సభలో కాంగ్రెస్ ఎత్తు.. బయట బీఆర్ఎస్ పైఎత్తు? ‘22ఏ’ చుట్టూ మారుతున్న పొలిటికల్ గేమ్!
శాసనసభలో ఎదురైన సస్పెన్షన్ వేటును అధిగమించేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు మారుస్తోంది. సెంటిమెంట్ రాజకీయాలకు చెక్ పెడుతూ, '22ఏ' నిషేధిత భూముల అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరును ఉద్ధృతం చేసింది.
సంక్షిప్త సారాంశం
తొలి రెండు రోజులు డిఫెన్స్‌లో పడ్డ గులాబీ దళం, '22ఏ' అస్త్రంతో దూకుడు పెంచి ప్రజా సమస్యలే అజెండాగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. ఈ తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త వేడిని పుట్టిస్తున్నాయి.
సభలో సస్పెన్షన్.. బయట '22ఏ' అస్త్రం: కాంగ్రెస్ వ్యూహానికి బీఆర్ఎస్ ప్రతివ్యూహం!
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో జరుగుతున్న పరిణామాలను కేవలం అధికార–ప్రతిపక్ష ఘర్షణగా చూస్తే అసలు రాజకీయ చిత్రం పూర్తిగా కనిపించదు. సభలో నినాదాలు, నిరసనలు, సస్పెన్షన్ల వెనుక కాంగ్రెస్–బీఆర్ఎస్ వ్యూహాలు కూడా అంతే ఆసక్తికరంగా సాగుతున్నాయి. తొలి రెండు రోజుల్లో రాజకీయ అజెండాను తనకు అనుకూలమైన అంశాలవైపు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ కొంతవరకు పైచేయి సాధించినట్లు కనిపిస్తే.. 22 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ తర్వాత అదే పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉంది.
సభలో పోరాటానికి బ్రేక్ పడటంతో ప్రజలతో నేరుగా ముడిపడిన సమస్యలను ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది గులాబీ పార్టీ. అందులో ప్రధానంగా కనిపిస్తున్న అస్త్రం ‘22ఏ’. నిజానికి ఇది కొత్త సమస్య కాదు. అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ దీనిపై కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పుడు సస్పెన్షన్ తర్వాత దానికే మరింత రాజకీయ పదును పెట్టే ప్రయత్నం కనిపిస్తోంది.
అజెండాను మార్చేసిన కాంగ్రెస్!
రాజకీయాల్లో ప్రత్యర్థి ఏం మాట్లాడుతున్నాడన్నదానికంటే.. ప్రజల్లో ఏ అంశంపై చర్చ జరిగేలా చేశామన్నది కొన్నిసార్లు కీలకం. అసెంబ్లీ తొలి రెండు రోజుల పరిణామాలను ఈ కోణంలో చూస్తే కాంగ్రెస్ వ్యూహం కొంతవరకు పనిచేసినట్లే కనిపిస్తుంది. ప్రభుత్వ హామీలు, రైతుల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, 22ఏ వంటి అంశాలతో అధికార పక్షాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ భావించింది. కానీ కేసీఆర్ సభకు రావాలన్న కాంగ్రెస్ సవాళ్లు, స్పీకర్‌పై చేసినట్లు ఆరోపణలు వచ్చిన వ్యాఖ్యలు, ఎర్రవల్లి వివాదం వరుసగా తెరపైకి రావడంతో రాజకీయ చర్చ మరోవైపు వెళ్లింది. ముఖ్యంగా ఎర్రవల్లి ఘటనను దళితుల ఆత్మగౌరవంతో ముడిపెట్టి కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది.
బీఆర్ఎస్ ఆ ఆరోపణలను ఖండించినప్పటికీ అప్పటికే చర్చ ప్రజా సమస్యల నుంచి రాజకీయ వివాదాలవైపు మళ్లింది. అధికార పక్షాన్ని ప్రశ్నించాలని వచ్చిన బీఆర్ఎస్.. కొన్ని సందర్భాల్లో తనపైనే వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. తొలి రెండు రోజుల్లో కాంగ్రెస్‌కు దక్కిన రాజకీయ అడ్వాంటేజ్ ఇదే.
సస్పెన్షన్‌తో మారిన సీన్
ఆ తర్వాత జరిగిన సస్పెన్షన్లే కథను మరో మలుపు తిప్పాయి. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ కేటీఆర్, హరీశ్‌రావు సహా 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మిగిలిన వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. అధికార పక్షం వాదనలో ఇది సభను సజావుగా నడిపించేందుకు తీసుకున్న చర్య. బీఆర్ఎస్ వాదనలో మాత్రం ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష గొంతును సభ నుంచి బయటకు పంపిన చర్య. రాజకీయంగా చూస్తే సస్పెన్షన్‌తో సభలో బీఆర్ఎస్ దూకుడుకు బ్రేక్ పడింది. అదే సమయంలో సభ బయట పోరాటాన్ని విస్తరించుకునే అవకాశం కూడా ఆ పార్టీకి దొరికింది. కేవలం “మా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు” అంటూ ప్రజల్లోకి వెళితే ఆ అంశానికి రాజకీయ జీవితకాలం ( POLITICAL LIFE) ఎక్కువ ఉండదు. అందుకే “ప్రజా సమస్యలను ప్రశ్నించినందుకే మమ్మల్ని సభ నుంచి బయటకు పంపారు” అనే వాదనకు ప్రజా సమస్యలను జోడించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోంది.
