త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

మాస్టర్ స్ట్రోకా? బూమరాంగా? — కేసీఆర్ రాజీనామా డిమాండ్ వెనుక రేవంత్ పాలిటిక్స్

"వెయ్యి రోజులు" వర్సెస్ "వెయ్యి రోజుల గైర్హాజరు".. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త రణరంగం! సభకు హాజరుకావడం లేదన్న కారణంతో ప్రతిపక్ష నేత నైతిక బాధ్యతపై సీఎం రేవంత్ రెడ్డి సంధించిన రాజీనామా డిమాండ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కేసీఆర్‌ను రాజకీయంగా నిలదీసే ఈ వ్యూహం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతుందా? లేక ఆ సీనియర్ నేతకు మళ్లీ రాజకీయ కేంద్రబిందువుగా మారే అవకాశాన్ని ఇస్తుందా?

S

Telangana | Published On Sep 1, 2026, 7.29 pm IST

మాస్టర్ స్ట్రోకా? బూమరాంగా? — కేసీఆర్ రాజీనామా డిమాండ్ వెనుక రేవంత్ పాలిటిక్స్

సంక్షిప్త సారాంశం

"ఎం.ఎస్‌.ఆర్" సవాల్‌ను తలపిస్తున్న రేవంత్ పాచిక.. ఎంపీ పదవికి రాజీనామా చేసిన నాటి చరిత్ర మళ్లీ పునరావృతమవుతుందా? గతంలో ఎం. సత్యనారాయణరావు (ఎం.ఎస్‌.ఆర్.) విసిరిన సవాల్‌ను స్వీకరించి, కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి భారీ విజయంతో కేసీఆర్ చరిత్ర సృష్టించిన తరుణం గుర్తున్నదే! నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధించిన అదే 'రాజీనామా' అస్త్రం కాంగ్రెస్‌కు మాస్టర్ స్ట్రోక్ అవుతుందా? లేక గులాబీ బాస్‌కే తిరుగులేని రాజకీయ ఆయుధంగా మారుతుందా?

Advertisement

                 'వెయ్యి రోజులు' వర్సెస్ 'వెయ్యి రోజుల గైర్హాజరు': రేవంత్ మైండ్ గేమ్‌లో ఎవరిది పైచేయి?

 

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అది ప్రభుత్వ పథకాల గురించో, కొత్త నిర్ణయాల గురించో కాదు. నేరుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ రాజకీయ బాధ్యత గురించే. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్యంగా కేసీఆర్ అసెంబ్లీ హాజరును ప్రధాన రాజకీయ అంశంగా మార్చారు. సభకు రాని ప్రతిపక్ష నేత పదవిలో ఎందుకు కొనసాగాలని ప్రశ్నిస్తూ రాజీనామా డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా దీనిపై నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మరోవైపు రాబోయే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి తన పదేళ్ల పాలన, కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై చర్చకు సిద్ధం కావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. దీంతో అసలు ప్రశ్న కేసీఆర్ రాజీనామా చేస్తారా? అన్నది కాకుండా మరోచోటికి మళ్లుతోంది. కేసీఆర్‌ను కార్నర్ చేయడానికి రేవంత్ విసిరిన ఈ రాజకీయ అస్త్రం కాంగ్రెస్‌కు మాస్టర్ స్ట్రోక్ అవుతుందా? లేక అదే కేసీఆర్ చుట్టూ మళ్లీ రాజకీయ చర్చను కేంద్రీకరించి బూమరాంగ్‌గా మారుతుందా?

'వెయ్యి రోజులు' వర్సెస్ 'వెయ్యి రోజుల గైర్హాజరు'

ఈ రాజకీయ ఎత్తుగడలో టైమింగ్‌ను విస్మరించలేం. ఒకవైపు కాంగ్రెస్ తన వెయ్యి రోజుల పాలనను విజయాల మైలురాయిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అదే వెయ్యి రోజులను ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేరని హామీల పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. సరిగ్గా ఈ సమయంలోనే రేవంత్ మరో 'వెయ్యి రోజుల' లెక్కను తెరపైకి తెచ్చారు. అది కేసీఆర్ రాజకీయ బాధ్యతకు సంబంధించిన లెక్క.
వెయ్యి రోజుల కాలంలో కేసీఆర్ రూ.1.24 కోట్ల మేర జీతం తీసుకున్నారని, ఆయన భద్రత, ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.21 కోట్ల మేర ఖర్చయిందని రేవంత్ ఆరోపించారు. ప్రజాధనం నుంచి ఇన్ని సౌకర్యాలు పొందుతున్న ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నది ఆయన లేవనెత్తుతున్న ప్రశ్న.ఇక్కడే రేవంత్ రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై BRS ప్రశ్నలు వేస్తుంటే... అదే వెయ్యి రోజుల్లో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఏం చేశారనే ప్రశ్నను కాంగ్రెస్ ఎదురుగా పెడుతోంది. ఒకరకంగా ఇది 'రిపోర్ట్ కార్డ్ వర్సెస్ అటెండెన్స్ కార్డ్' రాజకీయం.

