త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srishailam Suicides | శ్రీశైలం స‌త్రంలో తీవ్ర విషాదం.. క‌బోర్డు, బాత్రూం డోర్ల‌కు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య

Srishailam Suicides | శ్రీ‌శైలం స‌త్రంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మ‌హ‌త్య తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఫ్యాన్‌, క‌బోర్డు, బాత్రూం డోర్ల‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

S

Telangana | Published On Aug 25, 2026, 4.15 pm IST

Srishailam Suicides | శ్రీశైలం స‌త్రంలో తీవ్ర విషాదం.. క‌బోర్డు, బాత్రూం డోర్ల‌కు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య
Advertisement
  • మృతులంతా ఒకే కుంటుంబం
  • ఆర్థిక ఇబ్బందుల‌తోనేన‌ని ప్రాథ‌మికంగా నిర్ధార‌ణ‌
  • ఏపీలోని శ్రీ‌స‌త్య‌సాయి జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు

Srishailam Suicides | త్రినేత్ర‌.న్యూస్‌: శ్రీ‌శైలం స‌త్రంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మ‌హ‌త్య తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఫ్యాన్‌, క‌బోర్డు, బాత్రూం డోర్ల‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మూడు రోజుల క్రితమే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. మృతుల‌ను ఏపీలోని శ్రీ‌స‌త్య‌సాయి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి డీఎస్పీ రామాంజ‌నేయులు ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర‌ప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పల్లపు సుధాకర్‌కు ఇంకా పెళ్లి కాలేదు. ఆయ‌న చెల్లెళ్లకు పెళ్లిల్లు అయినా భర్త‌ల‌ను వ‌దిలేసి పుట్టింట్లోనే ఉంటున్నారు. కాగా గత నెల 28న సుధాక‌ర్ త‌న‌ ముగ్గురు తోబుట్టువులు, మేన‌ల్లుడితో క‌లిసి గ‌త నెల 28న‌ శ్రీ‌శైలానికి వ‌చ్చారు. వడ్డెర సత్రంలోని రూమ్‌ నెం.11లో రోజుకు రూ.800 అద్దె చెల్లిస్తూ ఆ గదిలోనే ఉన్నారు. ఇన్ని రోజులు ఉండొద్ద‌ని ఆల‌య సిబ్బంది సూచించినా ఆరోగ్యం బాగాలేదంటూ అక్క‌డే ఉండిపోయారు.

కాగా ఉన్న‌ట్టుండి వీరిలో ఇద్దరు గదిలోని హాలులో ఫ్యాన్‌కు ఉరేసుకోగా, స్నానాల గదిలో ముగ్గురు మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సత్రంలోని గది నుంచి దుర్వాసన రావ‌డంతో నిర్వాహకులు వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి. వెంట‌నే వారు పోలీసులకు సమాచారం అందించగా ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుల‌ను సుధాకర్ (36), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), గోగుల ఆదిలక్ష్మి (50), మణికంఠ (15)గా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై బత్తలపల్లిలోని వారి బంధువులకు సమాచారం ఇచ్చామ‌న్నారు. ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు కారణమని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి కార‌ణాలు తెలుసుకునేందుకు కేసు న‌మోదు చేసి అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

స్పందించిన‌ ఆల‌య చైర్మ‌న్..

ఈ ఐదుగురి ఆత్మహత్య ఘటనపై ఆలయ ఛైర్మన్‌ రమేష్‌ నాయుడు, ఈవో శ్రీనివాసరావు స్పందించారు. ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు. వసతి గదుల్లో భక్తుల బసకు 48 గంటలే అనుమతి ఉందన్నారు. కానీ, సత్రం నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించి గదులు కేటాయించారన్నారు. ప్రైవేటు సత్రాలన్నీ నిబంధనల ప్రకారం గదులు కేటాయించాలని ఆదేశించారు. అయితే ఈ సత్రాన్ని గతంలో దేవస్థానం అధికారులు సీజ్‌ చేయగా.. హైకోర్టు ఉత్తర్వులతో యాజమాన్యం మళ్లీ నిర్వహణ చేపట్టింద‌న్నారు. సత్రం వివాదాలపై విచారణ చేస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement
Advertisement