త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

బీఆర్‌ఎస్‌కు కౌంటర్‌ సరే సీఎం సాబ్‌… 22ఏ బాధితుల ప్రశ్నలకు జవాబేది?

బీఆర్‌ఎస్‌పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదునైన ఎదురుదాడి చేశారు. 22ఏ బాధితులకు 30 రోజుల్లో న్యాయం చేస్తామని ప్రకటించారు. రాజకీయ కౌంటర్‌, పరిష్కార ప్రక్రియ బాగానే ఉన్నాయి. కానీ ఎన్ని కేసులు తేలుస్తారు, గడువు దాటితే బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలకు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

S

Telangana | Published On Sep 17, 2026, 7.00 am IST

బీఆర్‌ఎస్‌కు కౌంటర్‌ సరే సీఎం సాబ్‌… 22ఏ బాధితుల ప్రశ్నలకు జవాబేది?

సంక్షిప్త సారాంశం

22ఏ వివాదాల పరిష్కారానికి త్రిసభ్య ఉన్నతాధికారుల కమిటీని ప్రకటించిన సీఎం, బాధితులకు 30 రోజుల గడువు ఇచ్చారు. అయితే మొత్తం కేసులు, అర్హత ప్రమాణాలు, రెండు కమిటీల అధికార పరిధిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌కు ఇచ్చిన రాజకీయ కౌంటర్‌ ప్రజలకు న్యాయంగా మారాలంటే—ప్రభుత్వం ఫలితాలను లెక్కలతో ప్రజల ముందు ఉంచాలి.

Advertisement

                           30 రోజుల హామీ ఇచ్చారు… అమలుకు జవాబుదారీ ఎవరు?

 

22ఏ భూములపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు పనులు చేశారు. బీఆర్‌ఎస్‌ ఆరోపణలపై రాజకీయంగా ఎదురుదాడి చేశారు. అదే సమయంలో బాధితులకు 30 రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భూమిని నిషేధిత జాబితాలో చేర్చే ముందు నోటీసు, విచారణ, అభ్యంతరాలకు అవకాశం, ఉత్తర్వుల జారీ వంటి ప్రక్రియనూ వివరించారు. బీఆర్‌ఎస్‌కు ఇవ్వాల్సిన కౌంటర్‌ ఇచ్చారు. ప్రజలకు పరిష్కార మార్గాన్నీ ప్రకటించారు. ఇంతవరకు స్పష్టమే. కానీ 30 రోజుల్లో పరిష్కరించబోయే కేసులెన్ని? ఆ హామీ ఎవరికి వర్తిస్తుంది? గడువు దాటితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ మూడు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం  మాత్రం అసెంబ్లీ వేదిక నుండి ఇవ్వలేకపోయారు.

30 రోజులు సరే.. కేసులెన్ని?

భూమిని 22ఏలో చేర్చే ముందు సబ్‌ కలెక్టర్‌ లేదా ఆర్డీవో విచారణ జరపాలని సీఎం చెప్పారు. యజమానికి నోటీసు ఇచ్చి, అభ్యంతరం చెప్పేందుకు 15 రోజుల సమయం ఇవ్వాలని స్పష్టం చేశారు. సర్వే నంబర్‌లో కొంత భాగానికే వివాదం ఉంటే, ఆ భాగాన్ని మాత్రమే నిషేధించాలని చెప్పారు. విచారణ తర్వాత ఉత్తర్వుల ప్రతిని యజమానికి ఇవ్వాలని ప్రకటించారు. ప్రక్రియను వివరించిన సీఎం, దాని పరిధిలోకి వచ్చే కేసుల సంఖ్యను కూడా వెల్లడించి ఉంటే పూర్తి చిత్రం వచ్చేది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 22ఏ దరఖాస్తులెన్ని? వాటిలో 30 రోజుల్లో పరిష్కరించబోయేవి ఎన్ని? జిల్లాలవారీ లక్ష్యం ఎంత? ఈ లెక్క లేకుండా 30 రోజుల తర్వాత ప్రభుత్వ హామీ అమలైందో లేదో ప్రజలు ఎలా నిర్ధారించాలి? అన్నదానిపై ప్రభుత్వాధినేతగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంది.

‘నిరుపేద’ ఎవరు?

నిరుపేదలకు సంబంధించిన 22ఏ ఆస్తి వివాదాల్లో న్యాయం చేస్తామని సీఎం ప్రకటించారు. అయితే నిరుపేదను నిర్ణయించే ప్రమాణమేమిటి? కుటుంబ ఆదాయమా? భూమి విస్తీర్ణమా? ఆస్తి విలువా? ప్రభుత్వం దీనిపై ప్రత్యేక మార్గదర్శకాలు ఇస్తుందా? పొరపాటుగా నిషేధిత జాబితాలో పడిన భూమి పేదవాడిదైనా, మధ్యతరగతి కుటుంబానిదైనా సమస్య ఒకటే. రిజిస్ట్రేషన్‌ ఆగుతుంది. బ్యాంకు రుణం రాదు. అవసరానికి ఆస్తిని అమ్ముకోలేరు. అందువల్ల 30 రోజుల పరిష్కారం నిరుపేదలకే పరిమితమా? లేక తప్పుగా నమోదైన అన్ని ప్రైవేటు ఆస్తులకూ వర్తిస్తుందా? ప్రభుత్వం ముందుగా తేల్చాల్సిన ప్రశ్న ఇదే. దీన్ని సీఎం సభలో ప్రస్తావించక విస్మరించారు.

98 శాతం వెనుక పూర్తి లెక్క ఏది?

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్లాట్‌ బుక్‌ చేసుకున్న అర్హమైన కేసుల్లో దాదాపు 98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని చెప్పారు. 24 గంటల్లో 34 రిజిస్ట్రేషన్లు చేసినట్లు, హెల్ప్‌లైన్‌కు 1,162 కాల్స్‌ వచ్చినట్లు వెల్లడించారు. అయితే 98 శాతం అనేది స్లాట్‌ బుక్‌ చేసుకున్న అర్హమైన కేసులకు మాత్రమే సంబంధించినది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన మొత్తం ఫిర్యాదుల పరిష్కార శాతం కాదు. మొత్తం దరఖాస్తులెన్ని? పరిష్కరించినవి, తిరస్కరించినవి, పెండింగ్‌లో ఉన్నవి ఎన్ని? ఈ నాలుగు అంకెలను జిల్లాలవారీగా వెల్లడిస్తే వివాదానికి రాజకీయ ప్రకటనలతో కాకుండా అధికారిక లెక్కలతో సమాధానం చెప్పినట్లవుతుంది. ఇది అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ ఎటాక్ ఫ్లోలో మిస్ అయింది.

రెండు కమిటీలు.. బాధితుడు ఎక్కడికి వెళ్లాలి?

22ఏ వివాదాల పరిష్కారానికి సీసీఎల్‌ఏ ప్రత్యేక కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఉన్నతాధికారితో హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. మరోవైపు జీఓ 98 కింద సీసీఎల్‌ఏ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఇప్పటికే ఉంది.నకొత్త కమిటీకి సంబంధించిన ఉత్తర్వులు వెలువడినప్పుడు ఈ రెండింటి అధికారాలను స్పష్టంగా విభజించాలి. బాధితుడు ఏ కమిటీకి దరఖాస్తు చేయాలి? కొత్త కమిటీ సిఫారసు చేస్తుందా? లేక తుది నిర్ణయం తీసుకుంటుందా? విచారణ తర్వాత ఇచ్చిన ఉత్తర్వుతో యజమాని విభేదిస్తే అప్పీల్‌ ఎక్కడ చేయాలి? ఒక ఫైలు రెండు కమిటీల మధ్య తిరిగితే 30 రోజుల లక్ష్యం మొదట్లోనే దారి తప్పుతుంది.

తప్పు యంత్రాంగానిదైతే భారమెందుకు ప్రజలపై?