డిఫెన్స్ కాదు.. కౌంటర్ అటాక్

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ తన పాలనపై ప్రతిపక్షం చేసే విమర్శలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రేవంత్ ఆ రాజకీయ సమీకరణాన్నే మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్‌ను తిరిగి ప్రశ్నల బోనులో నిలబెట్టడమే ఈ వ్యూహంలోని మొదటి లక్ష్యంగా కనిపిస్తోంది. “మీరు మా వెయ్యి రోజుల పాలనను ప్రశ్నిస్తున్నారు సరే.. ఈ వెయ్యి రోజుల్లో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పాత్ర ఏమిటి?” అన్న కౌంటర్ నెరేటివ్‌ను కాంగ్రెస్ ముందుకు తీసుకొస్తోంది. ఇది కేవలం ఒక ప్రసంగానికి పరిమితం కావడం లేదు. కేసీఆర్ రాజీనామా డిమాండ్‌తో పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో నిరసనలకు సిద్ధం చేయాలని రేవంత్ పిలుపునివ్వడం చూస్తే, దీన్ని రాజకీయ ప్రచారంగా మార్చాలన్న ఉద్దేశం కూడా కనిపిస్తోంది. అంటే కేసీఆర్‌ను విమర్శించడం మాత్రమే కాదు.. కేసీఆర్ గైర్హాజరునే ఒక రాజకీయ అంశంగా మార్చడం ఇక్కడ అసలు వ్యూహం.

రేవంత్‌కు మూడు రాజకీయ ప్రయోజనాలు

ఈ వ్యూహం ద్వారా రేవంత్ ఒకేసారి మూడు లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మొదటిది — కేసీఆర్‌ను అసెంబ్లీకి రప్పించడం లేదా ఆయన గైర్హాజరుపై నిరంతరం ప్రశ్నించే రాజకీయ అవకాశం పొందడం.

రెండోది — కాంగ్రెస్ పాలనపై BRS చేస్తున్న విమర్శలకు సమాంతరంగా ప్రతిపక్ష పనితీరుపైనా చర్చ మొదలుపెట్టడం.

మూడోది — కాంగ్రెస్ క్యాడర్‌కు ఒక స్పష్టమైన రాజకీయ అంశాన్ని ఇచ్చి, పార్టీ శ్రేణుల్లో రాజకీయ యాక్టివిటీని పెంచడం.

అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో నిమగ్నమయ్యే పార్టీ శ్రేణులకు ఇలాంటి రాజకీయ క్యాంపెయిన్‌లు మళ్లీ క్షేత్రస్థాయి కదలికకు కారణమవుతాయి. అందుకే దీనిని కేవలం కేసీఆర్‌పై చేసిన వ్యక్తిగత విమర్శగా కాకుండా, ఒక విస్తృత రాజకీయ వ్యూహంలో భాగంగా చూడాల్సి ఉంటుంది.

కానీ ఇక్కడే అసలు రిస్క్

రేవంత్ వ్యూహానికి ఉన్న బలమే ఒక దశలో దాని బలహీనతగా కూడా మారవచ్చు. ఎందుకంటే కేసీఆర్‌ను ఎంత ఎక్కువగా టార్గెట్ చేస్తే, అంత ఎక్కువగా ఆయన రాజకీయంగా చర్చలోకి వస్తారు. గతంతో పోలిస్తే ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో పరిమితంగా కనిపిస్తున్న కేసీఆర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రే పదేపదే టార్గెట్ చేయడం వల్ల, తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పటికీ కేసీఆర్‌నే తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా చూస్తోందనే భావన ప్రజల్లోనూ, బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ బలపడే అవకాశం ఉంది. అక్కడే ఒక ఆసక్తికరమైన రాజకీయ ప్రశ్న తెరపైకి వస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు ఇప్పటికీ ప్రధాన ప్రత్యర్థి కేసీఆరేనా?

