త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేవంత్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్క‌డ‌?

Harish Rao | రిటైర్మెంట్ బెనిఫిట్స్ 99 రోజుల్లో ఇస్తామన్న ముఖ్యమంత్రి మాట నీటి మూటయ్యిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. ఉద్యోగులు జీవితకాలం దాచుకున్న డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ దగా చేస్తోందని మండిప‌డ్డారు. ఉద్యోగుల డబ్బులు కట్ అవుతున్న‌ప్ప‌టికీ ట్రీట్మెంట్ మాత్రం స్టార్ట్ కాలేదని ఎద్దేవా చేశారు.

S

Telangana | Published On Jun 28, 2026, 4.09 pm IST

Harish Rao | రేవంత్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్క‌డ‌?
Advertisement
  • 99 రోజుల్లో ఇస్తా అన్న‌వ్ క‌దా.. ఏమైంది
  • క్యాష్‌లెస్ స్కీమ్ పేరుతో ప్రతినెలా 1.5 శాతం డబ్బులు కట్ చేస్తున్న‌వ్
  • కానీ ట్రీట్మెంట్ మాత్రం స్టార్ట్ కాలే
  • 7 డీఏలు, పీఆర్సీ పెండింగ్ పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ‌నే
  • అడిగితే పైగా విజిలెన్స్ దాడులొక‌టి
  • గురుకులాల్లో బుక్స్, బట్టలు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం నీది
  • సిద్దిపేట పేద పిల్లల 'బ్రేక్ ఫాస్ట్' పథకం లాక్కోవడం పైశాచికం
  • వ‌జ్ర‌మ్మ కుమారులు సిద్దిపేట‌కే పేరు తెచ్చిర్రు
  • వజ్రమ్మ పదవీ విరమణ సత్కార కార్యక్రమంలో హ‌రీశ్‌రావు విమ‌ర్శలు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: రిటైర్మెంట్ బెనిఫిట్స్ 99 రోజుల్లో ఇస్తామన్న ముఖ్యమంత్రి మాట నీటి మూటయ్యిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. ఉద్యోగులు జీవితకాలం దాచుకున్న డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ దగా చేస్తోందని మండిప‌డ్డారు. క్యాష్ లెస్ హెల్త్ ట్రీట్మెంట్ కింద ఉద్యోగుల జీతాల నుంచి గతంలో ఉన్న 1 శాతం కటింగ్‌ను 1.5 శాతానికి పెంచి డబ్బులు కట్ చేస్తున్నారన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు ఉంటే అందరి డబ్బులు కట్ అవుతున్న‌ప్ప‌టికీ ట్రీట్మెంట్ మాత్రం స్టార్ట్ కాలేదని ఎద్దేవా చేశారు. సిద్దిపేటలో ఆదివారం జరిగిన ఉపాధ్యాయురాలు వజ్రమ్మ పదవీ విరమణ సత్కార కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న కక్షపూరిత విధానాలను ఎండగట్టారు.

ప్రైవేట్ ఆసుపత్రులతో ప్రభుత్వం కనీసం అగ్రిమెంట్లు చేసుకోలేదు. వారిని ప్యానల్ చేయలేదు. కానీ ఉద్యోగుల జీతాల నుంచి మాత్రం మొదటి నెల, రెండో నెల అంటూ ఆగమాగం డబ్బులు కట్ అయిపోతున్నాయి. దేశంలోనే 6, 7 డీఏలు పెండింగ్‌లో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పీఆర్సీ ఊసే లేదు, అడిగే పరిస్థితి లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పదవీ విరమణ పొందిన వెంటనే వారికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ అందేవి. కానీ ఇప్పుడు రిటైర్ అవుతున్న వారికి తమ సొంత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది అని హ‌రీశ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 99 రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగుల డబ్బులన్నీ ఇచ్చేస్తామని చెప్పారు. ఆ మాట ఎక్కడికి పోయింది? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని ఇచ్చిన మాటకు విలువ ఉండాలి. మాట మీద నమ్మకం కోల్పోతే ఆ కుర్చీకి, ఆ పదవికి గౌరవం ఉండదు. జీపీఎఫ్, టీఏ, డీఏ, సరెండర్ లీవ్స్ కింద ఉద్యోగులు తమ జీవితకాలంలో దాచుకున్న సొంత పైసలు కూడా రిటైర్ అయిన తర్వాత వాళ్లకు ఇవ్వకుండా ప్రభుత్వం ఆపుతోంది అని మాజీ మంత్రి ఆరోపించారు.

సద్విమర్శలను స్వీకరించే ఓపిక ఈ ప్రభుత్వానికి లేదు..

రైతుబంధు పైసలు 45 రోజుల్లో వేస్తామని సిద్దిపేటకు వచ్చి చెప్పారు. 85 రోజులు దాటినా ఇంకా రైతుల ఖాతాల్లో పైసలు పడలేదు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ప్రతిపక్షాలు, కవులు, కళాకారులు ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు.. ఏసీబీ, విజిలెన్స్ దాడుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రశ్నించే గొంతులను తట్టుకునే పరిస్థితి, సద్విమర్శలను స్వీకరించే ఓపిక ఈ ప్రభుత్వానికి లేదు అని హ‌రీశ్‌రావు అన్నారు.

ఒక్క జ‌త బ‌ట్ట‌లు కూడా ఇవ్వ‌లే..

విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నా విద్యా వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులవుతున్నా గురుకులాల్లో పిల్లలకు ఇంకా నోట్ బుక్స్ రాలేదు. కనీసం ఒక్క జత బట్టలు కూడా ఇవ్వలేదు. ఎంఈఓలకు స్కావెంజర్ల డబ్బులు రావడం లేదు. రాష్ట్రంలో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని మళ్లీ ప్రారంభించి, సిద్దిపేట జిల్లాపై కక్షతో ఫేజ్ 1లో జిల్లా పేరు లేకుండా పూర్తిగా పక్కన పెట్టారు. ఇది సిద్దిపేట ప్రజలపై పగ సాధించడమే అని ఆయ‌న ఆగ్ర‌హించారు.

వ‌జ్ర‌మ్మ కుమారులు సిద్దిపేట‌కే పేరు తెచ్చిండ్రు..

అధికారం, పోలీసుల అండ చూసుకుని కేసులతో గెలవాలనుకోవడం మూర్ఖత్వం. పనితనంతో ప్రజలకు మంచి చేసి వారి మనసులు గెలుచుకోవాలి. ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన వజ్రమ్మ, భగవాన్ రెడ్డి అత్యంత సాధారణ జీవితం గడుపుతూ, పూర్తి చిత్తశుద్ధితో తమ పిల్లలను, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు. తల్లిదండ్రుల క్రమశిక్షణతో పెరిగిన వారి కుమారులు అఖిల్, అంకిత్ గ్రూప్ 1, సివిల్ సర్వీసెస్ సాధించి ఉన్నత స్థాయికి చేరడం ఆ కుటుంబానికే కాదు సిద్దిపేటకే గర్వకారణం. ఇమామాబాద్ పాఠశాలలో కేవలం 25 మంది పిల్లలు ఉన్నప్పుడు విధుల్లో చేరిన వజ్రమ్మ, తన పట్టుదలతో తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాల స్ట్రెంత్ పెంచిన తీరు వారి వృత్తి ధర్మానికి నిదర్శనం. జ్వరంతో బాధపడుతున్న వజ్రమ్మ త్వరగా కోలుకోవాలని, పదవీ విరమణ తర్వాత వారి కుటుంబం అంతా ఆరోగ్యంగా, ఆనందంగా దేశమంతా పర్యటిస్తూ గడపాలి అని హ‌రీశ్‌రావు ఆకాంక్షించారు..

Advertisement
Advertisement