త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanathnagar ESI Hospital | ఎల్లుండి నుంచి సనత్‌నగర్ ఈఎస్ఐసీ హాస్పిట‌ల్ కొత్త ఓపీడీ విభాగం ప్రారంభం

Sanathnagar ESI Hospital | తెలంగాణలోని సనత్‌నగర్ ఈఎస్ఐసీ ఆసుపత్రిలోని కొత్త ఓపీడీ విభాగం ఈనెల 14న ప్రారంభం కానుంది. ఇక్క‌డి నుంచే దేశవ్యాప్తంగా 7 ఈఎస్ఐసీ ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర కార్మిక-ఉపాధి, యువజన వ్యవహారాలు-క్రీడా శాఖల మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ అట్ట‌హాసంగా ప్రారంభిస్తారు.

S

Telangana | Published On Jul 12, 2026, 3.39 pm IST

Sanathnagar ESI Hospital | ఎల్లుండి నుంచి సనత్‌నగర్ ఈఎస్ఐసీ హాస్పిట‌ల్ కొత్త ఓపీడీ విభాగం ప్రారంభం
Advertisement
  • ఇక్క‌డి నుంచే దేశవ్యాప్తంగా 7 ఈఎస్ఐసీ ఆరోగ్య ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రారంభోత్సవం
  • ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.668 కోట్లు
  • దేశవ్యాప్తంగా 53 లక్షల మంది ఈఎస్ఐ లబ్ధిదారులకు ప్రయోజనం

Sanathnagar ESI Hospital | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణలోని సనత్‌నగర్ ఈఎస్ఐసీ ఆసుపత్రిలోని కొత్త ఓపీడీ విభాగం ఈనెల 14న ప్రారంభం కానుంది. ఇక్క‌డి నుంచే దేశవ్యాప్తంగా 7 ఈఎస్ఐసీ ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర కార్మిక-ఉపాధి, యువజన వ్యవహారాలు-క్రీడా శాఖల మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ అట్ట‌హాసంగా ప్రారంభిస్తారు. అస్సాంలోని బెల్తోలా 200 పడకల ఆసుపత్రిని, తమిళనాడు శ్రీపెరంబుదూర్‌లో 100 పడకల ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో ఉన్న‌ ఆసుపత్రి, గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీ శాఖ, రాజస్థాన్‌లోని కోట ఉద్యోగ్ నగర్‌లోని ఈఎస్ఐ డిస్పెన్సరీ శాఖ, అదే రాష్ట్రంలోని భవానీ మండి ఈఎస్ఐ డిస్పెన్సరీని ఆయ‌న ప్రారంభించారు. వీటన్నిటినీ రూ.668 కోట్ల వ్యయంతో నిర్మించి అందుబాటులోకి తేబోతున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారులకు వైద్య సేవలు అందుతాయి.

రూ.211.13 కోట్ల‌తో స‌న‌త్‌న‌గ‌ర్‌ ఈఎస్ఐసీ ఆసుపత్రి..

సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని కొత్త ఓపీడీ విభాగం- తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 12,30,183 మంది బీమా చందాదారులు, వారి కుటుంబ సభ్యులకు ఆధునిక, సమగ్ర సేవలు అందిస్తుంది. మొత్తం 43,611.04 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.211.13 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విభాగంలో జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, డెంటల్, గైనకాలజీ, కంటి చికిత్స, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆయుష్ ఓపీడీ ఉన్నాయి. వీటితో పాటు ఫిజియోథెరపీ, రేడియాలజీ, యోగా, 180 సాధారణ పడకలు (మొత్తం మూడు 60 పడకల వార్డులు), 25 ఐసీయూ, 20 ఎన్ఐసీయూ పడకలు, మందుల దుకాణం, క్లినికల్ లెక్చర్ థియేటర్ ఉన్నాయి.

33 జిల్లాల‌కు సేవ‌లు...

ఈ ఈఎస్ఐ ఆస్పత్రి 1975, మార్చి 30న ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నపుడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు సేవలు అందాయి. కాల క్రమంలో ఇతర ప్రాంతాలకు కూడా సేవల్ని విస్తరించారు. ప్రస్తుతం ఈఎస్ఐసీ 2.0 సంస్కరణల కింద తెలంగాణలోని 33 జిల్లాలకూ ఈఎస్ఐ పథకం కింద సేవల్ని అందిస్తున్నారు. దీంతో తెలంగాణంలో 33 జిల్లాలకు సేవల్ని అందిస్తున్నారు. సామాజిక భద్రత కింద మొత్తం 19,15,700 మంది బీమా చందాదారులు, 74,32,916 మంది లబ్ధిదారులకు సేవలు అందిస్తున్నారు.