పైకి ఇది సాధారణ ప్రశ్నలా కనిపించినా దీని వెనుక మరో రాజకీయ కోణం ఉంది. అధికారంలో ఉన్న పార్టీ ఎవరిని ప్రధానంగా టార్గెట్ చేస్తుందో సహజంగానే రాజకీయ చర్చ కూడా ఆ నాయకుడి చుట్టూ తిరగడం మొదలవుతుంది. కేసీఆర్ విషయంలోనూ అదే జరిగితే, కాంగ్రెస్ విమర్శలే ఆయన రాజకీయ ప్రాధాన్యతను మరోసారి హైలైట్ చేసే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్‌కు ఇది క్యాడర్ స్థాయిలో ఉపయోగపడే అంశం. అధికారం కోల్పోయిన తర్వాత ఏ ప్రతిపక్షానికైనా కార్యకర్తల్లో రాజకీయ నమ్మకాన్ని, పోరాట స్ఫూర్తిని కొనసాగించడం ప్రధాన సవాల్. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి తమ పార్టీ అధినేతపై వరుసగా రాజకీయ దాడులు రావడం గులాబీ శ్రేణుల్లో “అధికార కాంగ్రెస్ ఇప్పటికీ మన నాయకుడినే ప్రధాన ప్రత్యర్థిగా చూస్తోంది” అనే భావనను బలపరచవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ కోణం మరోలా ఉంటుంది. రేవంత్ రెడ్డిని కేసీఆర్‌కు సమస్థాయి రాజకీయ ప్రత్యర్థిగా అంగీకరించే నెరేటివ్‌ను గులాబీ పార్టీ సహజంగానే ముందుకు తీసుకురాదు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ రాజకీయ స్థాయిని రేవంత్‌తో నేరుగా పోల్చడాన్నే ఆ పార్టీ శ్రేణులు ప్రశ్నించవచ్చు. కానీ ఇక్కడే ఆసక్తికరమైన వైరుధ్యం ఉంది. బీఆర్ఎస్ ఆ పోలికను అంగీకరించకపోయినా, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ పదేపదే కేసీఆర్‌నే తన రాజకీయ దాడులకు కేంద్రంగా చేసుకుంటే రాష్ట్ర రాజకీయ చర్చ మాత్రం తిరిగి కేసీఆర్ చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది. అంటే కాంగ్రెస్ ఉద్దేశం కేసీఆర్‌ను డిఫెన్స్‌లోకి నెట్టడం కావచ్చు. కానీ బీఆర్ఎస్ దాన్నే మరోలా ప్రజెంట్ చేయగలదు — “అధికారంలో ఉన్నా కాంగ్రెస్ రాజకీయానికి ఇప్పటికీ కేసీఆరే కేంద్రం” అనే కౌంటర్ నెరేటివ్‌ను నిర్మించుకోవచ్చు. అక్కడే రేవంత్ వ్యూహంలోని సున్నితమైన రిస్క్ కనిపిస్తుంది. కేసీఆర్‌ను బాధ్యతపై నిలదీయాలి... కానీ ఆయన చుట్టూనే మొత్తం రాజకీయ చర్చ తిరిగేంత స్పేస్ ఇవ్వకూడదు.ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తప్పితే, కేసీఆర్‌పై ఒత్తిడి కోసం మొదలైన వ్యూహమే బీఆర్ఎస్‌కు రాజకీయంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.

