త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NSG | ఉగ్ర‌వాదంపై సమరానికి మహిళా కమాండోలు..!

NSG | ఉగ్ర‌వాదంపై పోరులో మహిళా శక్తిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) కీలక అడుగు వేసింది. అత్యంత క్లిష్టమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలోనూ దీటుగా పనిచేసేలా మహిళా సిబ్బందిని తీర్చిదిద్దేందుకు తొలిసారిగా ప్ర‌త్యేక‌ కమాండో శిక్షణకు శ్రీకారం చుట్టింది.

P

National | Published On Aug 25, 2026, 3.39 pm IST

NSG | ఉగ్ర‌వాదంపై సమరానికి మహిళా కమాండోలు..!
Advertisement
  • కీల‌క ముంద‌డుగు వేసిన జాతీయ భ‌ద్ర‌తా ద‌ళం
  • తొలిసారిగా మ‌హిళా సిబ్బందికి క‌మాండో శిక్ష‌ణ‌
  • సాంకేతిక, ఆపరేషనల్‌ నైపుణ్యాలపై 12వారాలు శిక్ష‌ణ‌
  • మ‌హిళా సాధికార‌త‌లో మ‌రో అడుగ‌న్న ఎన్ఎస్‌జీ

NSG | ఉగ్ర‌వాదంపై పోరులో మహిళా శక్తిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) కీలక అడుగు వేసింది. అత్యంత క్లిష్టమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలోనూ దీటుగా పనిచేసేలా మహిళా సిబ్బందిని తీర్చిదిద్దేందుకు తొలిసారిగా ప్ర‌త్యేక‌ కమాండో శిక్షణకు శ్రీకారం చుట్టింది. హరియాణాలోని మానేసర్‌ ఎన్‌ఎస్‌జీ శిక్షణ అకాడమీలో ప్రారంభమైన ఈ 12 వారాల పాటు రాష్ట్ర పోలీసు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన మహిళలకు అత్యాధునిక శిక్షణ ఇచ్చి.. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను సమర్థంగా ఎదుర్కొనేలా మహిళా సిబ్బందిని తీర్చిదిద్దనున్నారు.

ఆయుధాలు.. వ్యూహాత్మక చర్యల్లో శిక్షణ

శిక్షణలో భాగంగా మహిళా సిబ్బందికి ఆయుధాల వినియోగం, షూటింగ్‌, మార్క్స్‌మన్‌షిప్‌, వ్యూహాత్మక చర్యలు వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో కీలకమైన బందీలను రక్షించడం (హోస్టేజ్‌ రెస్క్యూ) సహా ఇతర ప్రత్యేక బాధ్యతలను నిర్వహించేలా వారిని సిద్ధం చేయనున్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో విధులు నిర్వర్తించే సామర్థ్యాన్ని పెంచేందుకు శారీరక దృఢత్వంతోపాటు అవసరమైన సాంకేతిక, ఆపరేషనల్‌ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు.

భద్రతా బలగాల మధ్య సమన్వయం

ఈ కార్యక్రమం ద్వారా మహిళా సిబ్బంది వ్యక్తిగత సామర్థ్యాలను పెంచడంతోపాటు.. ఎన్‌ఎస్‌జీకి ఉన్న ప్రత్యేక ఉగ్రవాద వ్యతిరేక నైపుణ్యాలను దేశంలోని ఇతర భద్రతా బలగాలకు విస్తరించాలన్నది లక్ష్యమని ఎన్‌ఎస్‌జీ తెలిపింది. వివిధ బలగాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి సమగ్ర శిక్షణ అందించడం ద్వారా వృత్తిపరమైన ప్రమాణాల్లో ఏకరూపత, భద్రతా సంస్థల మధ్య సమన్వయం మరింత మెరుగుపడుతుందని పేర్కొంది. శిక్షణ పూర్తయిన తర్వాత మహిళా సిబ్బంది తిరిగి తమ తమ బలగాల్లో విధుల్లో చేరనున్నారు. ఎన్‌ఎస్‌జీ వద్ద నేర్చుకున్న ఆపరేషనల్‌ నైపుణ్యాలను అక్కడ వినియోగించనున్నారు. దీంతో ఆయా బలగాల సన్నద్ధత మరింత పెరగడంతోపాటు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సామర్థ్యం విస్తృతమవుతుందని ఎన్‌ఎస్‌జీ భావిస్తోంది.

మహిళా సాధికారత దిశ‌లో మరో అడుగు

భద్రతా బాధ్యతల్లో మహిళల సంఖ్యను పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశం కాదని ఎన్‌ఎస్‌జీ స్పష్టం చేసింది. ప్రత్యేక ఆపరేషన్లను సమర్థంగా నిర్వహించేలా మహిళలను శిక్షణతో సాధికారత కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపింది. మారుతున్న అంతర్గత భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు క్లిష్టమైన బాధ్యతలను చేపట్టేలా మహిళా సిబ్బందిని సిద్ధం చేయడం ద్వారా భద్రతా వ్యవస్థలో వారి పాత్ర మరింత బలోపేతం కానుంది. మహిళా సాధికారత దిశగా ఇది కీలక అడుగని ఎన్‌ఎస్‌జీ ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొంది.

Advertisement
Advertisement