ఇప్పుడు ‘22ఏ’కే రాజకీయ పదును
ఇక్కడే 22ఏ కీలకంగా మారుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే హరీశ్‌రావు ఈ అంశాన్ని లేవనెత్తారు. బాధితులతో సమావేశాలు నిర్వహించారు. న్యాయ సహాయం అందించేందుకు ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు అనేక సమస్యల్లో అదొకటి. ఇప్పుడు కాంగ్రెస్‌పై ప్రధాన ప్రజా అస్త్రాల్లో ఒకటిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. దీనికి కారణం కూడా స్పష్టమే. స్పీకర్ వివాదం, ఎర్రవల్లి ఘటన, ఎమ్మెల్యేల సస్పెన్షన్ అనేవి కేవలం రాజకీయ అంశాలు మాత్రమే.
కానీ భూమి, ఇల్లు, ప్లాట్, రిజిస్ట్రేషన్ సమస్యలు నేరుగా కుటుంబాల ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయి. కొనుగోలు చేసిన ప్లాట్ రిజిస్ట్రేషన్ కాకపోయినా, రైతు తన భూమిని అమ్ముకోలేకపోయినా, తమ ఆస్తి నిషేధిత జాబితాలో కనిపించినా.. బాధితుడికి అది రాజకీయ వివాదం కాదు. తన ఆస్తి, తన డబ్బుకు సంబంధించిన సమస్య. అందుకే 22ఏను రెవెన్యూ శాఖకు సంబంధించిన సాంకేతిక అంశంగా కాకుండా ఆస్తి హక్కులతో ముడిపడిన ప్రజా సమస్యగా మార్చగలిగితే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చన్నది బీఆర్ఎస్ రాజకీయ లెక్కగా కనిపిస్తోంది.
‘22ఏ’ అస్త్రం.. రివర్స్ అయితే బీఆర్ఎస్‌కే ఇబ్బంది!
22ఏ అంశం బీఆర్ఎస్‌కు రాజకీయంగా బలమైన అస్త్రంగా కనిపిస్తోంది. భూములు, ప్లాట్లు, రిజిస్ట్రేషన్లతో ముడిపడిన సమస్య కావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. అయితే ఇక్కడే అసలు లెక్కల పేచీ మొదలవుతోంది. బీఆర్ఎస్ దాదాపు కోటి 16 లక్షల ఎకరాలు 22ఏ పరిధిలో ఉన్నాయని ఆరోపిస్తుంటే.. ప్రభుత్వం మాత్రం వివాదంలో ఉన్న ప్రైవేటు భూమి సుమారు మూడు లక్షల ఎకరాలేనని చెబుతోంది. . తమ ప్రభుత్వ హయాంలో కేవలం 16 లక్షల ఎకరాలు మాత్రమే 22 ఏ జాబితాలో ఉందని, కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అది కోటి 16 లక్షల ఎకరాలకు చేరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెండ్ కేటీఆర్ చెబుతున్నారు.
ఈ భారీ వ్యత్యాసమే బీఆర్ఎస్‌కు సవాలు. కోటి ఎకరాల ఆరోపణను ఆధారాలతో నిరూపించగలిగితే ప్రభుత్వానికి ఇబ్బందే. అదే ప్రభుత్వం పూర్తి లెక్కలు బయటపెట్టి ఆ వాదన తప్పని నిరూపిస్తే.. బీఆర్ఎస్ ప్రయోగిస్తున్న అస్త్రమే రివర్స్ కావచ్చు. పైగా 22ఏ సమస్య కాంగ్రెస్‌తోనే మొదలైంది కాదు. గత బీఆర్ఎస్ పాలనలోనూ ఈ జాబితా ఉంది. అయితే ఎవరి వాదన సత్యం అని తేలాలంటే ఈ లెక్కలన్నీ ప్రభుత్వమే అధికారికంగా బయట పెట్టాల్సి ఉంది. అయితే ఈ అస్త్రం తో బీఆర్ఎస్ దాడి ఎక్కువయితే దీంతో “మీ పదేళ్ల పాలనలో ఏం చేశారు?” అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి చేసే అవకాశమూ ఉంది. అందుకే 22ఏ బీఆర్ఎస్‌కు బలమైన అస్త్రమే.. కానీ దాని పదును చివరకు లెక్కలతో కూడిన వాస్తవిక ఆధారాలే నిర్ణయిస్తాయి.