కేసీఆర్ ముందున్న డైలమా

ఇప్పుడు బంతి కేసీఆర్ కోర్టులోనే ఉంది. కానీ ఆయన ముందున్నది కేవలం ‘అసెంబ్లీకి వెళ్లాలా? వద్దా?’ అనే సాధారణ నిర్ణయం కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక రాజకీయ పరిణామం ముడిపడి ఉండే పరిస్థితిని రేవంత్ సవాల్ సృష్టించింది. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించకుండా కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉంటే కాంగ్రెస్‌కు ఒక సిద్ధమైన రాజకీయ ప్రశ్న దొరుకుతుంది. “ప్రతిపక్ష నేత సభకు ఎందుకు రావడం లేదు?” ప్రతి అసెంబ్లీ సమావేశం సమయంలోనూ ఇదే ప్రశ్నను తిరిగి ముందుకు తీసుకురావచ్చు. అంతేకాదు, కేసీఆర్ ప్రభుత్వాన్ని బయట నుంచి ఎంత తీవ్రంగా విమర్శించినా దానికి కాంగ్రెస్ నుంచి “అదే ప్రశ్నలను సభకు వచ్చి అడగొచ్చు కదా?” అనే కౌంటర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కేసీఆర్ గైర్హాజరును ఒకరోజు రాజకీయ విమర్శగా కాకుండా, నిరంతరం ఉపయోగించుకునే నెరేటివ్‌గా మార్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించవచ్చు. ఇక్కడ కేసీఆర్‌కు మరో ఇబ్బంది కూడా ఉంది. ఆయన మౌనంగా ఉన్నంతకాలం ఈ చర్చలో కాంగ్రెస్ చెబుతున్న వాదనే ఎక్కువగా వినిపించే అవకాశం ఉంటుంది. రేవంత్ విసిరిన సవాల్‌కు ప్రత్యక్ష రాజకీయ సమాధానం రాకపోతే, చర్చను ఏ దిశలో తీసుకెళ్లాలన్న అడ్వాంటేజ్ అధికార పార్టీ చేతిలోనే ఉంటుంది. కానీ ఇదే డైలమాకు మరో వైపు కూడా ఉంది. కేసీఆర్ సవాల్‌ను స్వీకరించి అసెంబ్లీకి వస్తే, కాంగ్రెస్ ఇప్పటివరకు నిర్మించిన ‘అటెండెన్స్’ నెరేటివ్ అక్కడితో బలహీనపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సభకు వచ్చిన తర్వాత ప్రశ్న ‘కేసీఆర్ ఎందుకు రావడం లేదు?’ అన్నది కాదు. ‘కేసీఆర్ ఏం ప్రశ్నిస్తున్నారు? ప్రభుత్వం ఏం సమాధానం చెబుతోంది?’ అన్నదిగా మారుతుంది. అక్కడి నుంచే రాజకీయ సమీకరణం మారే అవకాశం ఉంటుంది. అందుకే కేసీఆర్ ముందున్నది ఆసక్తికరమైన పొలిటికల్ ఛాయిస్. సభకు రాకపోతే తన గైర్హాజరుపై కాంగ్రెస్‌కు రాజకీయ అస్త్రం ఇస్తారు. సభకు వస్తే మాత్రం రేవంత్ విసిరిన సవాల్‌ను స్వీకరించి, అదే అసెంబ్లీ వేదికను ప్రభుత్వంపై ఎదురుదాడికి ఉపయోగించుకునే అవకాశం పొందుతారు. అంటే కేసీఆర్ తీసుకునే నిర్ణయం కేవలం ఆయన అసెంబ్లీ హాజరును నిర్ణయించదు. రేవంత్ ప్రారంభించిన ఈ రాజకీయ ఎపిసోడ్ తర్వాతి దిశను కూడా అదే నిర్ణయించే అవకాశం ఉంది.

అసెంబ్లీ ఎంట్రీనే బూమరాంగ్ పాయింటా?

ఇక్కడే రేవంత్ సవాల్‌లో ఆసక్తికరమైన రాజకీయ వైరుధ్యం ఉంది. కేసీఆర్ సభకు రాకపోతే — రేవంత్‌కు రాజకీయ అస్త్రం.కేసీఆర్ సభకు వస్తే — బీఆర్ఎస్‌కు రాజకీయ అవకాశం.కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఉద్యోగాలు, రైతులు, సంక్షేమ హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, హైదరాబాద్ అభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నేరుగా నిలదీస్తే ఇప్పటివరకు కాంగ్రెస్ నడిపిస్తున్న 'అటెండెన్స్ డిబేట్' వెనక్కి వెళ్లి 'పెర్ఫార్మెన్స్ డిబేట్' ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు సమాధానం చెప్పాల్సిన స్థానం ప్రతిపక్షం నుంచి ప్రభుత్వానికి మారుతుంది. ముఖ్యంగా సుదీర్ఘ రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్న కేసీఆర్ అసెంబ్లీ వేదికను ఉపయోగించుకుని చర్చను తనకు అనుకూలమైన అంశాలవైపు తీసుకెళ్లగలిగితే, అది బీఆర్ఎస్‌కు కావాల్సిన రాజకీయ ఊపును అందించవచ్చు. అందుకే కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మని సవాల్ చేయడం వరకు ఈ వ్యూహం కాంగ్రెస్‌కు అనుకూలంగా కనిపించినా, ఆ సవాల్‌ను కేసీఆర్ స్వీకరిస్తే ఏమవుతుందన్నదే అసలు రిస్క్. రాజీనామా జరుగుతుందా అన్నది అసలు పాయింట్ కాదు . రేవంత్ డిమాండ్ తర్వాత కేసీఆర్ నిజంగానే పదవికి రాజీనామా చేస్తారా అనే చర్చ రాజకీయంగా అంత ముఖ్యమైనది కాకపోవచ్చు. ఇలాంటి డిమాండ్ల అసలు లక్ష్యం చాలాసార్లు రాజీనామా సాధించడం కంటే ప్రత్యర్థిపై రాజకీయ, నైతిక ఒత్తిడి పెంచడమే. ఇక్కడ కూడా అదే కనిపిస్తోంది. కేసీఆర్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ద్వారా కాంగ్రెస్ ఒక ప్రశ్నను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది — “ప్రతిపక్ష నేతగా ఆయన తన బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు?” అదే సమయంలో బీఆర్ఎస్ మరో ప్రశ్నను ముందుకు తీసుకొస్తోంది —“వెయ్యి రోజుల అధికారంలో కాంగ్రెస్ తన హామీలను ఎంతవరకు అమలు చేసింది?” అంటే ఒకవైపు ప్రతిపక్ష నేత బాధ్యత, మరోవైపు ప్రభుత్వ పనితీరు . రాబోయే రాజకీయ చర్చలో ఏ ప్రశ్న ప్రజల్లో ఎక్కువగా నిలబడుతుందన్నదే రెండు పార్టీల నెరేటివ్ పోరులో కీలకం.

