త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | అప్పుల సాకుతో తప్పించుకోలేం

Revanth Reddy | వీలైనంత త్వరగా అప్పుల భారాన్ని దించుకునే మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆదాయ సమీకరణకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని సూచించారు. వచ్చే ఏడాది బడ్జెట్ ను ఊహాజనితంగా కాకుండా వాస్తవ గణాంకాల ఆధారంగా రూపొందించాలని ఆదేశించారు.

P

Telangana | Published On Jul 1, 2026, 6.00 pm IST

Revanth Reddy | అప్పుల సాకుతో తప్పించుకోలేం
Advertisement
  • అప్పు మీద అప్పు..ఇంకెన్నాళ్లు?
  • తెస్తున్న అప్పులు పాత బాకీలకే సరి
  • ఆదాయాన్ని సమీకరించండి
  • ఖజానా నింపే మార్గాలను అన్వేషించండి
  • పథకాల్లో అనర్హులను ఏరివేయండి
  • అందుకోసం ఏఐ, ఇతర సాంకేతికతను వాడుకోండి
  • హెచ్ఎండీఏ, టీజీఐఐసీ పరిధిలో వేలం వేసే భూములను వెతకండి
  • కమర్షియల్, ఎక్సైజ్, మైనింగ్ శాఖల్లో ఒక్క పైసా పక్కకు పోవద్దు
  • నిధుల సమీకరణపై ప్రతి నెల ప్రొగ్రెస్ రిపోర్ట్ కావాలి

అప్పు మీద అప్పు మనకు భారం అవుతున్నది. ఏనుగులా పేరుకుపోయిన అప్పును తీర్చేందుకు మనం తెస్తున్న కొత్త అప్పులు.. పాత అప్పుల అసలు, వడ్డీలకు సర్దడానికే సరిపోతున్నది. తంటాలు పడి తీసుకొస్తున్న రుణాలు .. నిమిషాల్లో మాయమవుతున్నాయి. ఈ జాడ్యం నుంచి బయటపడాలంటే మనం తక్షణం సరికొత్త ఆదాయ మార్గాలు వెతకండి. భూమలమ్ముతారా? పక్కదారి పట్టకుండా పన్నులు వసూలు చేస్తారా? మీ ఇష్టం. కానీ నెల తిరిగే నాటికి .. ఎంత ఆదాయం వచ్చిందో నాకు ప్రొగ్రెస్ రిపోర్ట్ కావాలి. ఇంకా మనం పదే పదే అప్పుల పేరు చెప్పి తప్పించుకోలేం.. బుధవారం ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు ఇవి!

త్రినేత్ర.న్యూస్ : వీలైనంత త్వరగా అప్పుల భారాన్ని దించుకునే మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆదాయ సమీకరణకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని సూచించారు. వచ్చే ఏడాది బడ్జెట్ ను ఊహాజనితంగా కాకుండా వాస్తవ గణాంకాల ఆధారంగా రూపొందించాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా అధికారులు అన్ని శాఖల వారీగా నిజమైన ఆదాయ వ్యయాలను రూపొందించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై అధికారులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగంలో బుధవారం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు.

ముందు..వీబీజీరామ్ కు నిధులు సేకరించండి

ఈ రోజు నుంచి అమలవుతున్న వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (వీబీజీ రామ్ జీ)కు అత్యవసరంగా రాష్ట్ర వాటాగా 2550 కోట్లు అవసరమవుతాయని.. వాటిని ముందు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. "ఇజ్జత్ కా సవాల్ లాగా తీసుకొని నిన్న రైతు భరోసా నిధులను విడుదల చేసినం. ఆర్బీఐ నుంచి మొన్న తెచ్చిన అప్పు 7 వేల కోట్లు భరోసాకే సరిపోయింది. ఇంకో 2 వేల కోట్లు సర్దాల్సి ఉంది. అది కాకుండా.. కేంద్రం అమలు చేస్తున్న నేటి నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్రం తన వాటాగా 3825 కోట్లను ఇప్పటికే ఖాతాలో జమ చేసింది. మనం మన వాటాగా 2550 కోట్లను ఇవ్వాల్సి ఉంది. మనం 3500 కోట్ల అప్పు కోసం ఆర్బీఐకి పెట్టిన ఇండెంట్ మరో 15 రోజుల తర్వాత కానీ విడుదల కావు. ఇప్పుడు అత్యవసరంగా మనం రాష్ట్ర వాటాగా 2550 కోట్లను ఇవ్వకపోతే.. ఆ నిధులు మంజూరు కావు. అవి రాకపోతే కూలీలకు దినసరి వేతనాలు ఆగిపోతాయి. కాబట్టి ఏం చేద్దామో ఎలా చేద్దామో మీరే చెప్పండి" అని ముఖ్యమంత్రి చెప్పారు.

ట్యాక్సుల విషయంలో..కఠినంగా ఉండండి..

ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులైన కమర్షియల్ ట్యక్స్, ఎక్సైజ్,మైనింగ్ విభాగాల నుంచి వస్తున్న పన్నుల్లో ఒక్క పైసా పక్క దారి పట్టకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. "మనకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖల నుంచి ప్రతిపైసా ఖజానాకే చేరాలి. ఎక్కడా లీకేజీలు ఉండకూడదు. అంతేకాదు. హెచ్ఎండీఏ, టీజీఐఐసీ పరిధిలోని భూముల ను వేయగలిగే ప్రాంతాలను ఎంపిక చేయండి. ఏఐ లాంటి సాంకేతికతను వాడుకొని.. సంక్షేమ పథకాలు పొందుతున్న అనర్హులను ఏరివేయండి. ఆదాయం పెంచేందుకు ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో వాటన్నింటినీ అధ్యయనం చేయండి. అటువంటి కొన్ని మంచి ప్రాక్టీసెస్ ను అడాప్ట్ చేసుకుందాం.ఆదాయాన్ని ప్రతినెలా పెంచుతూ పోవాలి. నెల నెలా నాకు ఆ ప్రొగ్రెస్ రిపోర్ట్ కూడా కావాలి. ఎంత ఖర్చు పెడుతున్నామో ..ఎంత అప్పు తెస్తున్నామో.. ఎన్ని వడ్డీలు కడుతున్నామో అన్నీ పారదర్శకంతా ఉండాలి. వచ్చే బడ్జెట్ కూడా.. వాస్తవిక గణాంకాలకు లోబడి పెట్టుకుందాం. అంతే కానీ గొప్పలకు పోవద్దు. ఎంత ఆదాయం వస్తుందో అంతే బడ్జెట్ లో చెబుదాం" అని సీఎం అధికారులకు చెప్పారు.

Advertisement
Advertisement