త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple iPhone Duo | రూ.2.99 లక్షల నుంచి ఐఫోన్ డ్యుయో.. యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే..

Apple iPhone Duo | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టింది. కంపెనీ ఐఫోన్ డ్యుయోను ప్రకటించింది. రెండు స్క్రీన్లతో రూపొందించిన ఈ ఫోన్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఎ20 ప్రొ చిప్‌ను ఉపయోగించారు. పూర్తిగా తెరిచినప్పుడు యాపిల్ ఇప్పటివరకు రూపొందించిన అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ డ్యుయో నిలుస్తుందని కంపెనీ తెలిపింది.

S

Technology | Published On Sep 10, 2026, 10.58 am IST

Apple iPhone Duo | రూ.2.99 లక్షల నుంచి ఐఫోన్ డ్యుయో.. యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే..
Advertisement

Apple iPhone Duo | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టింది. కంపెనీ ఐఫోన్ డ్యుయోను ప్రకటించింది. రెండు స్క్రీన్లతో రూపొందించిన ఈ ఫోన్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఎ20 ప్రొ చిప్‌ను ఉపయోగించారు. పూర్తిగా తెరిచినప్పుడు యాపిల్ ఇప్పటివరకు రూపొందించిన అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ డ్యుయో నిలుస్తుందని కంపెనీ తెలిపింది. ఫోల్డబుల్ డిస్‌ప్లేకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన ఆపరేటింగ్ సిస్టమ్‌తోపాటు కొత్త ఎన్‌క్లోజర్ డిజైన్‌ను ఇందులో అందించారు. ఐఫోన్ డ్యుయోను పూర్తిగా తెరిచినప్పుడు 7.6 ఇంచుల ఇన్నర్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే కనిపిస్తుంది. ఫోన్‌ను మూసేసినప్పుడు 5.4 ఇంచుల ఔటర్ డిస్‌ప్లే ద్వారా ఉపయోగించుకోవచ్చు. స్టాండర్డ్ ప్రొ-టైర్ ఐఫోన్‌లో లభించే యాక్టివ్ స్క్రీన్ ఏరియాలో దాదాపు 90 శాతం స్థాయిలో ఔటర్ డిస్‌ప్లే ఉంటుందని యాపిల్ తెలిపింది.

ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లేలు..

రెండు డిస్‌ప్లేలకు ఒకే విధమైన యాస్పెక్ట్ రేషియోను అందించారు. దీంతో ఫోన్‌ను తెరిచేటప్పుడు లేదా మూసిన‌ప్పుడు కంటెంట్ ప్రదర్శనలో నిరంతర అనుభూతి లభిస్తుంది. రెండు స్క్రీన్లలోనూ ప్రొ-మోషన్, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే, గరిష్ఠంగా 3000 నిట్స్ అవుట్‌డోర్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఇన్నర్ డిస్‌ప్లేకు మ్యాట్ నానో-టెక్స్చర్ ఫినిష్ ఇవ్వడం ద్వారా పరిసరాల నుంచి వచ్చే కాంతి ప్రతిబింబాలను తగ్గించడంతోపాటు ఫోల్డింగ్ క్రీజ్ కనిపించడాన్ని తగ్గించేలా రూపొందించారు. ఫోల్డింగ్ స్క్రీన్ కింద అండర్-డిస్‌ప్లే ఫేస్‌టైమ్ కెమెరాను అమర్చారు. దీంతో స్క్రీన్‌పై ప్రత్యేక కటౌట్ అవసరం లేకుండా చేశారు. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం సైడ్ బటన్‌లో టచ్ ఐడీని ఇంటిగ్రేట్ చేశారు. భవిష్యత్తులో యూఎస్‌బీ టైప్ సి తో కూడిన యాపిల్ పెన్సిల్‌కు రెండు డిస్‌ప్లేలపైనా సపోర్ట్ అందించనున్నట్లు యాపిల్ తెలిపింది.

దృఢ‌మైన బాడీ, స‌రికొత్త ఎ20 ప్రొ చిప్‌..