మాస్టర్ స్ట్రోక్ అని ఇప్పుడే చెప్పగలమా?

ప్రస్తుతానికి రేవంత్ ఒక విషయంలో మాత్రం పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై జరుగుతున్న చర్చ మధ్యలోనే కేసీఆర్ పాత్రను కూడా రాజకీయ చర్చలోకి తీసుకొచ్చారు. కానీ ఒక రాజకీయ వ్యూహం విజయాన్ని రెండు రోజుల హెడ్‌లైన్స్‌తో నిర్ణయించలేం. దానికి ప్రత్యర్థి ఎలా స్పందిస్తాడన్నదే కీలకం. కేసీఆర్ అసెంబ్లీకి దూరంగానే ఉంటే ఈ అంశాన్ని కాంగ్రెస్ మరింతకాలం రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆయన సభలోకి వచ్చి ప్రభుత్వాన్నే ప్రశ్నలతో డిఫెన్స్‌లోకి నెట్టగలిగితే, కథ మరో మలుపు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అజెండాను రేవంత్ సెట్ చేశారు. బంతిని కేసీఆర్ కోర్టులోకి నెట్టారు. కానీ కేసీఆర్ ఆ బంతిని తిరిగి ఎంత బలంగా కొడతారన్నదే తర్వాతి రాజకీయం. అది జరగకపోతే రేవంత్‌కు ఇది మాస్టర్ స్ట్రోక్ కావచ్చు. జరిగితే మాత్రం...కేసీఆర్‌ను డిఫెన్స్‌లోకి నెట్టేందుకు విసిరిన ‘రాజీనామా’ అస్త్రమే.. చివరకు ఆయన చుట్టూనే తెలంగాణ రాజకీయాలను తిప్పే బూమరాంగ్‌గా మారొచ్చు. తెలంగాణ ఉద్యమ చరిత్రలోనూ ‘రాజీనామా సవాల్’ రాజకీయాన్ని మలుపుతిప్పిన సందర్భం ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత ఎం. సత్యనారాయణ రావు విసిరిన సవాల్‌ను స్వీకరించిన కేసీఆర్.. కరీంనగర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి తిరిగి ఉపఎన్నికల బరిలోకి దిగారు. భారీ మెజార్టీతో విజయం సాధించి తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవడమే కాకుండా, తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపు తీసుకొచ్చారు. అంటే.. కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో ‘రాజీనామా సవాల్’ కొత్తేమీ కాదు. గతంలో ప్రత్యర్థి విసిరిన అలాంటి సవాలునే తనకు అనుకూలమైన రాజకీయ అస్త్రంగా మలుచుకున్న చరిత్ర ఆయనకు ఉంది. అప్పుడు కాంగ్రెస్ నేత విసిరిన రాజీనామా సవాల్ కేసీఆర్‌కు రాజకీయంగా కలిసొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన ‘రాజీనామా’ పాచిక ఎవరికి కలిసొస్తుంది? కేసీఆర్‌ను డిఫెన్స్‌లోకి నెడుతుందా?.. లేక మరోసారి ఆయనకే రాజకీయంగా ఆయుధాన్ని అందిస్తుందా? ఈసారి ‘రాజీనామా’ రాజకీయం ఏ రూట్ తీసుకుంటుందో.. అసెంబ్లీ వేదికపై జరిగే తదుపరి పరిణామాలే తేల్చనున్నాయి.

Advertisement
Advertisement