త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madras Regiment | ఆ క‌క్ష‌తోనే ఆర్మీ ఆయుధాలు దొంగిలింత‌

Madras Regiment | దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారంలోని మ‌ద్రాస్ రెజిమెంట‌ల్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసు వివ‌రాల‌ను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ మీడియాకు వెల్ల‌డించారు. ఈ చోరీ కేసులో ప్ర‌ధాన నిందితుడు ఈ ఏడాది జూన్‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన హ‌వ‌ల్దార్ ఉప్పుతోళ్ల మ‌ల్లేశ్ అని డీజీపీ తెలిపారు.

S

Telangana | Published On Sep 11, 2026, 6.04 pm IST

Madras Regiment | ఆ క‌క్ష‌తోనే ఆర్మీ ఆయుధాలు దొంగిలింత‌
Advertisement

నిందితుడు రిటైర్డ్ హ‌వ‌ల్దార్
పోలీసుల విచార‌ణ‌లో ఒప్పుకోలేదు
భార్య గ‌ట్టిగా నిల‌దీయ‌డంతో నేరాన్ని అంగీక‌రించాడు
దొంగిలించిన ఆయుధాల‌ను సొంతూర్లో పాతిపెట్టాడు
స్వాధీనం చేసుకున్న పోలీసులు
మీడియా స‌మావేశంలో డీజీసీ సీవీ ఆనంద్ వెల్ల‌డి

Madras Regiment | త్రినేత్ర‌.న్యూస్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారంలోని మ‌ద్రాస్ రెజిమెంట‌ల్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసు వివ‌రాల‌ను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ మీడియాకు వెల్ల‌డించారు. ఈ చోరీ కేసులో ప్ర‌ధాన నిందితుడు ఈ ఏడాది జూన్‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన హ‌వ‌ల్దార్ ఉప్పుతోళ్ల మ‌ల్లేశ్ అని డీజీపీ తెలిపారు. దొంగిలించిన ఆయుధాల‌ను త‌న సొంతూరులో గుంత తీసి పాతిపెట్టిన‌ట్లు వివ‌రించారు.

ఈ ఏడాది ఆగ‌స్టు 31న తెల్ల‌వారుజామున బొల్లారంలోని మ‌ద్రాస్ రెజిమెంట్‌లోని బెల్ ఆఫ్ ఆర్మ్స్‌లో, ఆమ్యునేష‌న్ కోర్టులో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి చోరీ జ‌రిగింది. పిస్ట‌ల్స్, మ్యాగ‌జైన్లు, బుల్లెట్స్, బైనాక్యుల‌ర్‌ చోరీకి గుర‌య్యాయి. ఉద‌యం విధుల్లోకి వ‌చ్చిన ఆర్మ్స్ కోర్టు ఇన్‌ఛార్జ్ వినోద్ కుమార్ తాళాలు ప‌గుల‌గొట్టి ఉండ‌డాన్ని గ‌మ‌నించారు. త‌క్ష‌ణ‌మే బొల్లారం పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకుని.. బెల్‌ ఆఫ్‌ ఆర్మ్స్‌లోకి ఎవరెవరికి అనుమతి ఉందని విచారించాం. ఆర్మ్స్‌ కోర్టు ఇన్‌ఛార్జ్‌ వినోద్‌కుమార్‌తో పాటు ఆమ్యునేషన్స్‌ కోర్టు (ఆయుధాగారం) ఇన్‌ఛార్జ్‌ బల్లి మధులను అనుమానితులుగా విచారించాం. ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అనంతరం హవల్దార్లుగా పనిచేసిన ప్రకాశం జిల్లాకు చెందిన టీపీఎస్‌ రావు, నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన ఉప్పుతోళ్ల మల్లేశ్‌ అలియాస్‌ రాజును విచారించామ‌ని డీజీపీ తెలిపారు.

