త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేవంత్.. నీకు ద‌మ్ముంటే నా పేరెత్తి మాట్లాడు.. నాకు భ‌య‌ప‌డే ఇన్‌డైరెక్ట్‌గా ఆరోప‌ణ‌లు చేస్తున్న‌వ్‌

Harish Rao | కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న స్కాములను నేను ఆధారాలతో సహా బయటపెడుతుంటే.. సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి నా మీద వ్యక్తిగతంగా క‌క్ష క‌డుతున్నార‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ విమ‌ర్శించారు. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే నా పేరు చెప్పి ఆరోపణలు చేయాలన్నారు.

S

Telangana | Published On Aug 17, 2026, 7.03 pm IST

Harish Rao | రేవంత్.. నీకు ద‌మ్ముంటే నా పేరెత్తి మాట్లాడు.. నాకు భ‌య‌ప‌డే ఇన్‌డైరెక్ట్‌గా ఆరోప‌ణ‌లు చేస్తున్న‌వ్‌
Advertisement
  • నా పేరు అలా చెప్త‌వో లేదో వెంట‌నే లీగ‌ల్ నోటీసులు పంపుతా
  • నీది ఫోర్ బ్ర‌ద‌ర్స్ పాల‌న‌లా మారిపోయింది.. నీ సొంత మ‌నుషుల‌కే జ‌స్టిస్ జ‌రుగుతుంది
  • స్కామ్‌ల‌ను ఆధారాల‌తో బ‌య‌ట‌పెడుతుంటే నా మీద క‌క్ష గ‌డుతున్న‌వా?
  • కేసీఆర్‌ను విమర్శించుడు అంటే సూర్యుడిపై ఉమ్మిన‌ట్లే
  • తెలంగాణ భవన్‌లో రేవంత్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్: కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న స్కాములను నేను ఆధారాలతో సహా బయటపెడుతుంటే.. సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి నా మీద వ్యక్తిగతంగా క‌క్ష క‌డుతున్నార‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ విమ‌ర్శించారు. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే నా పేరు చెప్పి ఆరోపణలు చేయాలన్నారు. నా పేరు చెబితే వెంటనే లీగల్ నోటీసు పంపుదామని నేను రెడీగా ఉన్నానని చెప్పారు. లీగల్ నోటీసులకు, చట్టానికి భయపడే ఆయన నా పేరు చెప్పకుండా పిరికివాడిలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్‌ది ఫోర్ బ్రదర్స్ పాలనగా మారిపోయిందని ఆరోపించారు. ఆయ‌న‌ సొంత మనుషులకే జస్టిస్ జరుగుతోందని ధ్వ‌జ‌మెత్తారు. సోమ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా రేవంత్‌పై నిప్పులు చెరిగారు.

ఈత రాకున్నా హుస్సేన్‌సాగ‌ర్‌లో దుంకినా..

నన్ను అగ్గిపెట్టెతో పోలుస్తూ చిల్లర మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి.. అసలు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదు. నాడు తెలంగాణ కోసం నిస్వార్థంగా కొట్లాడి నా మీద 370 కేసులు ఉన్నాయి. మెదక్ జైల్లో మూడు రోజులు ఉన్న, రైలు రోకోలో 48 గంటలు కంకర రాళ్ల మీదే పడుకున్నా. ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలా విసిరికొట్టి ఉద్యమం చేశాం. మిలియన్ మార్చ్ సమయంలో నాకు ఈత రాకపోయినా తెలంగాణ కోసం హుస్సేన్ సాగర్‌లోకి దూకిన.

రేవంత్ రెడ్డి పాలన అంటే కుటుంబ పాలన.. ఫోర్ బ్రదర్స్ పాలనగా మారిపోయింది. పెళ్లిళ్లు జరిగి పిల్లలు పుడుతున్నా పైసలు రావడం లేదు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 'కల్యాణ లక్ష్మి' కాస్తా 'సంతాన లక్ష్మి'గా మారిపోయింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 35 నుంచి 51 వరకు స్పష్టంగా చెబుతున్నది ఏంటంటే.. సంక్షేమం అనేది రాజ్యం ప్రాథమిక విధి. నాడు కేసీఆర్ అధికారంలోకి రాగానే ఏకంగా 42 సంక్షేమ పథకాలకు ఒకేసారి ఆమోదముద్ర వేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ముందుగా చెప్పకపోయినా.. ఆడబిడ్డలకు అండగా ఉండాలనే బాధ్యతతో అధికారంలోకి రాగానే 'కల్యాణ లక్ష్మి'ని తెచ్చి అమలు చేశాం.

