త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanthreddy | అర్హుల‌కే ప‌థ‌కాలు అందాలి.. యూరియా యాప్‌లో మార్పులు అవ‌స‌రం

Revanthreddy | 99 రోజుల కార్య‌క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగమై రాష్ట్రాభివృద్ధికి పాటుప‌డాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanthreddy) అన్నారు. మంగ‌ళ‌వారం రాష్ట్ర స‌చివాల‌యంలో జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో క‌లెక్ట‌ర్ల‌ (Collectors) కు ఆయ‌న సూచ‌న‌లు చేశారు.

S

Telangana | Published On Mar 3, 2026, 7.54 pm IST

Revanthreddy | అర్హుల‌కే ప‌థ‌కాలు అందాలి.. యూరియా యాప్‌లో మార్పులు అవ‌స‌రం
Advertisement

- క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో సీఎం రేవంత్ రెడ్డి

త్రినేత్ర‌.న్యూస్‌: 99 రోజుల కార్య‌క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగమై రాష్ట్రాభివృద్ధికి పాటుప‌డాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanthreddy) అన్నారు. మంగ‌ళ‌వారం రాష్ట్ర స‌చివాల‌యంలో జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో క‌లెక్ట‌ర్ల‌ (Collectors) కు ఆయ‌న సూచ‌న‌లు చేశారు. వార్డు స‌భ్యులు, స‌ర్పంచులు, ఛైర్మ‌న్లు, కార్పొరేట‌ర్లు, మేయ‌ర్లంద‌రికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్ష‌ణ (Training) కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయాలని సూచించారు. విధులు, బాధ్య‌త‌లపై వారికి అవ‌గాహ‌న క‌ల్పించి రాత ప్ర‌తుల‌ను అందించాలని ఆదేశించారు.

సోలార్‌పై అవగాహ‌న..

సోలార్ విద్యుత్ (Solar power) వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు వ్య‌వ‌సాయ పంప్ సెట్లకు బదులు సోలార్ పంప్ సెట్ వినియోగంపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. సోలార్ మోటార్ల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాలను రైతుల‌కు వివ‌రించాలని పేర్కొన్నారు. ఇళ్ల‌పైన సోలార్ ప్లాంట్లు అమ‌ర్చుకోవ‌డం.. సోలార్ విద్యుత్ వాడుకోవటంతో పాటు గ్రిడ్ కు కనెక్ట్ చేయడం వ‌ల్ల వ‌చ్చే ఆదాయంపై గ్రామాల్లో విద్యుత్ శాఖ అవ‌గాహ‌న కల్పించాలని ఆదేశించారు.

గ్రామ, వార్డు స‌భ‌ల్లో నూత‌నంగా ఇచ్చిన రేష‌న్ కార్డులు (Ration cards), స‌న్న బియ్యం, ఇందిర‌మ్మ ఇళ్లు, 200 లోపు యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్‌ (Free power), రుణ‌మాఫీ, ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ (Gas cylinder) ల‌బ్ధిదారుల వివ‌రాలు తెలియ‌జేయాల‌న్నారు. వాటివ‌ల్ల క‌లిగే లాభాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 35 ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల సేవ‌లు ప్ర‌జ‌ల‌కు అందాల‌న్నారు. అనారోగ్య‌బారిన ప‌డితే పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఇత‌ర స్థానిక వైద్య సంస్థ‌లు ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌కే రిఫ‌ర్ చేయాలని తెలిపారు. మెడిక‌ల్ క‌ళాశాల‌ల్లో ప‌రిక‌రాలు, వైద్య విద్యార్థులు, వైద్యులు (Doctors), ప్రొఫెస‌ర్లు (Professors) ఉన్నారని.. వారి సేవ‌లను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

అర్హుల‌కే ప‌థ‌కాలు..