త‌మ ద‌గ్గ‌ర ఉన్న ఆధారాల‌తో మ‌ల్లేశ్ క‌ద‌లిక‌ల గురించి ప్ర‌శ్నించిన‌ప్ప‌టికీ స‌మాధానం రాలేదు. వాస్త‌వాలు చెప్ప‌కుండా మొండిగా ప్ర‌వ‌ర్తించాడు. విచార‌ణ‌కు కూడా స‌హ‌క‌రించ‌లేదు. ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల‌ను డిలీట్ చేశాడు. చివ‌ర‌కు విచార‌ణ‌కు వ‌చ్చిన స‌మ‌యంలో మ‌ల్లేశ్ ముఖంలో చెమ‌ట‌లు ప‌ట్టాయి. భ‌యం క‌నిపించింది. ఆయ‌న భార్య‌కు కూడా కేసు తీవ్ర‌త‌ను వివ‌రించాం. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌ల్లేశ్‌ను భార్య గ‌ట్టిగా నిల‌దీయ‌డంతో చేసిన నేరాన్ని అంగీక‌రించాడు. చోరీ చేసిన ఆయుధాలను నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని స్వగ్రామం జంగంరెడ్డిప‌ల్లితో పాటు యాప్రాల్‌లోని కౌకూరులో గుంతతీసి పాతిపెట్టిన‌ట్లు తెలిపాడు. దీంతో పోలీసులు అక్క‌డికి వెళ్లి ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నార‌ని డీజీపీ పేర్కొన్నారు.

ఎవ‌రీ ఉప్పుతోళ్ల మ‌ల్లేశ్‌..?

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండ‌ల ప‌రిధిలోని జంగంరెడ్డిప‌ల్లికి చెందిన ఉప్పుతోళ్ల మ‌ల్లేశ్‌(37) రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. 2010లో ఇండియ‌న్ ఆర్మీలో చేరాడు. 16 ఏళ్ల పాటు ఆర్మీలో సేవ‌లందించాడు. అనారోగ్య స‌మ‌స్య‌లు, క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌ల వ‌ల్ల ఈ ఏడాది జూన్ 30న ప‌ద‌వీ విర‌మ‌ణ పొందాడు. అయితే ఇంకా స‌ర్వీస్ ఉన్న‌ప్ప‌టికీ.. ముందుగానే ప‌ద‌వీ విర‌మ‌ణ చేయించ‌డం ప‌ట్ల మ‌ల్లేశ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే ముంద‌స్తు ప‌థ‌కం ప్ర‌కారం ఆయుధాల‌ను చోరీ చేశాడు. త‌న ప‌థ‌కం ప్ర‌కారం ఆగ‌స్టు 31న అర్ధ‌రాత్రి మ‌ద్రాస్ రెజిమెంట్‌లోని కోట్ రూమ్, మ్యాగ‌జైన్ రూమ్ నుంచి ఆయుధాల‌తో పాటు మందు గుండు సామాగ్రిని చోరీ చేశాడు.

దొంగిలించ‌బ‌డ్డ ఆయుధాలు, మందు గుండు సామాగ్రి ఇదే

1. AK 203 తుపాకులు (7.62 x 39MM): 04 (5 మ్యాగజైన్‌లతో సహా)
2. 5.56 MM INSAS 1B1 తుపాకీ: 01 (3 మ్యాగజైన్‌లతో సహా)
3. 9MM ఆటో 1A పిస్టల్స్: 06 (12 మ్యాగజైన్‌లతో సహా)
4. సివిల్ 6.35 బోర్ పిస్టల్: 01 (మ్యాగజైన్‌తో సహా)
5. ప్యాసివ్ నైట్ విజన్ బైనాక్యులర్: 01
6. 9MM ఆటో పిస్టల్ బుల్లెట్లు: 1156 రౌండ్లు
7. AK-203 బుల్లెట్లు: 720 రౌండ్లు
8. 5.56mm INSAS బుల్లెట్లు: బాల్ (11), ట్రేసర్ (5), బ్లాంక్ రౌండ్లు (20)

Advertisement
Advertisement