ద‌ళ‌ప‌తి విజ‌య్ 8 గ్రాముల బంగారం ఇస్తుండు..

పక్క రాష్ట్రం తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ 100 రోజుల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు 8 గ్రాముల బంగారం ఇస్తామని మాట ఇచ్చి, చెప్పినట్టే అమలు చేస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం కల్యాణ లక్ష్మి దరఖాస్తులు ఏకంగా లక్షకుపైగా పెండింగ్‌లో మూలుగుతున్నాయి. కొత్త రేషన్ కార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇస్తుందని నాడు స్వయంగా కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే ట్వీట్ చేశారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తవి ఇవ్వకపోగా.. లక్షా 40 వేల రేషన్ కార్డులను దారుణంగా తొలగించి పేదల కడుపు కొట్టారు.

సీలింగ్ ఎత్తివేసి ప్రతి ఒక్కరికీ 6 కేజీల బియ్యం ఇచ్చింది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు సన్న బియ్యం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నది ప్రజలకు తెలుసు. ఉద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. గత మూడు నెలలుగా జీతాల నుంచి EHS డబ్బులు కట్ చేస్తున్నారు కానీ.. ఆ కార్డు పట్టుకుంటే ఏ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న సిద్దిపేట నుంచి రిటైర్డ్ హెడ్మాస్టర్ ఖాజా మొహియుద్దీన్ భార్య అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోతే 11 లక్షల బిల్లు వేశారు. EHS వర్తించక, ఆ బిల్లు ఎలాగైనా తగ్గించమని ఆయన నా దగ్గరకు వచ్చి వేడుకున్న పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోయింది.

జ‌ర్న‌లిస్టుల‌ను ఈహెచ్ఎస్‌లో చేర్చాం..

నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కాంట్రిబ్యూషన్ లేకుండానే జర్నలిస్టులను సైతం EHSలో చేర్చింది. EHS విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. సిద్దిపేట మెడికల్ కాలేజీలో రివ్యూ చేస్తే.. 2023 నవంబర్ నుంచి ఏకంగా 24 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ నిధులు రాలేదని స్వయంగా సూపరింటెండెంట్ చెబుతున్నారు. ఇక పోలీసుల పరిస్థితి మరీ దారుణం. వాళ్లకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ బంద్ అయింది, భద్రత లేదు, EHS వర్తించడం లేదు. ఈ పరిస్థితి చూసి పోలీస్ కానిస్టేబుళ్లు వాపోతున్నారు.

కేసీఆర్ తెలంగాణ తేక‌పోతే.. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి కాళ్ల‌కాడ కూసుండేటోనివి..

రాష్ట్రంలోని 33 కార్పొరేషన్లకు ఏకంగా 14,500 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పి, ఇప్పటివరకు అందులో ఖర్చు చేసింది కేవలం 305 కోట్లు మాత్రమే. బీసీ కార్పొరేషన్‌లో ఖర్చు చేసింది కేవలం 6 కోట్లు మాత్రమే. చైర్మన్ల పదవీకాలం అయిపోతున్నా ఒక్క స్కీమ్ కింద పైసా ఇవ్వలేదు. అసలు నాడు కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించారు కాబట్టే.. నేడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలిగారు. అదే కేసీఆర్ తెలంగాణ తేక‌పోతే, రేవంత్ రెడ్డి ఇవాళ యనమల రామకృష్ణుడు కాళ్లకాడో కూర్చునేవాడు.

కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన దార్శనిక నాయకుడు. నాపై తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నాడు. మూడు నెలలకోసారి ఏదో ఒక అంశంపై నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను విమర్శించడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడమే.

దళితులకు, గిరిజనులకు, బీసీలకు తీవ్ర వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దళితులు, ఎస్టీ, బీసీల కోసం ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క సింగిల్ స్కీమ్ అయినా తెచ్చిందా రేవంత్ రెడ్డి? మీరు గొప్పగా చెప్పిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అంతా చెత్తబుట్ట దాఖలైంది. బడ్జెట్‌లో గొప్పలు చెప్పడమే తప్ప రూపాయి విడుదల చేయడం లేదు. ఎస్సీల కోసం 5,400 కోట్లు పెట్టి ఖర్చు చేసింది కేవలం 74 కోట్లే. గిరిజనుల కోసం 2,730 కోట్లు కేటాయించి ఒక్క గిరిజనుడికి ఒక్క రూపాయి ఇవ్వలేదు, మొత్తం మీద ఖర్చు చేసింది 52 కోట్లు మాత్రమే. దళితబంధు కింద 2 వేల కోట్లు బడ్జెట్లో పెట్టి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు.

అసలు రేవంత్ రెడ్డి కథ ఏంటో, ఆయన చరిత్ర ఏంటో గతంలో స్వయంగా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు. దేవుడు కనపడితే భక్తితో దండం పెట్టుకోవడం నాకు మొదటి నుంచీ ఉన్న అలవాటు. కానీ, దేవుడి పేరుతో కూడా చిల్లర రాజకీయం చేయడం ఒక్క రేవంత్ రెడ్డికే తెలిసిన విద్య. గుడికి వెళ్తే దేవుడికి దండం పెట్టుకుంటారు. నేను ఆధ్యాత్మిక భావనతో తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి వెళ్లాను. కర్ణాటకలోని కొల్లూరు మూకాంబికా అమ్మవారి టెంపుల్‌కు వెళ్లడం కోసం శివమొగ్గ ఎయిర్‌పోర్టుకు వెళ్లాను. దేవుడి దర్శనం కోసం నేను గుడికి వెళ్లడం కూడా ముఖ్యమంత్రికి తప్పుగా కనిపిస్తోందా?

అలాంటి పూజ‌లు చేసిన‌ట్లు ఆధారాలు బ‌య‌టపెట్టు..

నేను ఎయిర్‌పోర్టుకు వెళ్లినప్పుడు అక్కడ ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులు నన్ను గుర్తుపట్టి నా ఫోటోలు తీసుకున్నారు, నాతో పాటు అభిమానంతో వాళ్లు కూడా ఫోటోలు దిగారు. కానీ నేను అక్కడ ఏవో పూజలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. నేను నిజంగా అలాంటి పూజలు చేసినట్లు ముఖ్యమంత్రి దగ్గర ఆధారాలు ఉంటే తక్షణమే బయటపెట్టాలని సవాల్ విసురుతున్నా. కేవలం నా మీద బురదజల్లి, నా వ్యక్తిగత ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనే కుట్రతోనే ఈ పూజల డ్రామా ఆడుతున్నారు.

ఏడుసార్లు డిపాజిట్లు రాకుండా చేసిన చరిత్ర నాది..

మానుకోటలో బుల్లెట్లు పడుతుంటే.. రక్తపు మడుగులో ఉన్నవారిని నా భుజాలపై ఎత్తుకుని ఆసుపత్రికి పరుగెత్తిన. ఉద్యమ సమయంలో వందల సార్లు ఢిల్లీ హైకోర్టు చుట్టూ తిరిగిన చరిత్ర నాది. నా పోరాటాన్ని, త్యాగాలను చూసి ప్రజలు ఈ రాష్ట్రంలో ఎవరికీ రానంత మెజార్టీతో ఏకంగా లక్షా 20 వేల ఓట్లతో నన్ను గెలిపించారు. నాపై పోటీ చేసిన ప్రత్యర్థులకు ఏడుసార్లు డిపాజిట్లు రాకుండా చేసిన చరిత్ర నాది. నా గురించి, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే స్థాయి రేవంత్ రెడ్డికి లేదు అని హ‌రీశ్‌రావు హిత‌వు ప‌లికారు.

Advertisement
Advertisement