త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fee Bakayi – BJP Ladayi | త‌క్ష‌ణం రూ.15వేల‌కోట్ల బ‌కాయిలు విడుద‌ల చేయాలి

Fee Bakayi – BJP Ladayi | తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు చేపట్టిన ‘ఫీజు బకాయి–బీజేపీ లడాయి’ నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజు కొన‌సాగింది. రూ.15వేల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.

P

Telangana | Published On Aug 25, 2026, 4.06 pm IST

Fee Bakayi – BJP Ladayi | త‌క్ష‌ణం రూ.15వేల‌కోట్ల బ‌కాయిలు విడుద‌ల చేయాలి
Advertisement
  • కాంగ్రెస్ స‌ర్కారును డిమాండ్ చేసిన బీజేపీ నేత‌లు
  • రామ‌చంద‌ర్‌రావు ఫీజు బ‌కాయి-బీజేపీ ల‌డాయి దీక్ష‌ రెండోరోజు 
  • మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన మాజీ గ‌వ‌ర్న‌ర్‌, ఎంపీలు

Fee Bakayi – BJP Ladayi | తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు చేపట్టిన ‘ఫీజు బకాయి–బీజేపీ లడాయి’ నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజు కొన‌సాగింది. రూ.15వేల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. దీక్షకు మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు మద్దతు ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమవడంతో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రామ‌చంద‌ర్‌రావు ఆరోపించారు. విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. ‘‘తెలంగాణ యువత చైతన్యవంతులయ్యారు. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని పేర్కొన్నారు.

పాత బకాయిలన్నీ విడుదల చేయాలి : ద‌త్తాత్రేయ‌

మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు వెళ్లడం సబబు కాదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోతే కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు, ఎన్‌ఓసీలు ఇవ్వకపోవడంతో వారి ఉన్నత విద్య భవిష్యత్తు దెబ్బతింటుందని అన్నారు. ‘‘వచ్చే ఏడాది నుంచి విద్యార్థుల ఖాతాల్లోనే డబ్బులు వేస్తామని చెప్పడం కాదు.. ముందు పెండింగ్‌లో ఉన్న పాత బకాయిలన్నీ తక్షణమే విడుదల చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు. రామచందర్‌రావు దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ ఫీజులు చెల్లించలేదన్న కారణంతో విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవడం దుర్మార్గమన్నారు. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నిరాహార దీక్ష చేపట్టిందన్నారు. ‘‘కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్లు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు, ఆయన భాష చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోంది’’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కరవయ్యాయని, ఉపాధ్యాయులు, తాగునీరు, బాలికలకు మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ బడుల పరిస్థితిని చక్కదిద్దకుండా ఆక్స్‌ఫర్డ్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అంటూ గొప్పలు చెప్పడం మానుకోవాలని సూచించారు.

విద్యార్థుల నిరసనలకు అనుమతి ఎందుకు ఇవ్వ‌రు..

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీలో విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని మాట్లాడే రాహుల్‌గాంధీ.. తెలంగాణలో విద్యార్థుల దీక్షలు, ధర్నాలకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఇప్పుడు ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదని విమర్శించారు. విద్యార్థులు, రైతుల హక్కుల సాధన కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ఫ్యూచర్‌ సిటీ, మూసీ ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విద్యార్థుల రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించడానికి మాత్రం డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. విద్యకు తక్కువ బడ్జెట్‌ కేటాయించడం వల్లే విద్యారంగం సంక్షోభంలోకి వెళ్లిందని ఆరోపించారు. ఎలాంటి షరతులు లేకుండా వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే రెండు లక్షల మందితో కలిసి ఈ ప్రభుత్వంపై దండెత్తడానికి సిద్ధం’’ అని అంజిరెడ్డి హెచ్చరించారు. భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే విద్య, వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

Advertisement
Advertisement