కొంత భాగానికే వివాదం ఉన్నా మొత్తం సర్వే నంబర్‌ను బ్లాక్‌ చేసిన పొరపాట్లు జరిగినట్లు ప్రభుత్వం అంగీకరించింది. అలాంటి నమోదులను అధికారులే గుర్తించి సరిచేస్తారా? లేక ప్రతి యజమాని దరఖాస్తు చేసుకునే వరకు ఎదురుచూస్తారా? పొరపాట్లకు బాధ్యులైన అధికారులను గుర్తించారా? ఇప్పటివరకు ఎవరిపైనైనా చర్య తీసుకున్నారా? రిజిస్ట్రేషన్‌ జరగకపోతే ఫీజు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. కానీ అధికారుల తప్పుతో రుణం ఆగిపోయినా, విక్రయ ఒప్పందం రద్దయినా బాధితుడికి లభించే ఊరట ఏమిటి? గడువు ప్రకటించడమే కాదు, గడువు తప్పితే జవాబుదారీ ఎవరో కూడా ముందే చెప్పాలి. తప్పు జరిగిపోయందని ఒప్పుకుంటే సరిపోతుందా?

కేసీఆర్‌ భూములు.. తేల్చాల్సింది విచారణే

కేసీఆర్‌ కుటుంబ భూములపై సీఎం చేసిన ఆరోపణలు తీవ్రమైనవి. ప్రభుత్వం వద్ద ఆధారాలుంటే చట్టప్రకారం విచారణ జరగాలి. ఎక్కువ భూములు ఉండటమే అక్రమానికి రుజువు కాదు. అవి ప్రభుత్వ, అసైన్డ్‌ లేదా సీలింగ్‌ మిగులు భూములా అన్నది రికార్డులు, నోటీసులు, విచారణతో తేలాలి. ఎర్రవల్లి భూములపై 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న ఆదేశం సరే; స్వాధీనం, పంపిణీపై తుది నిర్ణయం మాత్రం విచారణ తర్వాతే రావాలి. అయితే ఇక్కడ ఇన్ని రోజులు ఎందుకు ప్రభుత్వం మౌనవ్రతం పాటించింది. 22 ఏ భూముల ఆరోపణల నేపధ్యంలోనే ఈ ప్రస్తావన సీఎం ఎందుకు తెచ్చారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇది రాజకీయ దాడియేనా... ఆరోపణల్లో నిజముందా.. ఉంటే ఇంత ఆలస్యం ఎందుకు చేశారన్న ప్రశ్నలకు అధికారంలో ఉన్న సర్కారే సమాధానం ఇవ్వాల్సి ఉంది.

ప్రతిపక్షం ఉంటేనే పూర్తి చర్చ

22ఏ అంశాన్ని లేవనెత్తిన బీఆర్‌ఎస్‌ సభ్యులు సస్పెండ్‌ అయిన తర్వాత సీఎం సభలో సమాధానమిచ్చారు. సస్పెన్షన్‌కు కారణాలు వేరైనా, దాన్ని ఉపసంహరించే అవకాశాన్ని పరిశీలించి బీఏసీ ద్వారా మరో చర్చకు సమయం ఇచ్చి ఉంటే మరింత హుందాగా ఉండేది. ప్రభుత్వం తన రికార్డులు బయట పెట్టాలి. ప్రతిపక్షం తన ఆరోపణలకు ఆధారాలు చూపాలి. ప్రజల ముందే నిజానిజాలు తేలాలి. ఏది ఏమైనా... అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌పై రేవంత్‌ కౌంటర్‌ రాజకీయంగా పదునుగానే ఉంది. 22ఏ బాధితులకు ఇచ్చిన 30 రోజుల హామీ కూడా కీలకమే. ఇప్పుడు కావాల్సింది ఒకటే—ఎన్ని కేసులు, ఎవరికి పరిష్కారం, నిర్ణయం ఎవరిది, గడువు దాటితే బాధ్యత ఎవరిది? 30 రోజుల తర్వాత ఈ నాలుగు ప్రశ్నలకు ప్రభుత్వం లెక్కలతో సమాధానం చెబితేనే సభలో చేసిన ప్రకటన బాధితుడి చేతిలో న్యాయంగా మారుతుంది. పదునైన రాజకీయ దాడి కన్నా ప్రజల పదునైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే కాంగ్రెస్ సర్కార్ రాజకీయంగా నష్టపోవడం మాత్రం ఖాయమనే చెప్పాలి.

Advertisement
Advertisement