.. విచారణ నివేదికను కూడా అదే స్థాయిలో బహిర్గతం చేస్తుందా? 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తేలితే రికార్డులతో సహా వెల్లడిస్తారా? లేదని తేలితే ఆ విషయాన్నీ అదే స్పష్టతతో చెబుతారా? ఇక్కడే ప్రభుత్వ పారదర్శకతకు అసలు పరీక్ష ఎదురవుతుంది. ఆరోపణను ఎంత బలంగా ప్రజల ముందుంచారో.. దానిపై వచ్చిన ఫలితాన్నీ అంతే స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. నివేదిక ప్రభుత్వ వాదనకు అనుకూలంగా ఉన్నా, లేకపోయినా పూర్తి వివరాలు బయటకు వచ్చినప్పుడే ఈ వివాదంలో నిజానిజాలపై స్పష్టత వస్తుంది. ఆరోపణ మాత్రమే ప్రజల ముందుండి.. దానిపై తేలిన నిజం ఫైళ్లకే పరిమితమైతే వివాదం ముగియదు. అందుకే 30 రోజుల తర్వాత నివేదిక ఏమైందన్నది ఈ కథలో కీలకం.

5. అధికారులకు 30 రోజుల డెడ్‌లైన్.. సీఎం తీసుకునే తదుపరి చర్యలకు డెడ్‌లైన్ ఉందా ? లేదా ?

చివరి ప్రశ్న మరింత సూటిగా ప్రభుత్వ చర్యను తాకుతుంది.

విచారణ పూర్తి చేయడానికి అధికారులకు 30 రోజులు ఇచ్చారు. మరి నివేదిక వచ్చిన తర్వాత చర్యలకు ప్రభుత్వం తనకు తాను ఎంత గడువు పెట్టుకుంటుంది? ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగినట్లు తేలితే.. ఎప్పటిలోగా భూమిని స్వాధీనం చేసుకుంటారు? బాధ్యులపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారు? అదే ఆరోపణ నిర్ధారణ కాకపోతే.. ఆ విషయాన్ని ఎప్పటిలోగా ప్రజలకు చెబుతారు? అధికారులకు మాత్రమే టైమ్‌బౌండ్ పెట్టి ప్రభుత్వం తన చర్యలను రహస్యంగా ఉంచితే అసలు లక్ష్యం నెరవేరదు. 30 రోజుల్లో నిజం తేలాలంటే.. ఆ నిజంపై ప్రభుత్వం తీసుకునే చర్యకూ ఒక గడువు ఉండాలి కదా?

ఇప్పుడు రిటర్న్ సర్వీస్  సీఎం రేవంత్‌ రెడ్డిదే

ఎర్రవల్లి భూముల అంశాన్ని అసెంబ్లీ మధ్యలోకి తీసుకొచ్చింది సీఎం రేవంత్ రెడ్డే ఆరోపణ చేశారు. విచారణకు ఆదేశించారు. BRS ఇప్పుడు అదే అంశాన్ని ఇద్దరి కుటుంబాల ఆస్తులపై న్యాయ విచారణ సవాల్‌గా మార్చి తిరిగి సీఎం ముందుంచింది. ఇప్పుడు ఐదు  ప్రశ్నలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. 388 ఎకరాల లెక్కకు ఆధారమేంటి? సీఎం వ్యాఖ్యల తర్వాత విచారణ స్వతంత్రతకు భరోసా ఏంటి? ఇద్దరి కుటుంబాల ఆస్తులపై న్యాయ విచారణ సవాల్‌కు సమాధానమేంటి? 30 రోజుల నివేదికను బయటపెడతారా? నివేదిక తర్వాత చర్యలకు గడువు పెడతారా?

టెన్నిస్ భాషలో చెప్పాలంటే.. రేవంత్ బంతిని BRS కోర్టులోకి కొట్టారు. BRS అదే బంతిని వేగంగా రిటర్న్ చేసి తిరిగి సీఎం కోర్టులోకే పంపింది. ఇప్పుడు రిటర్న్ ఇవ్వాల్సింది రేవంత్. ఆ ఐదు ప్రశ్నలకు సీఎం ఎలాంటి సమాధానం ఇస్తారు? తిరిగి ఎలాంటి షాట్ కొడతారు? అన్నదానిపైనే ఇప్పుడు అందరి చూపూ ఉంది.

Advertisement
Advertisement