ఐఫోన్ డ్యుయో చాసిస్‌ను గ్రేడ్-5 టైటానియంతో రూపొందించారు. ఇందులో త్రీడీ ప్రింటెడ్ హింజ్ కవర్‌తోపాటు అంతర్గత స్ట్రక్చరల్ రిబ్బింగ్‌ను ఉపయోగించారు. హింజ్‌లో 100కు పైగా భాగాలు ఉండి, ఫోన్‌ను మడిచిన‌ప్పుడు అవసరమైన రెసిస్టెన్స్, డిస్‌ప్లే సపోర్ట్‌ను నిర్వహించేలా రూపొందించారు. డిస్‌ప్లేలోని అంతర్గత పొరలు మడిచే సమయంలో కదిలేందుకు వీలుగా ప్రత్యేక అతుక్కునే పదార్థాలను ఉపయోగించారు. దీంతో బెండ్ స్ట్రెస్‌ను తగ్గించవచ్చని యాపిల్ తెలిపింది. వెనుక భాగంలో సిరామిక్ షీల్డ్, బయట కవర్ గ్లాస్‌పై సిరామిక్ షీల్డ్ 2 రక్షణను అందించారు. ఫోన్‌కు ఐపీ68 స్థాయి డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఐఫోన్ డ్యుయోలో యాపిల్ కొత్త 2 నానోమీటర్ ఎ20 ప్రొ సిస్టమ్-ఆన్-చిప్‌ను ఉపయోగించింది. ఇందులో రెండు పెర్ఫార్మెన్స్, నాలుగు ఎఫిషియెన్సీ కోర్లతో కూడిన సిక్స్‌-కోర్ సీపీయూ ఉంది. ఇది ఎ19 ప్రొ తో పోలిస్తే 20 శాతం వరకు అధిక వేగాన్ని అందిస్తుంది.

పెరిగిన బ్యాట‌రీ బ్యాక‌ప్‌..

సెవెన్‌-కోర్ జీపీయూ గ్రాఫిక్స్ పనితీరును 40 శాతం వరకు పెంచుతుంది. డ్య‌యల్ 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఆన్-డివైస్ ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని రెండింతలు చేసేలా రూపొందించారు. యూనిఫైడ్ మెమరీ బ్యాండ్‌విడ్త్ కూడా 50 శాతం పెరిగింది. రెండు స్క్రీన్లను ఒకేసారి నిర్వహించేందుకు ప్రత్యేక డిస్‌ప్లే ఇంజిన్‌ను కూడా ఇందులో అందించారు. చిప్ నుంచి వెలువడే వేడిని నియంత్రించేందుకు కస్టమ్ వేపర్ ఛాంబర్‌ను నేరుగా చిప్ ప్యాకేజీలోనే ఇంటిగ్రేట్ చేశారు. ఐఫోన్ డ్యుయోలో రెండు భాగాలుగా విభజించిన డ్యుయల్-బ్యాటరీ సిస్టమ్‌ను ఉపయోగించారు. డైనమిక్ ఎనర్జీ రీబ్యాలెన్సింగ్ ద్వారా బ్యాటరీ వినియోగాన్ని నిర్వహిస్తారు. ఇన్నర్ స్క్రీన్‌పై 31 గంటల వరకు, ఔటర్ స్క్రీన్‌పై 44 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ లభిస్తుందని యాపిల్ తెలిపింది. రెండు డిస్‌ప్లేలను కలిపి మిశ్రమ వినియోగంలో సుమారు 24 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో సుమారు 20 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. మ్యాగ్‌సేఫ్, క్యూఐ2 వైర్‌లెస్ ఛార్జింగ్ ద్వారా సుమారు 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేయవచ్చు. కనెక్టివిటీ కోసం యాపిల్ ఎన్1 చిప్, సి2 మోడెమ్‌లను ఉపయోగించింది. ఎన్1 చిప్ వైఫై 7, బ్లూటూత్ 6, థ్రెడ్‌కు సపోర్ట్ చేస్తుంది. సి2 మోడెమ్ సెల్యులార్ కనెక్టివిటీని నిర్వహిస్తుంది. అమెరికాలో ఎంఎంవేవ్‌కు కూడా సపోర్ట్ ఉంటుంది.

కెమెరాలు ఎలా ఉన్నాయి..

వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ ఫ్యూజన్ మెయిన్ కెమెరా, 48 మెగాపిక్స‌ల్ ఫ్యూజన్ అల్ట్రా-వైడ్ కెమెరాలను అందించారు. మెయిన్ కెమెరాలో 2ఎక్స్ ఆప్టికల్ క్రాప్, సెన్సార్-షిఫ్ట్ స్టెబిలైజేషన్ ఉన్నాయి. అల్ట్రా-వైడ్ కెమెరా మాక్రో ఫొటోగ్రఫీకి కూడా ఉపయోగపడుతుంది. వీడియో రికార్డింగ్‌లో 120 ఎఫ్‌పీఎస్ వరకు 4కె డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. 60 ఎఫ్‌పీఎస్ వరకు పోస్ట్-క్యాప్చర్ సినిమాటిక్ అడ్జస్ట్‌మెంట్, అల్గారిథమిక్ ఆడియో ఐసొలేషన్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫోల్డబుల్ డిజైన్‌కు అనుగుణంగా కెమెరాలో ప్రత్యేక ఫీచర్లను అందించారు. డ్య‌యో ప్రివ్యూ ద్వారా ఫొటో తీసే సమయంలో వ్యూఫైండర్‌ను ఔటర్ స్క్రీన్‌పై చూడవచ్చు. స్మార్ట్ టేక్ ఆన్-డివైస్ సీన్ అనాలిసిస్ ఆధారంగా వ్యక్తులు పోజ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఫొటో క్యాప్చర్ చేస్తుంది. రియర్ సెల్ఫీస్ ఫీచర్ ద్వారా ప్రధాన వెనుక కెమెరాను ఉపయోగిస్తూ ఔటర్ స్క్రీన్‌లో ఫ్రేమింగ్‌ను చూసుకోవచ్చు. కిడ్ క్యూ ఫీచర్ పిల్లల దృష్టిని ఆకర్షించేందుకు బయటి స్క్రీన్‌పై యానిమేషన్లు చూపిస్తుంది. డ్యుయో ఫేస్‌టైమ్ ద్వారా గ్రూప్ సంభాషణల్లో సెకండరీ కాలర్లను ఔటర్ డిస్‌ప్లే ద్వారా చూపించవచ్చు.

ఐఓఎస్ 27తో..

ఐఫోన్ డ్యుయోలో ఐఓఎస్ 27ను అందించారు. ఫోల్డబుల్ స్క్రీన్‌కు అనుగుణంగా డాక్, డైనమిక్ ఐలాండ్, నావిగేషన్ వంటి ప్రధాన ఇంటర్‌ఫేస్ అంశాలను లేటరల్ ఓరియంటేషన్‌లోకి మార్చారు. నేటివ్ స్ప్లిట్ వ్యూ ద్వారా ఒకేసారి రెండు యాప్స్‌ను పక్కపక్కనే ఉపయోగించుకోవచ్చు. యాప్స్‌ను జత చేసి ఒకేసారి తెరవడం, ఒకే యాప్‌కు రెండు విండోలను ఉపయోగించడం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. స్టాండ్‌బై మోడ్‌ను రెండు స్క్రీన్లలోనూ ఉపయోగించుకునేలా విస్తరించారు. యాపిల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే సిరి ఏఐని కూడా అందించారు. ఇది డివైస్‌లోని స్థానిక సందర్భ సమాచారాన్ని ఉపయోగించి సంభాషణాత్మకంగా స్పందిస్తుంది. ఫొటోల కోసం స్పేషియల్ రీఫ్రేమింగ్, సింథ్‌ఐడీ వాటర్‌మార్కింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

క‌నెక్టివిటీ ఫీచ‌ర్లు..

ఐఫోన్ డ్యుయోలో హెచ్‌డీఆర్, ట్రూ టోన్, డైనమిక్ ఐలాండ్, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే, 120 హెడ్జ్‌ వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో ప్రొ-మోషన్ అందించారు. స్టోరేజ్ పరంగా 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ, 2 టీబీ వేరియంట్లు ఉన్నాయి. ముందు భాగంలో 12 మెగాపిక్స‌ల్ సెంటర్ స్టేజ్ కెమెరా ఉంది. అండర్-డిస్‌ప్లే ఫేస్‌టైమ్ కెమెరా, స్టీరియో స్పీకర్లు, సైడ్ బటన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్, కెమెరా కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ బరువు 254 గ్రాములు కాగా 5జి, 4*4 ఎంఐఎంఓ, గిగాబిట్ క్లాస్ ఎల్‌టీఈ, వైఫై 7, బ్లూటూత్ 6, సెకండ్ జనరేషన్ అల్ట్రా వైడ్‌బ్యాండ్, థ్రెడ్, ఎన్‌ఎఫ్‌సీ, డ్యుయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్, నావిక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

ధ‌ర ఎంతంటే..

ఐఫోన్ డ్యుయో స్టార్ వైట్, నైట్ స్కై రంగుల్లో లభిస్తుంది. 256 జీబీ మోడల్ ధరను రూ.2,99,900గా నిర్ణయించారు. 512 జీబీ ధర రూ.3,24,900, 1 టీబీ ధర రూ.3,74,900 కాగా, టాప్ ఎండ్ 2 టీబీ మోడల్ ధర రూ.4,49,900గా ఉంది. ఈ ఫోన్ ను యాపిల్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, యాపిల్ స్టోర్ యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్ 16 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 23 నుంచి 70కి పైగా దేశాలు, ప్రాంతాల్లో రిటైల్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Advertisement
Advertisement