త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిదే.. ఇది అత్యంత సిగ్గుచేటు

Harish Rao | దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్ర‌భుత్వం రేవంత్‌రెడ్డిదేన‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హరీశ్ రావు విమ‌ర్శించారు. ఇప్ప‌టికీ సీపీఎస్‌ను ర‌ద్దు చేయ‌లేద‌ని, పీఆర్సీకి మోక్షం లేద‌ని మండిప‌డ్డారు. జీతాల్లో డ‌బ్బులు క‌ట్ అవుతున్నా ఈహెచ్ఎస్ అమ‌లుకాని దౌర్భాగ్య ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు.

S

Telangana | Published On Aug 27, 2026, 3.12 pm IST

Harish Rao | దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిదే.. ఇది అత్యంత సిగ్గుచేటు
Advertisement
  • ఇప్పటివరకు సీపీఎస్ రద్దు లేదు, పీఆర్సీకి మోక్షం లేదు
  • జీతాల్లో డబ్బులు కట్ చేస్తున్న‌రు.. కానీ ఈహెచ్ఎస్ అమ‌లైత‌లే
  • రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏకంగా 15 శాతం కమీషన్ అడుగుతున్న దౌర్భాగ్యం
  • నాడు కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు గౌరవం.. నేడు సచివాలయంలోకి నో ఎంట్రీ
  • ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పెట్టుకుంటే రేవంత్‌కు శంకరగిరి మాన్యాలు తప్పవు
  • మాజీ మంత్రి హ‌రీశ్‌రావు విమ‌ర్శ‌లు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్ర‌భుత్వం రేవంత్‌రెడ్డిదేన‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హరీశ్ రావు విమ‌ర్శించారు. ఇప్ప‌టికీ సీపీఎస్‌ను ర‌ద్దు చేయ‌లేద‌ని, పీఆర్సీకి మోక్షం లేద‌ని మండిప‌డ్డారు. జీతాల్లో డ‌బ్బులు క‌ట్ అవుతున్నా ఈహెచ్ఎస్ అమ‌లుకాని దౌర్భాగ్య ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏకంగా 15 శాతం క‌మీష‌న్ అడుగుతున్నారని ఆరోపించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీవోలు చేపట్టిన ధర్నా, ఆందోళన కార్యక్రమానికి ఆయ‌న హాజ‌రైన సంద‌ర్భంగా మాట్లాడారు. ఉద్యోగులు అడుగుతున్నవి అన్యాయమైన కోరికలు కావని.. ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలనే నేడు అమలు చేయాలని అడుగుతున్నారన్నారు.

సీపీఎస్ ఉద్యోగులను వోపీఎస్ లోకి మారుస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గొప్పగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దగ్గరపడుతున్నా, ఇప్పటివరకు సీపీఎస్ రద్దు లేదు, పీఆర్సీకి మోక్షం లేదు. ప్రభుత్వం నుంచి కనీసం చలనం లేదు. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం కేవలం 1 శాతం కాంట్రిబ్యూషన్‌తో ఈహెచ్ఎస్ తీసుకువచ్చాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాన్ని 1.5 శాతానికి పెంచింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇద్దరికీ కట్ చేస్తున్నారు. ఇంట్లో రిటైర్డ్ తల్లిదండ్రులు ఉంటే వాళ్లకూ కట్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఈహెచ్ఎస్ మాత్రం అమలు కావడం లేదు.

సిద్దిపేటలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఖాజా మొయినొద్దీన్ తండ్రికి గుండెపోటు వస్తే, ఏ ఆసుపత్రికి వెళ్లినా ఈహెచ్ఎస్ లేదని వెనక్కి పంపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో రూ.11 లక్షల బిల్లు అయితే నేను స్వయంగా ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి, బతిమలాడి రెండు మూడు లక్షలు తగ్గించాల్సి వచ్చింది. ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి ఉద్యోగులు మోసపోవడం తప్ప వారికి ఒరిగేదేమీ లేదు.

ఈహెచ్ఎస్ అమలు కోసం అగ్రిమెంట్ కాలేద‌ట‌..

నేను స్వయంగా ఆసుపత్రుల యాజమాన్యాలతో మాట్లాడాను. ఈహెచ్ఎస్ ఎందుకు అమలు చేయడం లేదని అడిగితే, ప్రభుత్వంతో మాకు ఇంకా ఎలాంటి అగ్రిమెంట్ కాలేదు, ఆరోగ్యశ్రీ బిల్లులే కుప్పలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం చెబుతున్న ధరలు మాకు గిట్టుబాటు కావు, అందుకే మేం సిద్ధంగా లేం అని తేల్చి చెబుతున్నారు. కనీసం ఆసుపత్రులతో అగ్రిమెంట్ చేసుకోకుండానే, కాంగ్రెస్ ప్రభుత్వం గత నాలుగు నెలలుగా ఉద్యోగుల జీతాల నుంచి ఏ హక్కుతో డబ్బులు కట్ చేస్తోంది? నేడు ప్రభుత్వ ఉద్యోగుల, పోలీసుల ఆరోగ్య భద్రత గాలిలో దీపంలా మారింది.

ఈహెచ్ఎస్ అమలులో ఎందుకింత జాప్యం జరుగుతోందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారూ.. మీరు సర్కార్ నడుపుతున్నారా? లేక సర్కస్ నడుపుతున్నారా? భారతదేశంలో ఎక్కడైనా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్న రాష్ట్రం ఉందా? ఆరు డీఏలను పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం మీదే. ఇది అత్యంత సిగ్గుచేటు. పెండింగ్ డీఏలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కలిసి దండం పెట్టి అడిగినా ఈ ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదు.

మొన్న సోషల్ మీడియాలో చూశాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంటే 15 శాతం కమీషన్ లంచంగా అడుగుతున్నారని ఓ బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. ప్రభుత్వానికి వెన్నెముక లాంటి ఉద్యోగులను, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే వారిని ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో అందరి బతుకులు ఆగమయ్యాయి.

నాడు కేసీఆర్ ఏకంగా 73 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులను గౌరవించుకున్నారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలి. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఉద్యోగ సంఘాలు ఎప్పుడంటే అప్పుడు వచ్చి కలిసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు సచివాలయంలోకి వెళ్లాలంటే పోలీసు బందోబస్తు, సెక్యూరిటీ చెకింగ్‌లు దాటుకుని వెళ్లాలి. లోపలికి ఫోన్స్ కూడా అలో చేయకుండా ఉద్యోగులను అవమానిస్తున్నారు.

సచివాలయంలోని సెకండ్ ఫ్లోర్‌లోకి ఎవరికీ ఎంట్రీ లేదు. జీపీఎఫ్ లోన్ కోసం వెళ్దామంటే కనీసం వినే నాథుడే లేడు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఆగమాగం చేసి, అన్ని వర్గాలనూ రోడ్డు మీదికి తెచ్చాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు, జీవో 97 కోసం పాలిటెక్నిక్ విద్యార్థులు, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు. మోడల్ స్కూల్ టీచర్లు నా వద్దకు వచ్చారు. 40 మంది మోడల్ స్కూల్ టీచర్లు చనిపోతే ఇప్పటివరకు వారి కుటుంబాలకు గ్రాట్యుటీ అందలేదు.

చాయ్ తాగినంతసేప‌ట్ల ప‌రిష్క‌రిస్తా అన్న‌డు..

సర్వ శిక్షా అభియాన్ఉద్యోగుల సమస్యలను వరంగల్‌లో చాయ్ తాగినంత సేపట్లో పరిష్కరిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పటిదాకా వారి సమస్యను పరిష్కరించకపోగా, కనీసం సచివాలయంలోకి కూడా అనుమతించడం లేదు. నాడు అంగన్‌వాడీలను కేసీఆర్ ఇంటికి పిలిచి అన్నం పెట్టి వేతనాలు పెంచారు. నేడు మీరు వారిని రోడ్లపై నిలబెడుతున్నారు. ఉద్యోగులతో పెట్టుకుంటే నీకు శంకరగిరి మాన్యాలు తప్పవు రేవంత్ రెడ్డి.

ఉపాధ్యాయులు, ఉద్యోగులతో పెట్టుకుంటే మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డట్లే. మీరు వారికిచ్చిన ఒక్క మాట కూడా అమలు చేయలేదు. ఉద్యోగులు అడుగుతున్నవి అన్యాయమైన కోరికలు కావు. ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు చెప్పిన విషయాలనే నేడు అమలు చేయాలని వాళ్లు అడుగుతున్నారు. ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని హ‌రీశ్‌రావు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement