త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | రాష్ట్రంలో నేటి నుంచి సర్.. జూలై 24 వ‌ర‌కు ఇంటింటి స‌ర్వే..

SIR | రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గురువారం నుంచి ప్రారంభం కానుంది. ప్ర‌క్రియ వ‌చ్చే నెల 24 వరకు కొనసాగనుంది. బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు (BLO) ఇంటింటి స‌ర్వే నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా ఓట‌ర్ల‌కు ఎన్యుమ‌రేష‌న్ ఫారాలు అందిస్తారు.

G

Telangana | Published On Jun 25, 2026, 9.04 am IST

SIR | రాష్ట్రంలో నేటి నుంచి సర్.. జూలై 24 వ‌ర‌కు ఇంటింటి స‌ర్వే..
Advertisement

SIR | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గురువారం నుంచి ప్రారంభం కానుంది. ప్ర‌క్రియ వ‌చ్చే నెల 24 వరకు కొనసాగనుంది. బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు (BLO) ఇంటింటి స‌ర్వే నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా ఓట‌ర్ల‌కు ఎన్యుమ‌రేష‌న్ ఫారాలు అందిస్తారు. ప్ర‌జ‌లు వాటిని నింపి ఇవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఇంగ్లిష్‌లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలను అందిస్తారు. ఈ ప‌త్రాల‌ను నింపితేనే ఓట‌రు జాబితాలో పేరుంటుంద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. వ‌చ్చే నెల 24న ఎన్యుమ‌రేష‌న్ ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత 31న డ్రాఫ్ట్ జాబితా ప్ర‌చురిస్తారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను ఆగస్టు 30 వరకు సమర్పించవచ్చు . ఎన్నికల కమిషన్ నోటీసు ఇస్తే 12 ఆధారాల్లో ఏదైనా ఒకటి సమర్పించాలి. అభ్యంతరాలపై విచారణ జరిపి ఆధారాలు పరిశీలించి అక్టోబర్‌ 1న తుది జాబితా ప్రకటిస్తారు.

37 వేల మంది బీఎల్‌ఓలు

ఒక్కో పోలింగ్‌ కేంద్రం పరిధిలో 350 మంది ఓటర్ల వివరాలను బీఎల్‌వోలు నమోదు చేయనున్నారు. ప్రతీ 10 మంది బీఎల్‌ఓలకు ఒక సూపర్‌వైజర్‌ ఉంటారు. రోజూ సేకరించిన సమాచారాన్ని ఓటర్లు ఎన్యూమరేషన్‌ ఫామ్‌లలో భర్తీ చేసిన తర్వాత ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ద్వారా డిజిటల్‌ రూపంలోకి అప్‌లోడ్‌ చేస్తారు. మండలస్థాయిలో తహసీల్దారు అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా, ఈఆర్వోగా రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఆర్డీవోలు ఉంటారు. జిల్లాస్థాయిలో ఎలక్షన్‌ ఆఫీసర్‌గా కలెక్టర్‌ వ్యవహరిస్తారు.

రాష్ట్రంలోని మొత్తం 37 వేల పోలింగ్‌ కేంద్రాల బీఎల్‌ఓలు, మరో 15 వేల మంది అసిస్టెంట్‌ బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు.. ఇలా దాదాపు 60 వేల మంది సిబ్బందిని స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో పాల్గొననున్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు సేకరించిన వివరాల తర్వాత ఓటర్ల పేర్లు గల్లంతైనా, నమోదు కాకపోయినా, పేర్లతో పాటు అడ్రస్‌ గల్లంతు అయిన వారి ఫిర్యాదులు, అభ్యంతరాలు, అభిప్రాయాలను తీసుకుని పరిష్కరించడానికి నెల రోజుల గడువులోగా పూర్తి చేస్తారని సమాచారం, వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని పరిష్కరించిన తరువాతనే తుది జాబితా సిద్ధం చేస్తారు.

అనుమానాస్ప‌దంగా 89 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల వివ‌రాలు..

రాష్ట్రంలో మొత్తం 3,38,29,018 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 69.92 శాతం అంటే 2,36,54,232 ఓటర్ల వివరాలు 2002లోని ఓటర్లు లేదా వారి కుటుంబ సభ్యులతో స‌రిపోలాయి. రాష్ట్రవ్యాప్తంగా 35.73శాతం కోటీ లక్ష 74వేల 786 మంది ఓటర్ల వివరాలు సరిపోలలేదు. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో 35.73 శాతం అంటే 89,44, 713 మంది పేర్లు, అడ్రస్, వయసు తదితర వివరాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. వీటిపై విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటారు.

Advertisement
Advertisement