ఇక కాంగ్రెస్‌కు అసలు పరీక్ష
ఇప్పటివరకు పోరు రాజకీయ వివాదాల చుట్టూ ఉన్నంతకాలం కాంగ్రెస్ కూడా రాజకీయంగానే ఎదురుదాడి చేయగలిగింది. కానీ చర్చ భూములు, రిజిస్ట్రేషన్లు, ఆస్తి హక్కులవైపు మళ్లితే పరిస్థితి మారుతుంది. 22ఏలో ఆస్తులు ఎందుకు చేరాయి? ఎప్పుడు చేరాయి ? బీఆర్ఎస్ హయాంలో 22 ఏ జాబితాలో ఉన్న భూములు ఎన్ని ? తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలను చేర్చారు ? తప్పుగా చేరినవి ఉంటే ఎలా తొలగిస్తారు? బాధితులకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది? ఈ తప్పుకు ఎవరు బాధ్యత వహిస్తారు ? అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. గణాంకాలతో సమాధానం చెప్పి, సమస్య ఉన్నచోట పరిష్కారం చూపగలిగితే బీఆర్ఎస్ అస్త్రానికి పదును తగ్గించవచ్చు. లేదంటే ప్రతిపక్షం ఇదే అంశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
సభలో కాంగ్రెస్.. బయట బీఆర్ఎస్!
మొత్తంగా తొలి రెండు రోజుల్లో రాజకీయ చర్చను తనకు అనుకూలమైన అంశాలవైపు మళ్లించి బీఆర్ఎస్‌ను డిఫెన్స్‌లోకి నెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. సస్పెన్షన్‌తో సభలో గులాబీ ఎమ్మెల్యేల దూకుడుకు బ్రేక్ పడింది. ఇప్పుడు అదే పరిణామాన్ని తనకు అనుకూలంగా తిప్పుకునేందుకు బీఆర్ఎస్ 22ఏ వంటి ప్రజా సమస్యలకు మరింత పదును పెడుతోంది. సభలో గొంతుకు బ్రేక్ పడితే.. ప్రజల సమస్యనే తన గొంతుగా మార్చుకోవాలన్నది గులాబీ పార్టీ ప్రతివ్యూహంగా కనిపిస్తోంది. అందులో 22ఏ ఇప్పుడు ఆ పార్టీకి కీలక అస్త్రం.
అయితే ఈ అస్త్రం ఎంతవరకు పనిచేస్తుందన్నది బీఆర్ఎస్ ఆరోపణల్లో ఉన్న వాస్తవాలు, వాటిపై ప్రభుత్వం ఇచ్చే సమాధానం, బాధితులకు చూపే పరిష్కారంపైనే ఆధారపడి ఉంటుంది. సభలో వ్యూహాలు పార్టీలకు పాయింట్లు తెచ్చిపెట్టవచ్చు. ప్రజల దగ్గర పాయింట్లు రావాలంటే మాత్రం.. చివరకు సమస్యకు పరిష్కారం చూపాల్సిందే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gongidi Sunitha | ఇళ్లల్లో అక్కాచెల్లెళ్లు, అమ్మల ముందు బనియన్లు వేసుకోరా?
- ●BRICS Summit | పుతిన్, జిన్‌పింగ్ కార్లు ఎందుకంత స్పెషల్..? అణుబాంబు దాడులను తట్టుకుంటాయా?
- ●Deepika Padukone | దీపికా పడుకోణ్‌తో సినిమా - నా కెరీర్లో చేసిన పెద్ద తప్పు - బాలీవుడ్ హీరో కామెంట్స్
- ●Mercury Transit in Virgo | కన్యారాశిలో బుధుడి సంచారం.. భద్ర రాజయోగంతో ఈ మూడు రాశుల వారికి అదృష్టం!
- ●IRCTC | ఒక్కరోజే 20 లక్షల టికెట్లు.. IRCTC చరిత్రలోనే రికార్డు బుకింగ్స్
- ●UPI Charges | మళ్లీ తెరపైకి యూపీఐ ఛార్జీలు..? బ్యాంకులకే భారీ వాటా..?

Gongidi Sunitha | ఇళ్లల్లో అక్కాచెల్లెళ్లు, అమ్మల ముందు బనియన్లు వేసుకోరా?

BRICS Summit | పుతిన్, జిన్‌పింగ్ కార్లు ఎందుకంత స్పెషల్..? అణుబాంబు దాడులను తట్టుకుంటాయా?

Deepika Padukone | దీపికా పడుకోణ్‌తో సినిమా - నా కెరీర్లో చేసిన పెద్ద తప్పు - బాలీవుడ్ హీరో కామెంట్స్

Mercury Transit in Virgo | కన్యారాశిలో బుధుడి సంచారం.. భద్ర రాజయోగంతో ఈ మూడు రాశుల వారికి అదృష్టం!





