త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్‌.. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

Ponnam Prabhakar | జనగణన–2027 రెండో దశ ప్రశ్నావళిలో బీసీ, ఓబీసీల వివరాలను ప్రత్యేకంగా చేర్చాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. కచ్చితమైన బీసీ జనాభా గణాంకాలు లేకుండా సామాజిక న్యాయం, విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్లపై సమర్థవంతమైన విధానాలు రూపొందించడం సాధ్యం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

P

Telangana | Published On Sep 11, 2026, 6.23 pm IST

Ponnam Prabhakar | జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్‌.. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
Advertisement

Ponnam Prabhakar | జనగణన–2027 రెండో దశ ప్రశ్నావళిలో బీసీ, ఓబీసీల వివరాలను ప్రత్యేకంగా చేర్చాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. కచ్చితమైన బీసీ జనాభా గణాంకాలు లేకుండా సామాజిక న్యాయం, విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్లపై సమర్థవంతమైన విధానాలు రూపొందించడం సాధ్యం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. బీసీలకు సంబంధించిన ఈ అంశంపై సభలో ఏకగ్రీవ తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సభ్యులు కూడా దీనికి మద్దతు ఇవ్వాలని మంత్రి కోరారు. భారత జాతీయ కాంగ్రెస్‌ తరఫున ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని ప్రభుత్వపరంగా కూడా కేంద్రానికి పంపించి, తగిన చర్యలు తీసుకునేలా కోరాలని నిర్ణయించినట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా ఓబీసీల కచ్చితమైన జనాభా గణాంకాల కోసం జనగణనలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీ/ఓబీసీలకు ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక కాలమ్‌ ఏర్పాటు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక రికార్డుల్లోని కుల వివరాలను డిజిటల్‌ పోర్టల్‌లో నమోదు చేసి, శాస్త్రీయంగా, పారదర్శకంగా కుల గణన నిర్వహించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే ద్వారా రాష్ట్రంలోని బీసీల వాస్తవ పరిస్థితిని గుర్తించే ప్రయత్నం చేసిందని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ముందుగానే కులాల జాబితాలను రూపొందించి సర్వే చేయడంతో కచ్చితమైన గణాంకాలు సేకరించడం సాధ్యమైందన్నారు. ఆ వివరాల ఆధారంగా బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపట్టిందని చెప్పారు.

గతంలో నిర్వహించిన జనగణనలో ఓబీసీలకు స్పష్టమైన ప్రత్యేక గుర్తింపు లేకపోవడం, కుల వివరాల నమోదులో ఓపెన్‌ కాలమ్‌ విధానం ఉండటంతో కచ్చితమైన గణాంకాలు సేకరించడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని మంత్రి వివరించారు. కచ్చితమైన కుల గణాంకాల ఆధారంగానే ప్రతి వర్గానికి సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సంక్షేమ పథకాలు, విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయగలమని పేర్కొన్నారు. భవిష్యత్‌ తరాలకు సామాజిక న్యాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని పొన్నం ప్రభాకర్‌ కోరారు.

Advertisement
Advertisement