ప్ర‌తి ప్ర‌భుత్వ ప‌థ‌కం ల‌బ్ధిదారుల ముఖ గుర్తింపు (Facial Recognition) చేప‌ట్టాలన్నారు. అర్హుల‌కే ల‌బ్ధి చేకూరాల‌ని ఆకాంక్షించారు. ఎట్టిప‌రిస్థితుల్లో అన‌ర్హుల‌ను ప్రోత్స‌హించొద్ద‌ని ఆదేశించారు. ఆస‌రా పింఛ‌న్ల‌లో ముఖ గుర్తింపు చేప‌ట్ట‌డంతో 3 ల‌క్ష‌ల మంది అన‌ర్హుల పేర్లు తొల‌గించ‌గ‌లిగామ‌ని గుర్తుచేశారు. సాంకేతిక‌త‌ను సరైన విధంగా వినియోగించుకుంటే న‌ష్టాల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. ర‌వాణా శాఖ స‌మాచారాన్నిఆన్‌లైన్లో పూర్తి చేయాలని సూచించారు. పాఠ‌శాల‌ల‌ బ‌స్సులు, ఇత‌ర వాహ‌నాల‌కు ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రిగా ఉండేలా చూడాల‌న్నారు. ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ల‌తో పాటు లారీలు, ఇత‌ర స‌ర‌కు ర‌వాణా వాహ‌నాల డ్రైవ‌ర్ల‌కు కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే మేల‌న్నారు. డ్రైవ‌ర్లు క‌లుసుకునే చోట్ల‌నే శిబిరాలు ఏర్పాటు చేసి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు.

గుంత‌ల‌కు వాట్స‌ప్ నంబ‌ర్‌..

ర‌హ‌దారుల‌పై భారీ స్థాయిలో గుంత‌లు, ప్ర‌మాదం జ‌రిగే స్థ‌లాల వివ‌రాలు తెలుసుకునేందుకు వాట్సాప్ నెంబ‌ర్ (whatsapp) ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఆ నంబ‌ర్‌కు వ‌చ్చే స‌మాచారం ఆధారంగా మ‌ర‌మ్మ‌తులు చేపట్టి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని చెప్పారు. ఓఆర్ఆర్‌, ఓఆర్ఆర్ స‌ర్వీసు రోడ్ల వెంట చెత్త‌ను డంప్ చేసే వాహ‌నాల‌ను ప‌ట్టుకొని జ‌రిమానాలు విధించాలని ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే కేసులు పెట్టాలని, దానికి ఓఆర్ఆర్ ఏజెన్సీని బాధ్యులను చేయాలని పేర్కొన్నారు.

ప్ర‌తి నెలా బిల్లులు..

మ‌ధ్యాహ్న భోజ‌న ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులు చెల్లించాలని చెప్పారు. పిల్ల‌ల‌కు పోషకాహారం అందించేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించుకోవాలని స్ప‌ష్టం చేశారు. మూడు కార్పొరేష‌న్ల‌తో పాటు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోని వ‌ర్కింగ్ ఉమెన్స్ హాస్ట‌ళ్లు, బాయ్స్‌, గ‌ర్ల్స్‌ హాస్ట‌ళ్ల (Hostels) వివ‌రాలు న‌మోదు చేసుకోవాల‌ని పేర్కొన్నారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో గంజాయి, డ్ర‌గ్స్‌(Drugs) , ఈ-సిగ‌రెట్ల వినియోగం జ‌రిగితే ఆయా విద్యా సంస్థ‌ల యాజ‌మాన్యాలు బాధ్య‌త వ‌హించేలా చూడాల‌న్నారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో సైకాల‌జిస్ట్ ఉండేలా చూడాలని సూచించారు.

- వ్య‌వ‌సాయ శాఖ భూసార ప‌రీక్ష‌లు చేప‌ట్టి రైతుల‌కు స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చేలా చూడాల‌ని కోరారు. యూరియా యాప్‌(urea app) లో గంద‌ర‌గోళం లేకుండా మార్పులు చేయాలని ఆదేశించారు. నానో యూరియా ఉప‌యోగాలను క్షేత్ర‌స్థాయిలో వివ‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇందుకు వ్య‌వ‌సాయ శాఖ‌, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ ప‌ర‌స్ప‌రం స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌ని ఆదేశించారు. క‌లెక్ట‌ర్లు త‌మ త‌మ జిల్లాల్లో పంట‌ల వైవిధ్య‌త‌కు ఉన్న అవకాశాలపై నివేదికలు స‌మ‌ర్పించాలని సూచించారు.

Advertisement
Advertisement