ఈఎస్ఐసీ ఆసుపత్రి, బెల్తోలా, అస్సాం

అస్సాంలోని బెల్ తోలలో ఈఎస్ఐ ఆసుపత్రి ద్వారా మేఘాలయలోని 47 జిల్లాలతో పాటు త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని 41 జిల్లాలకు సేవలందుతాయి. తద్వారా 3.42 లక్షల మంది బీమా చందాదారులు సహా మొత్తం 13.27 లక్షల మంది లబ్ధిదారులకు ఆరోగ్య సేవలు లభిస్తాయి.

శ్రీపెరంబుదూర్‌లో 5.5 ల‌క్ష‌ల మందికి..

తమిళనాడులో ప్రముఖ తయారీ, ఎలక్ట్రానిక్స్ కూడలిగా ఎదిగిన శ్రీపెరంబుదూర్‌లో 100 పడకల ఈఎస్ఐసీ ఆసుపత్రి ఉంది. ఇక్కడ ఓపీడీ, అత్యవసర సేవలు, లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఐపీడీ, ఎక్స్-రే, ల్యాబ్, ఫార్మసీ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. దీని ద్వారా కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని 5.5 లక్షల మందికి పైగా బీమా చందాదారులకు సేవలు లభిస్తాయి.

ఈఎస్ఐఎస్ ఆసుపత్రి, రాజమహేంద్రవరం (ఆంధ్రప్రదేశ్)

రాజమహేంద్రవరం ఈఎస్ఐఎస్ ఆసుపత్రిలో 1,31,190 మంది బీమా చందాదారులు సహా మొత్తం 2,52,717 మంది లబ్ధిదారులకు సేవలు లభిస్తాయి. ఇక్కడ రోగుల కోసం 26 ఓపీడీ గదులు, 3 ఆధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ఇతర కీలక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి.

ఈఎస్ఐ డిస్పెన్సరీ , సురేంద్రనగర్ శాఖ (గుజరాత్)

సురేంద్రనగర్ జిల్లాలో సుమారు 9,192 మంది బీమా చందాదారులు ఉన్నారు. ఈ శాఖ ద్వారా సుమారు 35,000 మంది లబ్ధిదారులకు వైద్య సేవలు, సామాజిక భద్రతా ప్రయోజనాలు లభిస్తాయి. ప్రాథమిక ఆరోగ్య సేవలు, వైద్య సంప్రదింపులు, అవసరమైన మందులు సహా అన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయి.

ఈఎస్ఐ డిస్పెన్సరీ, కోటా ఉద్యోగ నగర్ శాఖ, రాజస్థాన్

రాజస్థాన్‌లోని కోట పారిశ్రామిక ప్రాంతంలోని బీమా కార్మికులు, వారి కుటుంబాలకు ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. ఇక్కడ 1,500 మందికి పైగా యజమానులు, సుమారు 75,000 మంది బీమా చందాదారులు సహా మొత్తం 2,91,000 మందికి ఇక్కడ సేవలు లభిస్తాయి.

రాజస్థాన్‌లోని ప్రధాన వస్త్ర కేంద్రమైన భవానీ మండి పారిశ్రామిక ప్రాంత కార్మికుల కోసం ఈ డిస్పెన్సరీ ఏర్పాటైంది. ఇక్కడ సుమారు 800 మంది యజమానులు, 27,715 మంది బీమా చందాదారులు సహా మొత్తం 1,07,535 మందికి ఆరోగ్య సేవలు లభిస్తాయి.

ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక-ఉపాధి, సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే కూడా పాల్గొంటారు. ఈ సంద‌ర్భంగా సనత్‌నగర్ ఈఎస్ఐసీ ఆసుపత్రి ఓపీడీ విభాగం నిర్మాణ కార్మికులను డాక్టర్ మాండవీయ సత్కరిస్తారు. అనంత‌రం ఈఎస్ఐ లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలను అందజేస్తారు.

Advertisement
Advertisement