త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | సింగ‌రేణి అధికారులు స‌మ్మెబాట ప‌ట్ట‌డం చ‌రిత్ర‌లో తొలిసారి

Harish Rao | సింగరేణి కోల్ మైన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఆర్‌పీ, పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మద్దతు తెలిపారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన అధికారుల ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

P

Telangana | Published On Jul 1, 2026, 7.28 pm IST

Harish Rao | సింగ‌రేణి అధికారులు స‌మ్మెబాట ప‌ట్ట‌డం చ‌రిత్ర‌లో తొలిసారి
Advertisement
  • కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే కార‌ణం
  • డిప్యూటీ సీఎం చీమ‌కుట్టిన‌ట్లు లేదు
  • పీఆర్‌పీ, పీఆర్సీ వెంట‌నే అమ‌లు చేయాలి
  • హ‌రీశ్‌రావు డిమాండ్‌
  • అధికారుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు

Harish Rao | సింగరేణి కోల్ మైన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఆర్‌పీ, పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మద్దతు తెలిపారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన అధికారుల ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ సింగరేణి చరిత్రలో కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేయడం చూశామని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల కారణంగా నేడు అధికారులు సైతం సమ్మెకు దిగి రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులకు ప్రతి ఏటా క్రమం తప్పకుండా పీఆర్‌పీ చెల్లించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా పీఆర్‌పీ నిలిపివేసి అధికారుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు.

క‌నీస స్పంద‌న లేదు..

పీఆర్‌పీ అమలు చేస్తే అధికారుల్లో ఉత్సాహం పెరిగి ఉత్పత్తి కూడా పెరుగుతుందని, అయితే రెండేళ్లుగా పీఆర్‌పీ నిలిపివేయడం వల్ల అధికారులు ఆందోళనకు గురై బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడిందన్నారు. సింగరేణిలో బొగ్గు నిల్వలు, ఉత్పత్తి తగ్గిపోవడంతో రాష్ట్రంలోని కేటీపీఎస్, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో కొన్ని యూనిట్లు మూతపడిన పరిస్థితి ఏర్పడిందన్నారు. "ఈ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి, ఈ వర్షాకాలంలో కూడా తెలంగాణ డిస్కంలు బయట పవర్ ఎక్స్ఛేంజీల నుంచి కరెంటు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది" అని హరీశ్ రావు ధ్వ‌జ‌మెత్తారు. దాదాపు 2,500 మంది అధికారులు నల్ల కండువాలు వేసుకుని ధర్నా చేస్తున్నా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కనీసం స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. సింగరేణి ఎప్పుడూ కోల్ ఇండియా మార్గదర్శకాలను పాటించడం ఆనవాయితీ అని, కోల్ ఇండియాలో ఇప్పటికే అమలు చేసిన 'పే అప్‌గ్రేడేషన్' విధానాన్ని ఎలాంటి జాప్యం లేకుండా ఇక్కడ కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తామ‌ని హామీ..

గతంలో పనితీరు, ప్రొడక్షన్ ఆధారంగా పారదర్శకంగా కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు జరిగేవని, ప్రస్తుతం రాజకీయ జోక్యంతో అవినీతికి అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. గతంలో సింగరేణి సీఎండి, డైరెక్టర్లు మాత్రమే రివ్యూ సమావేశాల కోసం సెక్రటేరియట్‌కు వచ్చేవారని, ప్రస్తుతం జీఎంలు, కింది స్థాయి అధికారులు కూడా పోస్టింగ్‌ల కోసం పైరవీకారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సింగరేణి సీఎండి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే ఆఫీసర్స్ అసోసియేషన్‌ను చర్చలకు పిలిచి, రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్‌పీ నిధులను విడుదల చేసి సమ్మె విరమింపజేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బదిలీలు, ప్రమోషన్లలో రాజకీయ జోక్యం తగ్గించి, కోల్ ఇండియా తరహాలో పాత పారదర్శక కౌన్సెలింగ్ విధానాన్ని తీసుకురావాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. "అధికారులు ఎవరూ అధైర్యపడవద్దని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మీ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని, మీకు అండగా ఉంటామని" హరీశ్ రావు అధికారులకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్ రావు, పుట్ట మధు, దుర్గం చిన్నయ్య, టిబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement