త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు చెల్లించాం.. 72 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని.. అప్పట్లో వారు చేపట్టిన దీక్షలు, ధర్నాల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయినా నాటి ప్రభుత్వం కనీసం కన్నీటి చుక్క కూడా కార్చలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. కారుణ్య నియామకాలు చేపట్టడంతో పాటు ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు.

P

Telangana | Published On Aug 31, 2026, 8.01 pm IST

CM Revanth Reddy | ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు చెల్లించాం.. 72 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: రేవంత్‌రెడ్డి
Advertisement

CM Revanth Reddy | తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని.. అప్పట్లో వారు చేపట్టిన దీక్షలు, ధర్నాల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయినా నాటి ప్రభుత్వం కనీసం కన్నీటి చుక్క కూడా కార్చలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. కారుణ్య నియామకాలు చేపట్టడంతో పాటు ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. మూసారాంబాగ్‌–అంబర్‌పేట వంతెనను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ఆర్టీసీకి గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీశ్‌రావు నాడు కార్మికుల సమస్యల సమయంలో పారిపోయి దాక్కున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు క్రియాశీలక పాత్ర పోషించారు. 60 మంది చనిపోయినా కనీసం కన్నీటి చుక్క కూడా రాల్చలేదు’’ అని అన్నారు. తమ ప్రభుత్వం కార్మికులకు అండగా నిలిచి ఆర్టీసీలో నియామకాలు, కారుణ్య నియామకాలు చేపట్టిందని తెలిపారు.

ఉచిత బస్సు ప్రయాణానికి రూ.11 వేల కోట్లు

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినా.. ఆర్టీసీ ఉచితంగా సేవలు అందించడం లేదని సీఎం చెప్పారు. మహిళల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తోందన్నారు. 32 నెలల్లో రూ.11 వేల కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ‘‘మీరు ఎక్కిన ప్రతి బస్సుకు మీ తమ్ముడు పైసలు కడుతున్నాడు. ఇప్పటి వరకు మీ తరఫున రూ.11 వేల కోట్లు చెల్లించాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. 2023 డిసెంబరు 9న పథకాన్ని ప్రారంభించినప్పుడు మహిళలు చేయి చూపిస్తే బస్సు ఆపాలని, అడిగిన చోట దింపాలని చెప్పామని గుర్తుచేశారు. ఎవరైనా టికెట్‌ డబ్బులు అడిగితే తన ఫొటో చూపించి ‘‘మా తమ్ముడు పట్నంలో ఉన్నాడు.. తెచ్చుకోపో’’ అని చెప్పాలని సూచించిన విషయాన్ని ప్రస్తావించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు పుట్టింటికి వెళ్లినా, దేవుడి దర్శనానికి వెళ్లినా ఎవరైనా టికెట్‌ డబ్బులు అడిగారా? అని మహిళలను ప్రశ్నించారు. ‘‘నేను కాదా ఇచ్చింది? మీ తమ్ముడే కదా ఇచ్చింది. కేసీఆర్‌ ఇచ్చిండా? ఫామ్‌హౌస్‌లో పండుకున్న ఆయన ఇచ్చిండా?’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని సీఎం తెలిపారు. విధ్వంసమైన తెలంగాణను కూడదీసి అభివృద్ధి వైపు నడిపిస్తున్నామని చెప్పారు. వెయ్యి రోజుల పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేదల కోసం సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తున్నామని వివరించారు.

సర్కారు బడుల్లో పెరిగిన అడ్మిషన్లు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 27.50 లక్షల మంది పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనం పెడుతున్నామని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోనూ అడ్మిషన్లు పెరిగాయని పేర్కొన్నారు. ఆరుట్ల వంటి ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ‘‘నో అడ్మిషన్స్‌’’ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఒక పాఠశాలకు 4 వేల దరఖాస్తులు వస్తే 2,400 మందిని మాత్రమే చేర్చుకుని, మరో 1,600 మందికి వచ్చే ఏడాది అడ్మిషన్‌ ఇస్తామని చెప్పి పంపించారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా లక్ష మంది విద్యార్థులు చేరారని తెలిపారు. విద్యాశాఖను 28వ ర్యాంకు నుంచి 18వ ర్యాంకుకు తీసుకొచ్చామని చెప్పారు.

రెండేళ్లలో 72 వేల ఉద్యోగాలు

గత పదేళ్లలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, గ్రూప్‌ పరీక్షలు నిర్వహించలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. పోలీసు, ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల నియామకాలతో పాటు ఏ శాఖలోనూ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సక్రమంగా జరగలేదన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వడం, ప్రశ్నాపత్రాలు ముద్రించడం, వాటిని జిరాక్స్‌ సెంటర్లలో అమ్ముకోవడం, కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, చివరకు పరీక్షలు రద్దు చేయడం గత పదేళ్లలో జరిగిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం రెండేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలిపిందని సీఎం తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. మూతపడుతున్న ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా మార్చుతున్నామని, పాలిటెక్నిక్‌ కళాశాలలను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. స్కిల్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేశామని వివరించారు.

రైతుల కోసం రూ.1.70 లక్షల కోట్లు

రైతుల కోసం 30 నెలల్లో రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి.. 30 నెలల్లో ధాన్యం కొనుగోలుకు రూ.90 వేల కోట్లు రైతులకు చెల్లించామని పేర్కొన్నారు. రైతుభరోసా కింద రూ.36 వేల కోట్లు ఇచ్చామని, రూ.2 లక్షల రుణమాఫీ పథకంలో రూ.20,617 కోట్లు 25 లక్షల కుటుంబాలకు అందించామని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు విద్యుత్‌ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్లు చెల్లించిందన్నారు. గిట్టుబాటు ధరతో పాటు ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని చెప్పారు. తెలంగాణలోని 70 లక్షల రైతు కుటుంబాల అభ్యున్నతి కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం తెలిపారు. ఇది తాను చెబుతున్న లెక్క కాదని.. నీతి ఆయోగ్‌ చెప్పిన విషయమని పేర్కొన్నారు. తెలంగాణలో అప్పులు లేని రైతులు ఉన్నారని నీతి ఆయోగ్‌ చెప్పిందన్నారు. రైతులకు అద్భుతమైన పాలన అందించి వారిలో ప్రభుత్వంపై నమ్మకం కలిగించామని చెప్పారు. రైతుల కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇటీవల కోహెడలో ఫ్రూట్‌ మార్కెట్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టామని, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రైతులకు మార్కెట్‌ సౌకర్యాలు కల్పించి వారి ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.

Advertisement
Advertisement