త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pasham Yadagiri | ‘ఇడుపు కాయితం’పై ఎందుకంత రచ్చ? తెలంగాణ సీఎం రేవంత్ కాదు.. చంద్రబాబే

'ఇడుపు కాయితం' పదంపై ఆంధ్రా వాళ్ల రచ్చ, తెలంగాణ జర్నలిస్టు అరెస్ట్‌పై సీఎం రేవంత్ మౌనం వహించడంపై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

J

Telangana | Published On Jul 1, 2026, 8.17 pm IST

Pasham Yadagiri | ‘ఇడుపు కాయితం’పై ఎందుకంత రచ్చ? తెలంగాణ సీఎం రేవంత్ కాదు.. చంద్రబాబే
Advertisement
  • తెలంగాణ భాష, సంస్కృతిపై ఆంధ్రవాళ్లు ఇంకా పెత్తనం చెలాయిస్తున్నారని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఆగ్రహం
  • 'ఇడుపు కాయితం' అనే పదాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చను తీవ్రంగా తప్పుబట్టిన యాదగిరి
  • ఏపీ పోలీసులు తెలంగాణకు వచ్చి ఓ జర్నలిస్టును అరెస్ట్ చేసి, ఆయన భార్యతో అసభ్యంగా ప్రవర్తించినా సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్‌గా ఉన్నారని విమర్శ
  • తెలంగాణకు రేవంత్ రెడ్డి కాదని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అన్నట్లుగా పరిస్థితి ఉందంటూ సంచలన వ్యాఖ్యలు

Pasham Yadagiri | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ భాష, సంస్కృతులపై కొందరు ఆంధ్రవాళ్లు ఉద్దేశపూర్వకంగానే విషం చిమ్ముతున్నారని, వారి ఆలోచనల మీద పెత్తనం చెలాయిస్తున్నారని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి (Pasham Yadagiri) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ పోలీసుల దౌర్జన్యం, సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మౌనం, మీడియా తీరుపై నిప్పులు చెరిగారు.

మన భాషను ఎక్కిరిస్తున్నారు

సోషల్ మీడియాలో (Social media) ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన 'ఇడుపు కాయితం' (విడాకుల పత్రం) సినిమా టైటిల్‌పై జరుగుతున్న రచ్చను ఆయన ఖండించారు. "మన భాషను, సంస్కృతిని ఆంధ్ర వాళ్లు ఎక్కిరిస్తున్నారు. ఇడుపు కాయితం అనే పదం మీద ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

గతంలో వచ్చిన 'బలగం' సినిమాలో మూలుగ బొక్క కోసం కొట్లాడే సన్నివేశాన్ని కూడా సోషల్ మీడియాలో అవహేళన చేశారని ఆయన గుర్తు చేశారు. "కేరళలో ఒకసారి పెళ్లిలో కేవలం పాపడ్ కోసం కొడితేనే పెద్ద గొడవలు అయ్యాయి. పాపడ్ కోసమే కొట్లాడినప్పుడు, మూలుగు బొక్క కోసం కొట్లాడరా?" అంటూ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఆంధ్రా నేతలకు బానిసలుగా మారారు

ఇటీవల తెలంగాణకు చెందిన ఓ జర్నలిస్టును ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనపై పాశం యాదగిరి మండిపడ్డారు. "తన భర్తను అరెస్ట్ చేయొద్దు అని బతిమిలాడిన ఆ జర్నలిస్ట్ భార్య నడుము మీద ఏపీ పోలీసులు చెయ్యి వేసి లాగడం అత్యంత దుర్మార్గం. ఆంధ్రా పోలీసులు మన రాష్ట్రానికి వచ్చి.. ఇక్కడి మహిళల మీద చేతులు వేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి కనీసం నోరు విప్పడం లేదు. ఈ రేవంత్ వాళ్లు ఆంధ్రాకి బానిసలుగా మారిపోయారు, అందుకే మాట్లాడటం లేదు" అని దుమ్మెత్తిపోశారు.

పత్రికలన్నీ సిగ్గులేని వాళ్ల చేతుల్లోనే

ఒక తెలంగాణ జర్నలిస్టు అరెస్ట్ విషయంలో ఇంత పెద్ద తంతు జరిగితే మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. "ఇంత జరుగుతున్నా ఏ ఒక్క పత్రికలో కూడా ఈ వార్త రావడం లేదు. పత్రికలన్నీ సిగ్గులేని వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి" అని విమర్శించారు. అసలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి కాదని, చంద్రబాబు నాయుడే (Chandrababu Naidu) అన్నట్లుగా ఉందంటూ పాశం యాదగిరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement